
- ఆగస్టు 5, 6, 7 తేదీల్లో హస్తిన వేదికగాపోరాడాలని కేబినెట్ భేటీలో నిర్ణయం
- 5న పార్లమెంట్లో వాయిదా తీర్మానం.. 6న జంతర్ మంతర్ దగ్గర ధర్నా
- బిల్లులు, ఆర్డినెన్స్ ఆమోదం కోసం 7న రాష్ట్రపతికి వినతిపత్రం అందజేత
- రాష్ట్రపతిని కలువనున్న సీఎం, మంత్రులు సహా 200 మంది బీసీ ప్రతినిధులు
- 5వ తేదీనే ఢిల్లీకి వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- రవాణా శాఖ అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల రద్దుకు కేబినెట్ ఓకే
- కోర్ తెలంగాణ అర్బన్ సిటీతో పాటు అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో మైక్రో బ్రూవరీస్ ఏర్పాటుకు నిర్ణయం
- కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రులు పొన్నం, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ
- బీసీలకు కేసీఆర్ తీరని ద్రోహం చేసిండు: పొన్నం ప్రభాకర్
- బిల్లుల ఆమోదానికి బీజేపీ బీసీ ఎంపీలు కూడా కలిసిరావాలని సూచన
హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్ బిల్లుల ఆమోదానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు షెడ్యూల్ ఖరారు చేశారు. వచ్చే నెల 5, 6, 7 తేదీల్లో ఢిల్లీ కేంద్రంగా అన్నిరకాలుగా పోరాడాలని నిర్ణయం తీసుకున్నారు. 42% బీసీ కోటా బిల్లుల ఆమోదంలో జరుగుతున్న జాప్యంపై నిరసన తెలిపేందుకు తొలుత 5న పార్లమెంట్ లో పార్టీ ఎంపీల ద్వారా వాయిదా తీర్మానం ఇవ్వనున్నారు. 6న రాష్ట్రంలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులందరితో ‘చలో ఢిల్లీ’ కార్యక్రమం నిర్వహించి జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగనున్నారు. మరుసటి రోజు అంటే 7న సీఎంతో పాటు మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, బీసీ సంఘాల నేతలు.. దాదాపు 200 మంది ప్రతినిధులతో రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం అందజేయనున్నారు.
కాగా, పంచాయతీ రాజ్ చట్టం 2018లో రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేస్తూ తెచ్చిన ఆర్డినెన్స్ ఫైల్ ను రాష్ట్ర ప్రభుత్వం జులై 14న గవర్నర్ కు పంపగా.. ఆ ఫైల్‌ను కూడా గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు పంపించినట్లు ప్రభుత్వానికి సమాచారం అందింది. దీంతో బీసీ బిల్లులతోపాటు ఆర్డినెన్స్‌ను ఆమోదించుకోవడమే లక్ష్యంగా మూడు రోజుల చలో ఢిల్లీ పర్యటన చేపడ్తున్నామని, బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాల నేతలతో పాటు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తరలిరావాలని, ముఖ్యంగా ఐదుగురు బీజేపీ బీసీ ఎంపీలు కూడా కలిసి రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియెట్‌లో సోమవారం దాదాపు నాలుగున్నర గంటలపాటు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు కొండా సురేఖ, వాకిటి శ్రీహరితో కలిసి పొన్నం ప్రభాకర్ మీడియాకు వివరించారు. కాగా, బీసీ బిల్లులపై పోరాటం కోసం ఆగస్టు 5న ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లి మూడురోజుల పాటు అక్కడే ఉండి కార్యాచరణను అమలు చేయనున్నారు.
రవాణా శాఖకు సంబంధించి రాష్ట్రంలో ఉన్న అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను రద్దు చేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర సరిహదుల్లో మొత్తం 15 చెక్ పోస్టులు ఉన్నాయి. జాతీయ రహదారులపై రవాణాకు ఇబ్బంది లేకుండా ఈ చెక్ పోస్టులను తొలిగించాలని కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాలకు సూచించింది. చెక్ పోస్టుల్లో సిబ్బందితో కాకుండా ఇకపై వాహన్, అడ్వాన్డ్ సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ కొనసాగుతుంది. కోర్ తెలంగాణ అర్బన్ సిటీ ఏరియాతో పాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్స్ లో మైక్రో బ్రూవరీస్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మైక్రో బ్రూవరీస్ చట్టానికి పలు సవరణలు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
చట్టం తెచ్చి బీసీలకు కేసీఆర్ ద్రోహం చేసిండు: పొన్నం
గతంలో పదేండ్లు రాష్ట్రానికి సీఎంగా ఉన్న కేసీఆర్ బీసీలకు తీరని ద్రోహం చేశారని కేబినెట్‌లో చర్చించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అన్ని సామాజికవర్గాల రిజర్వేషన్ల పరిమితి 50 శాతం దాటకూడదని 2018లో పంచాయతీరాజ్ చట్టంలో ప్రత్యేక నిబంధనను పొందుపరిచారని, కేసీఆర్ తెచ్చిన ఈ చట్టం బీసీల రిజర్వేషన్ల పెంపునకు ప్రధాన అడ్డంకిగా మారిందన్నారు.. అందులో భాగంగానే కేసీఆర్ బీసీలకు చేసిన ద్రోహాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం జులై 10న జరిగిన కేబినెట్ మీటింగ్‌లో ఆ చట్టాన్ని సవరించాలని నిర్ణయం తీసుకుని, చట్ట సవరణ చేస్తూ ఆర్డినెన్సు తీసుకురావాలని తీర్మానించిందని పేర్కొన్నారు. చట్టంలో ఉన్న 50 శాతం రిజర్వేషన్ల సీలింగ్ నిబంధనను ఎత్తివేసేలా సవరణ ఆర్డినెన్స్ ఫైల్ ను జులై 14న గవర్నర్ కు ప్రభుత్వం పంపిందని తెలిపారు. ఈ ఆర్డినెన్స్ ఫైలును కూడా గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు పంపినట్లు సమాచారం అందిందని.. అందుకే బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన రెండు బిల్లులు, ఒక ఆర్డినెన్స్‌ను వెంటనే ఆమోదించాలని రాష్ట్ర కేబినెట్ రాష్ట్రపతికి విజ్ఞప్తి చేయడంతో పాటు ఆగస్టు 5, 6, 7 తేదీల్లో జాతీయ స్థాయిలో అవసరమైన కార్యాచరణ చేపట్టాలని నిర్ణయం తీసుకుందని ఆయన మీడియాకు వివరించారు. స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీలకు రాజకీయ ప్రాతినిథ్యం కల్పించాలని ఈ ఏడాది మార్చిలోనే అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం బిల్లును ఆమోదించిందన్నారు. విద్యా, ఉద్యోగ అవకాశాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మరో బిల్లును కూడా అప్పుడే ఆమోదించిందని గుర్తుచేశారు.
మార్చి 17న తెలంగాణ అసెంబ్లీ, మార్చి 18న తెలంగాణ కౌన్సిల్ ఆమోదించిన ఈ రెండు ఈ బిల్లులు మార్చి 22న గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం పంపించిందని వివరించారు. మార్చి 30 నాడు ఈ బిల్లులను గవర్నర్ రాష్ట్రపతి ఆమోదానికి పంపించారని.. ఇప్పటికీ ఆ బిల్లులు రాష్ట్రపతి వద్దే పెండింగ్‌లో ఉన్నాయన్నారు. బీసీల రిజర్వేషన్ల పెంపు నిర్ణయంపై రాష్ట్రంలో స్థానిక ఎన్నికల ప్రక్రియ ముడిపడి ఉందని పేర్కొన్నారు. మూడు నెలల్లోనే స్థానిక ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఇప్పటికే రాష్ట్ర హైకోర్టు ఆదేశించిందని.. ఈ నెలాఖరులోపు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించిందని తెలిపారు. అందుకే బీసీల రిజర్వేషన్ల సాధనకు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టంచేశారు. తెలంగాణలోని బీసీ మేధావులు, బీసీ నాయకులు, కుల సంఘాల నాయకులను కూడా ఢిల్లీకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ బాధ్యత క్షేత్ర స్థాయిలో ఉన్న అన్ని కుల సంఘాలది, బీసీ సంఘాలది, బీసీ మేధావులది అని అన్నారు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ సహా మొత్తం కేబినెట్ అంతా తమ లీడర్ రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను అమలు చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని ఆయన పేర్కొన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ నుంచి ప్రస్తుత కేబినెట్ నిర్ణయం వరకు తమ చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరని అన్నారు కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి ఛాంపియన్ అని మంత్రి పొన్నం పేర్కొన్నారు. 50% క్యాప్ అనేది ఈడబ్ల్యూఎస్ స్కీమ్ తర్వాత పోయిందన్నారు. క్యాప్ ఒకసారి ఓపెన్ అయిన తర్వాత పరిమితి ఉండదని, ఎంపరికల్ డేటా ఆధారంగా ముందుకు వెళ్లాలని కోర్టు ఆర్గ్యుమెంట్లలో కూడా ఉందని తెలిపారు.
కొన్ని పార్టీలు నిజాయితీగా లేవు..
బీసీ రిజర్వేషన్లపై కొన్ని రాజకీయ పార్టీలు నిజాయితీగా లేవని, అసెంబ్లీలో బిల్లులకు మద్దతు ఇచ్చి ఢిల్లీకి వెళ్లగానే అడ్డుపడుతున్నాయని ఆయన మండిపడ్డారు. అయినా కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. ‘‘బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్‌రావు న్యాయవాది. 50% క్యాప్ గురించి ఆయన మాట్లాడ్తున్నరు. ఇందిరా సాహ్ని కేసులో ఎంపరికల్ డేటా ఉన్నప్పుడు రాష్ట్రాలు ముందుకు వెళ్లవచ్చనేది స్పష్టంగా ఉంది. ఈ విషయం ఆయన గుర్తించాలి. ఆర్. కృష్ణయ్య లాంటి వారు శాసనసభల్లో బీసీలకు ప్రాతినిధ్యం కావాలని చాలా రోజులుగా అడుగుతున్నరు. ఐదుగురు బీసీ ఎంపీలు, ఇద్దరు బీసీ ఎమ్మెల్సీలు ఉన్నప్పుడు బీజేపీ బీసీల అభివృద్ధికి ఎందుకు సహకరించడం లేదు?” అని ఆయన ప్రశ్నించారు.
కిషన్‌రెడ్డి రాజీనామా వద్దు.. బిల్లులకు సహకరిస్తే చాలు
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాజీనామా చేయాలని తాము కోరడం లేదని, బీసీ బిల్లుల ఆమోదానికి సహకరించాలని మాత్రమే అడుగుతున్నామని మంత్రి పొన్నం అన్నారు. ‘‘మాకు ఎవరి పదవులు అవసరం లేదు. 42% రిజర్వేషన్ల పెంపు అనేది బీసీల హక్కు. ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీలు అనే తేడా లేకుండా అందరూ సహకరించాలి” అని ఆయన కోరారు. రాష్ట్రపతి జోక్యం చేసుకుని బీసీ బిల్లులను ఆమోదింపజేయాలని రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకత్వానికి, ఆ పార్టీ కార్యకర్తలకు, ముఖ్యంగా బీసీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ పార్టీ ఐదుగురు బీసీ ఎంపీలైన ధర్మపురి అర్వింద్, బండి సంజయ్, ఈటల రాజేందర్, ఆర్ కృష్ణయ్య, లక్ష్మణ్‌తో పాటు ఎమ్మెల్యే పాయల్ శంకర్‌కు తాను విజ్ఞప్తి చేస్తున్నట్లు పొన్నం చెప్పారు. ‘‘బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్‌రావు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే, బీజేపీ బీసీ నాయకత్వం దాన్ని ఖండించి బలహీన వర్గాలకు మద్దతు ఇస్తుందని ఆశించాను” అని తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్లపై సమగ్ర నివేదిక
పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలుపై కేబినెట్ భేటీలో చర్చించారు. పట్టణ ప్రాంతాల్లో స్థలాలు లేనివారి సంఖ్య ఎక్కువగా ఉన్నది. దీంతోపాటు స్లమ్ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నవారికి అక్కడే జీ ప్లస్ 3 అపార్ట్మెంట్ల మాదిరిగా ఇందిరమ్మ ఇండ్లు కట్టించాలని ప్రభుత్వం భావిస్తున్నది. అక్కడున్నవారికి కూడా ఒక్కొక్కరికి ఒక్కోలా స్థలం ఉన్నది. ఉదాహరణకు ఒకరికి 15 గజాల్లో ఉంటే.. మరొకరి 30 గజాల్లో ఉన్నది. దీంతో ఎవరికి నష్టం జరగకుండా.. ఎక్కువ మంది లబ్ధిదారులకు మేలు జరిగేలా అర్బన్ ఏరి యాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఉండాలని కేబినెట్‌లో నిర్ణయించారు. మంత్రలందరూ అర్బన్ హౌసింగ్‌పై సూచనలు చేసినట్లు తెలుస్తున్నది. పట్టణాల్లో, ముఖ్యంగా మురికివాడల్లో నివసిస్తున్న పేదల పూర్తిస్థాయి సర్వే నిర్వహించడంతో పాటు వారి ప్రస్తుత నివాస స్థలం, దాని విస్తీర్ణం, కుటుంబ సభ్యుల సంఖ్య, ఆర్థిక పరిస్థితి వంటి వివరాలను సేకరించాలని నిర్ణయించారు. సమగ్ర నివేదిక ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా రూపొందించాలని భావిస్తున్నారు. ఇక అసలు స్థలాలు లేని వాళ్లకు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న నిరుపయోగమైన భూములను గుర్తించి, వాటిని గృహ నిర్మాణాలకు కేటాయించాలని కేబినెట్‌లో చర్చించారు.
సాగునీటి ప్రాజెక్టులపై..
వివిధ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన సవరించిన అంచనాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో సీతారామ సాగర్ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని ప్రభుత్వం రూ.13,057 కోట్ల నుంచి రూ.19,325 కోట్లకు పెంచింది. సదర్‌మాట్ బరా జ్ అంచనా వ్యయాన్ని రూ.516 కోట్ల నుంచి రూ. 676 కోట్లకు సవరించింది. మోడికుంట వాగు ప్రాజెక్టు వ్యయాన్ని రూ.522 కోట్ల నుంచి 714 కోట్లకు పెంచింది. అలాగే, దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించి ఫేజ్3లోని ప్యాకేజీ 2 పనులను రూ.526 కోట్ల నుంచి రూ.1,348 కోట్లకు సవరిం చింది. సాగర్ ఎడమ కాలువ ముక్త్యాల బ్రాంచ్ కెనాల్‌పై ముక్తేశ్వరపురం, గనపవరం మేజర్ కెనాల్ చివరి ఆయకట్టుకు నీరందించేందుకు సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం బుగ్గమందారం గ్రామంలో కృష్ణా రివర్‌పై రాజీవ్‌గాంధీ లిఫ్ట్ ఇరిగే షన్ స్కీమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. అందుకు రూ.415 కోట్లతో పరిపాలన అనుమతులను మం జూరు చేస్తూ కేబినెట్ఆమోదం తెలిపింది.