- సదర్.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ సమ్మేళనం
- యాదవులు కోరగానే రాష్ట్ర పండుగగా ప్రకటించాం
- పండుగ నిర్వహణకు రూ.5 కోట్లు మంజూరు చేశాం
- సదర్ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- జైళ్లకు మేం భయపడం.. మా శ్రీకృష్ణుడే జైల్లో పుట్టాడు
- ధీరేంద్ర శాస్త్రి మోదీ ఏజెంట్.. కృష్ణుడిపై వాగితే ఊరుకోం
- బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్
హైదరాబాద్, వెలుగు: యావత్ దేశం మెచ్చేలా కులగణన చేపట్టిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తమ ప్రజా ప్రభుత్వంలో యాదవులకు రాజకీయంగా, పాలనాపరంగా సముచిత స్థానం కల్పిస్తున్నామని, రాబోయే రోజుల్లో న్యాయమైన వాటా ఇస్తామని సీఎం స్పష్టం చేశారు. ఎన్టీఆర్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సదర్ సమ్మేళనంలో సీఎం మాట్లాడారు. యాదవ ముద్దుబిడ్డ అనిల్ కుమార్ యాదవ్‌కు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించి గౌరవించామని తెలిపారు.
నవీన్ యాదవ్‌ను ఎమ్మెల్యేగా గెలిపించుకుని శాసనసభకు పంపామని, ఈశ్వరమ్మ యాదవ్‌ను ప్రతిష్టాత్మక యాదగిరిగుట్ట ఆలయ బోర్డు సభ్యురాలిగా నియమించామని గుర్తుచేశారు. జంగయ్య యాదవ్‌ను మల్కాజ్‌గిరి జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా, అంజన్ కుమార్ యాదవ్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించి ప్రభుత్వంలో, పార్టీలో యాదవులకు పెద్దపీట వేశామన్నారు. ఇదే సమయంలో ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైన యాదగిరిగుట్ట దేవాలయ గోశాలలో శాస్త్రీయ పద్ధతుల్లో గోసంరక్షణ చేసేందుకు ప్రభుత్వం భారీ గోశాలతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నదని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లోనూ యాదవులకు రాజకీయంగా, సామాజికంగా దక్కాల్సిన వాటా దక్కేలా అన్ని చర్యలు తీసుకుంటామని, యాదవ సోదరుల ఆత్మగౌరవానికి ఎక్కడా లోటు రాకుండా చూసే పూర్తి బాధ్యత తమ ప్రభుత్వానిదేనని సీఎం రేవంత్ తెలిపారు.
జనాభాకు తగ్గ వాటా..
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ తనను అప్పుడప్పుడు ‘రేవంత్ గౌడ్’ అని, అనిల్ యాదవ్ ‘రేవంత్ యాదవ్’ అని, ముదిరాజ్‌లు ‘రేవంత్ ముదిరాజ్’ అని పిలుస్తుంటారని, వెనుకబడిన వర్గాలన్నింటినీ గుండెల్లో పెట్టుకుని న్యాయం చేయడమే తన కర్తవ్యమని చెప్పారు.
రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే (కులగణన)తో "ఎవరి జనాభా ఎంతో.. వారికి అంత వాటా" ఇచ్చేలా కార్యాచరణ చేపట్టామని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణ చేపట్టిన ఈ కులగణన దేశంలోనే బెస్ట్ మోడల్‌గా నిలిచిందని, కేంద్ర ప్రభుత్వం సైతం ఈ విధానాన్ని పరిశీలిస్తోందన్నారు. సదర్ సమ్మేళనం కేవలం యాదవులకే కాకుండా యావత్ తెలంగాణ ప్రజలందరికీ ఆత్మగౌరవ సమ్మేళనమని సీఎం స్పష్టం చేశారు.
వాస్తవానికి బుధవారమే రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించాల్సి ఉందని, కానీ సదర్ సమ్మేళనం ఉన్న విషయాన్ని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ తన దృష్టికి తేవడంతో మంత్రివర్గ భేటీని 5వ తేదీకి వాయిదా వేసినట్లు చెప్పారు. ఉమ్మడి ఏపీలో గానీ, పదేండ్ల తెలంగాణలో గానీ ఏ సీఎం కూడా సదర్‌ను అధికారిక పండుగగా గుర్తించాలనే ఆలోచన చేయలేదన్నారు. అంజన్ కుమార్ యాదవ్, అనిల్ యాదవ్, శంకర్ యాదవ్ కోరగానే తాను సీఎస్‌కు ఆదేశాలిచ్చి సదర్‌ను రాష్ట్ర పండుగగా ప్రకటించడంతోపాటు నిర్వహణ కోసం ప్రభుత్వ బడ్జెట్ నుంచి రూ.5 కోట్లు విడుదల చేశామని చెప్పారు.
నాటి గొల్లకొండే.. నేటి గోలుకొండ..
తేజస్వీ యాదవ్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీహార్, యూపీ, హర్యానా, ఢిల్లీ, పంజాబ్‌లలోనే యాదవుల ప్రాబల్యం ఉందని చాలామంది భావిస్తారని, కానీ చరిత్ర చూస్తే హైదరాబాద్‌లోని చారిత్రక గోల్కొండ కోట ఒకనాటి ‘గొల్లకొండ’ కోట అని, అది యాదవ రాజుల కోట అని పేర్కొన్నారు. నాటి కాకతీయ సామ్రాజ్యాన్ని కూడా యాదవ రాజులే బలపరిచారని చరిత్ర చెబుతోందన్నారు. దేశ, విదేశాల నుంచి చదువు, ఉద్యోగాలు, వ్యాపారాల కోసం నగరానికి వచ్చిన ఇతర ప్రాంతాల ప్రజలందరినీ యాదవులు కడుపులో పెట్టుకుని చూసుకున్నారని, హైదరాబాద్‌లో శాంతిభద్రతలను కాపాడి నగర ప్రగతిలో భాగస్వాములయ్యారని ప్రశంసించారు. ఒకవేళ దేశంలో ఆర్బీఐ బంద్ అయినా సరే.. హైదరాబాద్‌లోని ఏ యాదవ్ సోదరుడి ఇంటికి వెళ్లినా రెండు కోట్ల రూపాయలు సులభంగా సర్దుబాటు అవుతాయని, నగరంలో కోటీశ్వరులైన యాదవులతో పాటు పేద యాదవులూ ఉన్నారని పేర్కొన్నారు.
యాదాద్రిలో ఆధునిక గోశాల..
యాదాద్రి క్షేత్రంలో గోసంపదను పరిరక్షించేందుకు అతిపెద్ద ఆధునిక గోశాలను నిర్మిస్తున్నామని, ఆ గోశాల నిర్వహణ, గోసంరక్షణ బాధ్యతలను ఈశ్వరమ్మ యాదవ్‌కు అప్పగిస్తున్నామని సీఎం తెలిపారు. తెలంగాణను దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా మార్చడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఇందుకోసం మూసీ ప్రక్షాళన, రీజినల్ రింగ్ రోడ్డు, భారత్ ఫ్యూచర్ సిటీ, మెట్రో రైల్ విస్తరణ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన చేపడుతున్నామని వివరించారు. ఈ మహా ప్రాజెక్టులు విజయవంతం కావడానికి యాదవ సోదరుల శ్రమ, సంపూర్ణ సహకారం ఎంతో అవసరమని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. భవిష్యత్తులో యాదవులకు దక్కాల్సిన వాటాను తప్పకుండా అందిస్తామని, వారి ఆత్మగౌరవాన్ని సదా కాపాడుకుంటామని హామీ ఇచ్చారు.
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ రాజ్యాంగాన్ని కాలరాయాలని చూస్తున్నయ్
తెలంగాణ గడ్డపై యాదవ సోదరులు ప్రదర్శిస్తున్న సదర్ సంస్కృతి, ఉత్సాహం దేశంలో మరెక్కడా కానరాదని తేజస్వీ యాదవ్ కొనియాడారు. యాదవులు ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా లొంగిపోయేది లేదని, పోరాటానికి తాము ఎప్పుడూ భయపడబోమన్నారు. "ఎవరైనా మాతో పెట్టుకుంటే.. వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదు" అని హెచ్చరించారు. తాము భగవాన్ శ్రీకృష్ణుడి వంశస్థులమని, మాధవుడికి, ధర్మానికి రక్షణగా నిలిచేందుకు సర్వస్వాన్నీ త్యాగం చేసే నైజం యాదవులదని తేజస్వీ పేర్కొన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్‌ను మోదీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో ఎంతగా వేధించిందో దేశం మొత్తం చూసిందన్నారు. జైలు పేరు చెప్పి బెదిరిస్తే తాము భయపడే రకం కాదని, తమ దేవుడు శ్రీకృష్ణుడే జైల్లో పుట్టాడని, తమకు జైళ్లు ఆలయాలు, గురుద్వారాలతో సమానమని వ్యాఖ్యానించారు.
జైళ్లకు మేం భయపడం.. మా శ్రీకృష్ణుడే జైల్లో పుట్టాడు
- ధీరేంద్ర శాస్త్రి మోదీ ఏజెంట్.. శ్రీకృష్ణుడిపై వాగితే తగిన బుద్ధి చెబుతాం
- దున్నపోతుల కొమ్ములనే పట్టి తిప్పేటోళ్లం .. సదర్‌లో బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్
సదర్ సమ్మేళనంలో బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణనను, స్థానిక సంస్థల్లో కల్పించిన రిజర్వేషన్లను ప్రశంసించారు. రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన ప్రతి వర్గానికి భాగస్వామ్యం, హక్కులు దక్కేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగితే.. ఈ ప్రభుత్వాన్ని ఈ గడ్డ నుంచి కదిలించడం ఏ శక్తీ వల్లా కాదని ("కోయి మాయి కా లాల్ హటా నహీ సక్తా") చెప్పారు. తెలంగాణ సర్కారు తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలు సామాజిక న్యాయానికి నిదర్శనమని పేర్కొన్నారు. దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన యాదవుల ఆత్మగౌరవాన్ని కాపాడేలా ఇంతటి మహోత్సవాన్ని నిర్వహిస్తున్నందుకు సీఎం రేవంత్‌తో పాటు నిర్వాహకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ సదర్ స్ఫూర్తిని బిహార్, యూపీ ప్రజలకు తీసుకెళ్తానని తెలిపారు.
బాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి ధీరేంద్ర కృష్ణ శాస్త్రిని 'ధగేష్వర్ శాస్త్రి'గా అభివర్ణిస్తూ తేజస్వీ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. యూపీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మోదీ ఆదేశాలతో ఏజెంట్ లాగా ధీరేంద్ర శాస్త్రి పనిచేస్తున్నారని ఆరోపించారు. మనుషుల మధ్య చిచ్చుపెట్టిన బీజేపీ, ఇప్పుడు ఈ బాబాలతో దేవుళ్లను సైతం విభజించే కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ఆరాధ్య దైవమైన శ్రీకృష్ణుడిపై ధీరేంద్ర శాస్త్రి చేసిన అనుచిత వ్యాఖ్యలను యాదవ సమాజం ఏమాత్రం సహించబోదని హెచ్చరించారు. అలాంటి వ్యక్తులు తెలంగాణకు వచ్చినా, హైదరాబాద్‌కు వచ్చినా ఇక్కడి యాదవులు తగిన బుద్ధి చెప్పి స్వాగతం పలకాలని, అలాగే బిహార్‌కు వస్తే తాము బుద్ధి చెబుతామని పిలుపునిచ్చారు. పిచ్చి దున్నపోతుల కొమ్ములు పట్టి దార్లోకి తెచ్చే తెగువ యాదవుల సొంతమని, అలాంటి తమకు ఈ ధగేష్వర్ శాస్త్రి ఎంతటి వారని ఎద్దేవా చేశారు.
