దీపావళి వరకు టైమిస్తున్నా.. తీరు మార్చుకోకపోతే మార్చుడే.. కేసీఆర్​ అల్టిమేటం

 దీపావళి వరకు టైమిస్తున్నా.. తీరు మార్చుకోకపోతే మార్చుడే.. కేసీఆర్​ అల్టిమేటం

హైదరాబాద్, వెలుగు: బీఆర్‌‌‌‌ఎస్‌‌ అభ్యర్థులకు పార్టీ అధినేత కేసీఆర్‌‌‌‌ వార్నింగ్ ఇచ్చారు. దీపావళి పండుగ లోపు పని తీరు మార్చుకోవాలని, లేకపోతే మిమ్మల్ని మార్చేయడం ఖాయమని అల్టిమేటం జారీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సరళి, స్థానిక లీడర్లను వారు కలుపుకొని పోతున్న తీరుపై నిత్యం అభ్యర్థులతో ఆయన ఫోన్‌‌లో మాట్లాడుతున్నారు. ప్రగతి భవన్ నుంచి కేసీఆర్‌‌తో పాటు కేటీఆర్, హరీశ్ రావు అభ్యర్థులు, ఎలక్షన్ ఇన్‌‌చార్జ్‌‌లతో వేర్వేరుగా మాట్లాడుతున్నారు. సర్వే ఏజెన్సీల రిపోర్టులు, ఇంటెలిజెన్స్​నివేదికల ఆధారంగా క్యాండిడేట్లు ఏమేం చేయాలో సలహాలు, సూచనలు ఇస్తున్నారు. అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి నిర్వహిస్తున్న సర్వే రిపోర్టుల్లో వెనుకబడి ఉన్న డజను మంది క్యాండిడేట్లకు కేసీఆర్ స్వయంగా క్లాస్ తీసుకున్నట్టు పార్టీలో చర్చ జరుగుతున్నది. ఇంకో రెండు వారాలు డెడ్ లైన్ పెడుతున్నామని, దీపావళి పండుగలోపు నిర్వహించే సర్వేల్లో తీరు మారకపోతే మిమ్మల్ని మార్చేసి, మరొకరిని పోటీకి దింపుతానని చెప్పినట్టు తెలిసింది. 

బీఫామ్ ఇచ్చాం కదా అని పార్టీలో సొంత నాయకులను నిర్లక్ష్యం చేస్తే ఎలా అని పలువురు అభ్యర్థులను కేసీఆర్, కేటీఆర్ ప్రశ్నించినట్టు తెలిసింది. ఇతర ప్రాంతాల నుంచి లీడర్లను తీసుకెళ్లి నియోజకవర్గంలోని నేతలపై రుద్దవద్దని, స్థానిక లీడర్లకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించినట్టుగా తెలుస్తోంది. నవంబర్ 12న దీపావళి పండుగ ఉండగా ఆ మరుసటి రోజు నామినేషన్ల స్క్రూటినీ ఉంది. ఆరోజు వరకు తీరు మారని నేతల బీఫామ్‌‌లను క్యాన్సిల్ చేసేందుకు సీ ఫామ్ ఇచ్చి.. ఇంకొకరికి బీఫామ్ ఇచ్చేందుకు సైతం వెనుకాడబోనని కొందరిని హెచ్చరించినట్లు సమాచారం.

ఫీల్డ్‌‌లో అర డజను సర్వే ఏజెన్సీలు 

బీఫాం అందుకున్న డజను మంది అభ్యర్థుల పనితీరుపై విమర్శలు, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టుగా సర్వేల్లో తేలినట్టు సమాచారం. బీఆర్ఎస్ కోసం ఫీల్డ్‌‌లో అర డజను సర్వే ఏజెన్సీలు పని చేస్తున్నాయి. ఆయా సంస్థల రిపోర్టుల అక్యూరసీపై మరికొన్ని ఏజెన్సీలు గ్రౌండ్ వర్క్ చేస్తున్నాయి. మరోవైపు, ఫీల్డ్‌‌లో ఏం జరుగుతుందో స్టేట్ ఇంటెలిజెన్స్ డైలీ రిపోర్టు ఇస్తూ ఉంటుంది. అలాగే, ప్రగతి భవన్ కేంద్రంగా పని చేస్తున్న వార్‌‌‌‌ రూమ్‌‌లు ఈ రిపోర్టులను క్రోడీకరించి కేసీఆర్‌‌‌‌కు ప్రత్యేక నివేదికలు అందజేస్తున్నాయి. రిపోర్ట్‌‌లో పని తీరు బాగాలేని క్యాండిడేట్లతో కొన్ని రోజులుగా కేసీఆర్ స్వయంగా మాట్లాడుతున్నారు. 

టికెట్ ప్రకటించే నాటికి పరిస్థితి ఏమిటీ.. ప్రస్తుతం ప్రజలు ఏమనుకుంటున్నారు..  అనే వివరాలను అభ్యర్థులకు వివరిస్తూ పనితీరు మార్చుకోవాలని సూచిస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్ హెచ్చరికలతో కొందరు క్యాండిడేట్లు పార్టీ క్యాడర్‌‌‌‌ను కలుపుకొని ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు, రాష్ట్రంలో వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్‌‌‌‌పై ప్రజల్లో కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. ఫీల్డ్‌‌లో ఉన్న ప్రతికూలతలను అధిగమించి హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో ఉన్న కేసీఆర్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకే అన్నీ తానై వ్యవహరిస్తున్నారు.