ఆర్థికంగా ఆదుకోండి.. అమ్మకానికి కేసీఆర్ గుడి

ఆర్థికంగా ఆదుకోండి.. అమ్మకానికి కేసీఆర్ గుడి

దండేపల్లి, వెలుగు: కేసీఆర్‌‌ మీద అభిమానంతో నిర్మించిన గుడిని ఇప్పుడు అమ్మకానికి పెట్టాడో ఓ ఉద్యమకారుడు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రానికి చెందిన ఉద్యమకారుడు గుండా రవీందర్ తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఉద్యమంలో పాల్గొని లాఠీ దెబ్బలు తిన్నారు. పలు కేసులు కూడా ఆయనపై నమోదయ్యాయి. రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి నింపాలనే ఉద్దేశంతో తన ఇంటి వద్ద గుడి కట్టి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహంతో పాటు కేసీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించి, అభిమానాన్ని చాటుకున్నారు. 

ఆ తర్వాత తనకు బీఆర్‌‌‌‌ఎస్ పార్టీలో గుర్తింపు లేకుండా పోయిందని, ఉద్యమ ఆశయం నెరవేరలేదని రవీందర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఆశయాలను బీఆర్‌‌‌‌ఎస్‌‌ ప్రభుత్వం నెరవేర్చలేదని, ఉద్యమకారుడినైన తనకు సర్కార్‌‌‌‌ నుంచి ఎలాంటి లబ్ధి చేకూరలేదన్నారు. పార్టీలో కూడా స్థానిక ఎమ్మెల్యే దివాకర్ రావు తనకు గుర్తింపు ఇవ్వలేదని తెలిపారు.

 కేసీఆర్ గుడి కట్టి తాను ఆర్థికంగా ఎంతో నష్టపోయానని, అందుకే గుడిని అమ్మకానికి పెట్టినట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వివరాలతో గుడి వద్ద ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఆసక్తి గల వారు కేసీఆర్ గుడి, విగ్రహాన్ని కొనుగోలు చేసి తనను ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.