బీజేపీలో అధ్యక్ష లొల్లి!

బీజేపీలో అధ్యక్ష లొల్లి!
  • పాత, కొత్త నేతల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు
  • మొన్నటిదాకా ముందు వరుసలో ఈటల పేరు  
  • లెఫ్ట్ బ్యాక్ గ్రౌండ్ కారణంతో ఆయనకు ఇవ్వొద్దంటున్న సంఘ్ వాదులు
  • ధర్మం తెలిసిన వాళ్లకే ఇవ్వాలన్న రాజాసింగ్
  • పొలిటికల్​ సీనియారిటీని చూడాలంటున్న మరో వర్గం
  • విభేదాలతో స్టేట్​ చీఫ్​ ప్రకటనను పెండింగ్​లో పెట్టిన హైకమాండ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర బీజేపీలో అధ్యక్ష పీఠం లొల్లి నడుస్తున్నది. పొలిటికల్​ సీనియారిటీ ఉన్నవాళ్లనే కొత్త చీఫ్​గా నియమించాలని ఒక వర్గం.. పార్టీ సిద్ధాంతాలు, ధర్మం గురించి తెలిసినవాళ్లకే అవకాశం ఇవ్వాలని మరో వర్గం పట్టుబడుతున్నాయి. ఇది పాత, కొత్త నేతల మధ్య తీవ్ర విభేదాలకు కారణమైంది. రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లు గెలిచిన ఆనందోత్సవాల్లో ఉన్న కేడర్​ను ఈ అధ్యక్ష పీఠం పంచాయితీ  కలవరపరుస్తున్నది. 

బీజేపీలో చేరాలనుకునే ఇతర పార్టీల నేతలు కూడా తాజా పరిణామాలు చూసి కొంత ఆలోచనలో పడ్డారు.  ఎవరి వాదన వాళ్లదే ఆరు నెలల కింద జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లను కైవసం చేసుకుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డికి మరోమారు కేంద్ర కేబినెట్​లో స్థానం దక్కింది.  

ఆయనతో పాటు పార్టీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్​కి కూడా కేంద్ర మంత్రిగా అవకాశం లభించింది. ఎంపీలుగా గెలిచిన మిగతావాళ్లు కూడా కేంద్ర మంత్రి పదవులు ఆశించారు. కానీ, వాళ్లకు నిరాశే ఎదురైంది. ఇదే క్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి అంశం తెరమీదికి వచ్చింది. త్వరలోనే అధ్యక్ష మార్పు ఉంటుందన్న ప్రచారం జరగడంతో  ఆ పోస్టును దక్కించుకునేందుకు పాత, కొత్త నేతలు పోటీ పడుతున్నారు. అధ్యక్ష పదవి రేసులో ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావు, ధర్మపురి అర్వింద్​తో పాటు ఎమ్మెల్యే రాజాసింగ్, నేతలు రాంచందర్ రావు, చింతల రాంచంద్రారెడ్డి, గంగిడి మనోహర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు ఉన్నారు. ఎవరి ప్రయత్నాల్లో వారు నిమగ్నమయ్యారు. ఇదే క్రమంలో మల్కాజ్​గిరి ఎంపీ ఈటల రాజేందర్ కు ప్రెసిడెంట్ పదవి ఇస్తున్నారనే ప్రచారం మొదలైంది. ఈటల లెఫ్ట్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి అని, ఆయనకు ఆ బాధ్యతలు ఇవ్వొదని సంఘ్ పరివార్ వాదులు అంటున్నారు. కొందరు లీడర్లు బహిరంగగానే తమ వాదనలు వినిపిస్తున్నారు. 

రాష్ట్రంలో రాజకీయ పార్టీకి సంపూర్ణ విజయం దక్కాలంటే కొత్త నాయకత్వం, కొత్త కార్యకర్తలు అవసరమని ఈటల రాజేందర్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఇదే క్రమంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్  ఓ వీడియో రిలీజ్ చేశారు. దేశం, ధర్మంపై అవగాహన ఉన్న వాళ్లకే  ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని, పార్టీలోని ముఖ్య నేతలతో చర్చించిన తర్వాతే అధ్యక్షుడి పేరును ప్రకటించాలని బీజేపీ అధిష్టానాన్ని ఆయన కోరారు. ఇది ఈటల రాజేందర్​కు కౌంటర్​గానే ఇచ్చిన స్టేట్​మెంట్​ అని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. కాగా, రెండ్రోజుల కింద మెదక్​ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. కొత్తగా వచ్చిన వాళ్లకు బీజేపీలో పదవులు రావనేది ఉండదని, అస్సాంలో సీఎం పదవిని కొత్తగా వచ్చిన హిమంత బిశ్వశర్మకు ఇచ్చారని తెలిపారు.  

ప్రకటన వాయిదా?

పార్టీ రాష్ట్ర అధ్యక్ష పీఠం కోసం పాత, కొత్త నేతల్లో నెలకొన్న కోల్డ్​ వార్​ బీజేపీ హైకమాండ్​ దృష్టికి చేరింది. దీంతో ఎవరిని ప్రెసిడెంట్​గా ప్రకటించాలనే దాన్ని హైకమాండ్​ వాయిదా వేసినట్లు తెలుస్తున్నది. బీజేపీ జాతీయ అధ్యక్షుడి ప్రకటన తర్వాతే, స్టేట్ ప్రెసిడెంట్ పేరును ప్రకటించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్​రెడ్డి కొనసాగుతున్నారు. 

అటు కేంద్ర మంత్రిగా కూడా ఆయన ఉన్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్​ చేసిన వ్యాఖ్యలపై రెండురోజుల కింద కిషన్​రెడ్డిని మీడియా ప్రశ్నించగా.. అది పార్టీ అంతర్గత వ్యవహారమని, అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై నెలకొన్న పంచాయితీ.. కొత్తగా ఆ పార్టీలో చేరాలనుకున్న ఇతర పార్టీల నేతలను ఆలోచనలో పడేసింది.  ప్రెసిడెంట్ పోస్టు ప్రకటన తర్వాతే, బీజేపీలో చేరాలా లేదా అనే దానిపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.