సీఈఐఆర్ పోర్టల్​తో..189 రోజుల్లో 10 వేల సెల్ ఫోన్ల రికవరీ

సీఈఐఆర్ పోర్టల్​తో..189 రోజుల్లో 10 వేల సెల్ ఫోన్ల రికవరీ

హైదరాబాద్‌‌, వెలుగు : పోగొట్టుకున్న, చోరీకి గురైన సెల్ ఫోన్లను రికవరీ చేయడంలో దేశంలోనే తెలంగాణ సీఐడీ పోలీసులు మొదటి స్థానంలో నిలిచారు. బాధితులు పోగొట్టుకున్న సెల్‌‌ఫోన్లు, చోరీకి గురైన ఫోన్లలో 39 శాతం ట్రేస్‌‌ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌‌ 20వ తేదీ నుంచి ఈ నెల 26 వరకు10 వేల18 సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించారు. ఈ వివరాలను సీఐడీ చీఫ్ మహేశ్​భగవత్ శుక్రవారం వెల్లడించారు. పోగొట్టుకున్న, చోరీకి గురైన సెల్ ఫోన్లను ట్రేస్ చేసేందుకు సెంట్రల్‌‌

ఎక్విప్‌‌మెంట్‌‌ ఐడెంటిటీ రిజిస్టర్‌‌‌‌(సీఈఐఆర్‌‌‌‌) పోర్టల్​కు సంబంధించి సీఐడీ పోలీసులు ఈ ఏడాది ఏప్రిల్19న పైలట్ ప్రాజెక్ట్​కింద ఆపరేషన్స్ నిర్వహించారు. బాధితుల నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు. మే 17న డీజీపీ అంజనీకుమార్ సీఈఐఆర్‌‌‌‌ పోర్టల్​ను అఫిషియల్​గా ప్రారంభించారు. అప్పటి నుంచి సెల్​ఫోన్ల రికవరీని మొదలుపెట్టారు. డిపార్ట్​మెంట్ ఆఫ్ టెలి కమ్యూనికేషన్స్ సహకారంతో దేశవ్యాప్త వెబ్‌‌ పోర్టల్​ను ఆపరేట్ చేస్తున్నారు.

పోలీస్ స్టేషన్‌‌లో స్పెషల్ యూనిట్‌‌

రాష్ట్ర సీఐడీ ఆధ్వర్యంలో సీఈఐఆర్‌‌ పోర్టల్​ను‌‌ నిర్వహిస్తున్నారు. సీఐడీ చీఫ్, అడిషనల్ డీజీ మహేశ్​భగవత్‌‌ నోడల్ ఆఫీసర్‌‌‌‌గా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలోని 780 పోలీస్‌‌ స్టేషన్‌‌లో ప్రత్యేక యూనిట్స్ ఏర్పాటు చేశారు. చోరీకి గురైనా లేదా పోగొట్టుకున్న ఫోన్లకు సంబంధించి బాధితుల నుంచి పోలీస్‌‌స్టేషన్‌‌లో కంప్లయింట్లు తీసుకుంటున్నారు. బాధితులు ఇచ్చే ఐఎమ్‌‌ఈఐ నంబర్లు,సెల్‌‌ఫోన్‌‌ నంబర్‌‌‌‌తో పాటు పూర్తి వివరాలను సీఈఐఆర్‌‌‌‌ పోర్టల్‌‌లో అప్‌‌లోడ్‌‌ చేస్తున్నారు.ఈ విధానంతో బాధితులు కోల్పోయిన ఫోన్లను బ్లాక్ చేస్తారు. తర్వాత ఆ ఫోన్లు దేశంలో ఎక్కడ ఉన్నా సీఈఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తిస్తారు.

ఫోన్ ఆన్‌‌ చేసినా, సిమ్‌‌ కార్డు వేసినా వెంటనే బాధితులకు సమాచారం వచ్చేలా ఏర్పాటు చేశారు. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా 189 రోజుల్లో 10,018 సెల్‌‌ఫోన్లను రికవరీ చేశారు.14 రోజుల వ్యవధిలో వెయ్యి  ఫోన్లను సంబంధిత వ్యక్తులకు అప్పగించారు. ఇందులో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1428, హైదరాబాద్‌‌లో 1206, రాచకొండ కమిషనరేట్‌‌ పరిధిలో 912 ఫోన్లను రికవరీ చేశారు. ఇలా 39 శాతం రికవరీ చేసి దేశంలో మొదటి స్థానంలో నిలిచారు.

ఈ క్రమంలోనే 36 శాతం రికవరీ రేట్‌‌తో కర్నాటక, 30 శాతం రికవరీ రేట్‌‌తో ఏపీ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. మొబైల్ ట్రేసింగ్‌‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సీఐడీ సైబర్ క్రైమ్ ఎస్‌‌పీ లావణ్య సహా సిబ్బందిని డీజీపీ అంజనీకుమార్‌‌‌‌,అడిషనల్‌‌ డీజీ మహేశ్ భగవత్‌‌ అభినందించారు.