ఎన్నికలకు రెడీ అవుతున్న బీజేపీ.. ఓవైపు ప్రజా కార్యాచరణ, మరోవైపు.. టికెట్లపై కసరత్తు

ఎన్నికలకు రెడీ అవుతున్న బీజేపీ.. ఓవైపు ప్రజా కార్యాచరణ, మరోవైపు.. టికెట్లపై కసరత్తు
  • ఎన్నికలకు రెడీ అవుతున్న బీజేపీ
  • ఓవైపు ప్రజా కార్యాచరణ, మరోవైపు.. టికెట్లపై కసరత్తు
  • గెలుపు గుర్రాల లిస్ట్ రెడీ చేస్తోన్న బీజేపీ
  • ముందుగానే టికెట్లు ప్రకటిస్తే బెటర్ అంటున్న ఆశావాహులు
  • వచ్చే నెల రెండో వారంలో 119 నియోజకవర్గాలకు ఎమ్మెల్యేల ప్రకటన
  • వారంపాటు నియోజకవర్గాల్లోనే మకాం 

తెలంగాణ రాష్ర్టంలో ఎలక్షన్స్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ అన్ని పార్టీలు అలర్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ పార్టీ ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని వ్యూహా రచన చేస్తోంది. దీనిపై పార్టీలో పెద్ద కసరత్తే జరుగుతోంది. టికెట్లు ఆశించే నాయకులు కూడా ముందుగానే తమ పేర్లను ప్రకటించాలని కోరుతున్నారు. ముందుగానే టికెట్లు కేటాయిస్తే బెటర్ అని ఆశావాహలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అధిష్టానం గెలుపు గుర్రాల లిస్ట్ ను రెడీ చేస్తోంది.

అతి త్వరలోనే తెలంగాణ రాష్ర్టంలోని119  నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించనుంది బీజేపీ అధిష్టానం. ఇప్పటికే రాష్ర్టంలో ఎన్నికల వాతావరణం క్రియేట్ చేస్తోంది. మిగతా రాజకీయ పార్టీల కంటే ముందుగానే రెడీ అవుతోంది. ఎప్పటి నుంచో బీజేపీ జాతీయ నాయకులు, కేంద్రమంత్రులు తెలంగాణ రాష్ర్టానికి వస్తున్నారు. ఓవైపు ఎన్నికల హడావుడిని క్రియేట్ చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందనే సంకేతాలను పంపిస్తున్నారు. అయితే.. ఈ మధ్య రాష్ర్ట అధ్యక్షుడి మార్పుతో పాటు.. పార్టీలో నెలకొన్న అనిశ్చితి.. నాయకుల మధ్య విబేధాలు కొంత పార్టీని ఇబ్బంది పెట్టాయి. అంతేకాదు.. పార్టీ క్యాడర్ లో జోష్ ను తగ్గించింది.

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీ అధినాయకత్వం తెలంగాణపై చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టింది. 119 నియోజకవర్గాల్లోనూ అమిత్ షా టీమ్ ఇప్పటికే పర్యటించినట్లు తెలుస్తోంది. దాదాపు మూడుసార్లు సర్వేలు చేయించారని చెబుతున్నారు. ఆ రిపోర్టులు కూడా బీజేపీ అధిష్టానం వద్దకు వెళ్లాయంటున్నారు. రాష్ర్ట ప్రజలు బీజేపీ గురించి ఏమనుకుంటున్నారు. ఓటరు నాడి విశ్లేషణ ఎలా ఉంది. రాష్ర్ట ప్రభుత్వ పరిపాలనపై ప్రజలు ఏముకుంటున్నారు. పథకాలు అందుతున్నాయా..? లేదా... ప్రభుత్వ తీరుపై ప్రజల ఓపీనియన్ కు సంబంధించిన సర్వే రిపోర్టులు బీజేపీ అధిష్టానం వద్దకు చేరాయి. ఈ రిపోర్టు ఆధారంగా కూడా అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉందంటున్నారు. 

ఆగష్టు 2వారంలో బీజేపీ జాతీయ నాయకులు, కేంద్రమంత్రులు తెలంగాణ రాష్ర్టానికి రానున్నారు. దాదాపు వారం పాటు నియోజకవర్గాల్లోనే మకాం వేయనున్నారు. 119 నియోజకవర్గాల్లో జాతీయ నాయకులు సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. వారంతా పార్టీ బలోపేతం కోసం కృషి చేయనున్నారు. పార్టీ ఏ నియోజకవర్గంలో వీక్ ఉంది..? బలోపేతం కావాలంటే ఏం చేయాలి...? వంటి సలహాలు, సూచనలు లోకల్ లీడర్లు, టికెట్లు ఆశించే వారికి చెప్పనున్నారు. ఇదే రిపోర్టులను అధిష్టానానికి కూడా పంపించనున్నారు. 

మరోవైపు.. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో టికెట్లు ఆశిస్తున్న వారు చాలా చురుగ్గా ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజాసమస్యలపై పోరాడుతున్నారు. మహిళా సంఘాలు, యువజన సంఘాలతో తరచూ భేటీ అవుతున్నారు. పార్టీ బలోపేతం కోసం చేయాల్సిన కార్యాచరణపై సీరియస్ గా ఫోకస్ పెడుతున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు.. ఇతర పార్టీల నుంచి వచ్చిన సీనియర్ నాయకులకు ముందుగానే టికెట్లు కేటాయించాలనే డిమాండ్లు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అయితే.. బీజేపీలో మాత్రం అంత ఈజీగా టికెట్లు ఖరారు చేయరు. గెలుపు గుర్రాలకే టికెట్లు ఖరారు చేసే అవకాశం ఉంది.