
- దీనిని తెలంగాణ ఫిల్మ్ చాంబర్‌గా పేరు మార్చాలి
- తెలంగాణ సినిమా వేదిక డిమాండ్
బషీర్‌బాగ్, వెలుగు: తెలంగాణలో ఉన్న తెలుగు ఫిల్మ్ చాంబర్ లో ఆంధ్రోళ్ల పెత్తనం సాగుతోందని తెలంగాణ సినిమా వేదిక అధ్యక్షుడు లారా ఆరోపించారు. బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో గౌరవ సలహాదారు ప్రపుల్ రాంరెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. తెలుగు ఫిల్మ్ చాంబర్ లో సినారె, పైడి జయరాజ్, దాశరథి ఫొటోలు ఎందుకు పెట్టలేదని అడిగినందుకు సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరిపై ఫిల్మ్ చాంబర్ కార్యదర్శి ప్రసన్న కుమార్ దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా తెలంగాణ కవులు, కళాకారులకు గౌరవం దక్కకపోవడం బాధాకరమన్నారు. గద్దర్ పేరిట తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర నటులకు అవార్డులు ఇచ్చిందని, ఆ గౌరవం కూడా నిలబెట్టుకోకుండా సీఎం ముందే సినిమా డైలాగులతో అవమానకరంగా వ్యవహరించారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తెలుగు ఫిల్మ్ చాంబర్ ను తెలంగాణ ఫిల్మ్ చాంబర్ గా మార్చి, తెలంగాణ నటులను, కవులను, కళాకారులను గౌరవించాలని కోరారు.