అసైన్డ్ భూములపై కేబినెట్‌‌‌‌ కు రిపోర్ట్..అజామాబాద్, బాలానగర్, హఫీజ్‌‌‌‌పేటల్లో భూముల క్రమబద్ధీకరణ

అసైన్డ్ భూములపై కేబినెట్‌‌‌‌ కు రిపోర్ట్..అజామాబాద్, బాలానగర్, హఫీజ్‌‌‌‌పేటల్లో భూముల క్రమబద్ధీకరణ
  •     మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ల్యాండ్ పూలింగ్
  •     హెచ్‌‌‌‌ఎండీఏ, టీజీఐఐసీ భూముల వేలం
  •     అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అసైన్డ్ భూములపై పూర్తి వివరాలను రాష్ట్ర కేబినెట్​కు సమర్పించాలని రిసోర్స్​మొబిలైజేషన్ కేబినెట్​సబ్ కమిటీ నిర్ణయించింది. ఆదాయ వనరుల సమీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం సెక్రటేరియెట్​లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశమైంది. ఉపసంఘం సభ్యులు, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఇందులో పాల్గొని రాష్ట్ర ఆదాయ మార్గాలపై సమీక్షించారు. 

రాష్ట్ర ఆర్థిక వనరులను బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వం నిర్దేశించిన ఆదాయ లక్ష్యాలను నిర్ణీత గడువుల్లోగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం  ఆదేశించారు. ప్రభుత్వ భూములు, పారిశ్రామిక లేఅవుట్లు, ల్యాండ్ పూలింగ్, భూముల వేలం ద్వారా ఆదాయ సమీకరణకు ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. ఇందుకోసం ప్రతి శాఖ కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా అజామాబాద్, బాలానగర్, హఫీజ్‌‌‌‌పేట వంటి పాత పారిశ్రామిక ప్రాంతాల్లో యూనిట్లవారీగా భూముల క్రమబద్ధీకరణ, అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. బీ–కేటగిరీ, సూక్ష్మ పారిశ్రామిక యూనిట్ల ప్రతిపాదనలను పరిశీలించి పారిశ్రామికవేత్తలకు మేలు చేయడంతో పాటు సర్కారుకు అదనపు ఆదాయం సమకూరేలా చూడాలన్నారు. 

సర్కారు ఆస్తుల పర్యవేక్షణకు డిజిటల్ డ్యాష్‌‌‌‌బోర్డ్

రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ల్యాండ్ పూలింగ్, భవిష్యత్ అవసరాలకు భూముల లభ్యతపై సమావేశంలో చర్చించారు. ప్రధాన రహదారులకు అనుసంధానమై వేలానికి అనువైన లేఅవుట్లను గుర్తించి దశలవారీగా వేలం వేయాలని, వచ్చే వారంలోగా కార్యాచరణను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఒకే వేదికపై సమగ్ర సమాచారం ఉండేలా ప్రత్యేక ‘డిజిటల్ డ్యాష్‌‌‌‌బోర్డ్’ను రూపొందించాలని స్పష్టం చేశారు.

హజ్ హౌస్ పక్కన భవనానికి రూ.25 కోట్లు

రాష్ట్రంలోని మైనార్టీల సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్ధితో పాటు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన ప్రజాభవన్‌‌‌‌లో మైనార్టీ శాఖ మంత్రి అజారుద్దీన్‌‌‌‌తో కలిసి మైనార్టీల సంక్షేమం, ఓల్డ్ సిటీ అభివృద్ధిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 

నాంపల్లి హజ్‌‌‌‌హౌస్‌‌‌‌ పక్కన కొన్నేళ్లుగా అసంపూర్తిగా ఉన్న బహుళ అంతస్తుల భవనాన్ని పూర్తి చేసేందుకు.. రోడ్ల విస్తరణలో వక్ఫ్ భూములకు సంబంధించి జీహెచ్‌‌‌‌ఎంసీ నుంచి వక్ఫ్ బోర్డుకు రావాల్సిన బకాయిల్లో రూ.25 కోట్లను కేటాయించాలని అధికారులను భట్టి ఆదేశించారు. మీటింగులో  ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ, ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, కార్యదర్శి బి.షఫీఉల్లా, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్నన్ తదితరులు పాల్గొన్నారు.