- మా భూములకు సాగునీరు రాలే.. మా కష్టాలు తీరలే
- పరిహారం అడిగిన ఉద్దండాపూర్ నిర్వాసితులను
- జైలులో పెట్టి కొట్టించిన చరిత్ర మీది
- పాదయాత్ర కాదు.. కాశీ దాకా పొర్లుదండాలు పెట్టినా మీ పాపాలు పోవు
- కృష్ణా జలాలపై ఏపీతో చర్చలకు కేసీఆర్ అడ్డుపడుతున్నడు
- ఏపీతో కొట్లాడైనా పాలమూరు–రంగారెడ్డికి 90 టీఎంసీలకు ఎన్‌వోసీ తెస్తా
- ప్రాజెక్టు పూర్తి చేసి.. 26 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తం..
- ఇందుకోసం గ్రీన్‌చానల్ ద్వారా నిధులు మంజూరు చేసే బాధ్యత నాది
- ఈ మట్టి బిడ్డగా జిల్లా ప్రాజెక్టుల కోసం 30 నెల్లలో 8 వేల కోట్లు ఖర్చు చేసిన
- గోదావరిపై చర్చిద్దామంటే మహారాష్ట్ర సీఎం దాగుడుమూతలాడుతున్నడు
- బీజేపీ నాయకులు ఎన్నాళ్లు తప్పించుకు తిరుగుతారో చూద్దాం
- అడుగుతాం.. కడుగుతాం.. తుమ్మిడిహెట్టి కట్టి తీరుతామని వెల్లడి
- జడ్చర్ల బహిరంగ సభలో సీఎం ప్రసంగం
మహబూబ్‌నగర్, వెలుగు: ‘మీ పదేండ్ల పాలన.. మా రెండున్నరేండ్ల పాలనపై చర్చిద్దాం రా’ అంటూ బీఆర్‌ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. ‘‘నీకు చేతనైతే.. నీకు పౌరుషం ఉంటే, నువ్వు కేసీఆర్‌వి అయితే అసెంబ్లీకి రా. నీ పాలనపై, నా పాలనపై చర్చ పెడదాం.. ఒక వేళ చర్చలో నేను ఓడిపోతే నీకు క్షమాపణ చెబుతా.. లేకుంటే నువ్వు ఫామ్ హౌస్‌లోనే ఉండిపో..’’ అని అన్నారు. -ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులను సీఎం రేవంత్‌రెడ్డి రెండు రోజులుగా సందర్శిస్తున్నారు. పర్యటన ముగింపు సందర్భంగా శుక్రవారం జడ్చర్ల పట్టణ శివారులో స్థానిక ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కృష్ణా జలాలపై ఏపీతో చర్చలకు కేసీఆర్ అడ్డు పడుతున్నాడని, తలకిందికి, కాళ్లు మీదికి చేసినా, ఏపీతో కొట్లాడైనా పాలమూరు-–రంగారెడ్డి ప్రాజెక్టుకు 90 టీఎంసీలకు ఎన్‌వోసీ తెస్తానని, డిసెంబర్‌లోగా తీపి కబురు చెప్తానని వెల్లడించారు.
కరీంనగర్ నుంచి వచ్చిన కేసీఆర్‌ను 2009లో పాలమూరు ఎంపీగా గెలిపించి, పార్లమెంట్‌కు పంపితే ఐదేండ్లలో ఐదు సార్లు కూడా ఇటువైపు రాలేదని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఏపీ, తెలంగాణలో పార్టీకి నష్టమని తెలిసినా, కేంద్రంలో అధికారం కోల్పోయినా తెలంగాణ బిడ్డల మరణం చూడలేక సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుచేశారని చెప్పారు. ధనిక రాష్ట్రంగా తెలంగాణను కాంగ్రెస్ అప్పగిస్తే.. రెండుసార్లు అధికారంలో ఉన్న కేసీఆర్అప్పులకుప్పలా మార్చారని విమర్శించారు. మేకవన్నె పులిలాంటి కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు గుర్తించలేక మోసపోయారని అన్నారు. పదేండ్లలో 8 లక్షల కోట్లు చేతికి ఇస్తే, పాలమూరు జిల్లాలో కనీసం ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని మండిపడ్డారు. దీంతో ఈ ప్రాంతానికి సాగునీరు, తాగునీరు రాకుండా పోయాయని, ఇక్కడి ప్రజల కష్టాలు తీరలేదని వాపోయారు. అధికారంలో ఉన్న పదేండ్లలో ఇరిగేషన్‌పై కేసీఆర్.. ఏడాదికి రూ.5 వేల కోట్లు ఖర్చు చేసి ఉన్నా,, రాష్ట్రంలో 30 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని సీఎం చెప్పారు. ఇక గోదావరిపై మూడేండ్లలో లక్ష కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం కడితే, అది కూలిపోయిందన్నారు. 2014లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద పది లక్షల ఎకరాలు సాగులో ఉండగా.. ఇప్పటికీ అదే 10 లక్షల ఎకరాలు సాగవుతోందని, ఒకవేళ కేసీఆర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని చెప్పారు.
అన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులే..
ఇప్పుడున్నవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులేనని సీఎం రేవంత్ తెలిపారు. ‘‘కేసీఆర్.. జూరాలను మేమే పూర్తి చేసినం. భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి, పీఆర్ఎల్‌ఐ, నారాయణపేట, మక్తల్, కొడంగల్ లిఫ్టుల్లో ఏ ఒక్కటైనా నువ్వు పూర్తి చేశావా? ఎన్నడైనా మా రైతులతో మాట్లాడినవా? మా కష్టం ఏంది? మా కన్నీళ్లు ఏంది? మా సాగునీరు ఏంది? మా సమస్య ఏంది? అని తెలుసుకున్నవా? మా సమస్యల పరిష్కారానికి భరోసా ఇచ్చినవా? ’’ అని నిలదీశారు. ‘‘కేసీఆర్, ఆయన కొడుకు, ఆయన మనువడు రాజ్యాలు ఏలాలంట. మన దళితులు చెప్పులు కుట్టాలంట. ముదిరాజులు చేపలు పట్టుకోవాలంట. యాదవులు బర్లు, గొర్లు కాసుకోవాలంట’’ అంటూ ఫైర్ అయ్యారు. విద్య ఒక్కటే దళిత, బహుజనుల స్థితిగతులను మారుస్తుందని, వలసలు తగ్గి మన జీవితాల్లో వెలుగు నిండుతాయన్నారు. అందుకే తాము అధికారంలో వచ్చాక వెనుకబడిన పాలమూరులో విద్యాభివృద్ధికి బాటలు వేస్తున్నామని చెప్పారు. ట్రిపుల్ ఐటీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తెచ్చుకున్నామన్నారు.
గతంలో కొడంగల్ పిల్లలు బడులకు పోవాలంటే పాలమూరు, పరిగి, తాండూరుకు పోవాల్సి వచ్చేదన్నారు. కానీ ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్న వాళ్లు సైతం ఎంబీబీఎస్, ఇంజినీరింగ్, డిగ్రీ, సైనిక్ స్కూల్, నర్సింగ్ కాలేజీల్లో చదవాలంటే కొడంగల్‌కు వచ్చేటట్లు 250 ఎకరాల్లో ఎడ్యుకేషన్ క్యాంపస్‌ను నిర్మిస్తున్నామని వెల్లడించారు. మన పిల్లలు కలెక్టర్లుగా, ఎస్పీలుగా ఎదిగితే మన గౌరవం పెరుగుతుందన్నారు. చదువే కీలకమని, ప్రతి ఊళ్లో బడి ఉండాలని, మన భూములకు సాగునీరు రావాలని చెప్పారు. ‘‘రేవంత్ రెడ్డి ఏం చేసిండని కొంద రు అవాకులు చవాకులు పేలుతున్నారు.15 లక్షల రేషన్ కార్డులు అందించాం. 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశాం. 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించాం. పది వేల కోట్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ఖర్చు చేశాం. వాళ్లను బస్సులకు యజమానులను చేశాం.. మేం చేసింది చెప్పాలంటే రాస్తే రామాయణం.. చెబితే భారతం అవుతుంది” అని వివరించారు.
మహారాష్ట్ర సీఎంను చర్చలకు తీసుకురండి
గోదావరి జలాల కోసం మహారాష్ట్ర సీఎంను చర్చలకు తీసుకురావాలని బీజేపీ నేతలకు సీఎం రేవంత్సూచించారు. ‘‘తుమ్మడిహెట్టి వద్ద ప్రాజెక్టు కడతామంటే మహారాష్ట్ర సీఎం దాగుడు మూతలు ఆడుతున్నారు. మహా సీఎంను అడుగుతున్నాం. విజ్ఞప్తి చేస్తున్నాం. వినకుంటే మెడలు వంచైనా గోదావరి జలాల మీద ప్రాణహిత చేవెళ్ల కడతం’’ అని స్పష్టంచేశారు. ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ కరీంనగర్ నుంచి బీజేపీ నుంచి గెలిచిన ఎంపీలకు ఇక్కడి ప్రజల సాగు, తాగునీటి అవసరాలు పట్టవా? అని నిలదీశారు. ‘‘గోదావరి జలాలపై మహారాష్ట్ర సీఎం చర్చలకు రాకుండా పారిపోతున్నడు. మీరు ఆయనతో మాట్లాడి చర్చలకు తీసుకురండి. ఆయనను ఒప్పించి తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టి 100 టీఎంసీల నీటిని శ్రీపాద ఎల్లంపల్లిలో పోస్తాం. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్జిల్లాల రైతుల కష్టాలు తీర్చేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు పోతాం. లేదంటే మిమ్మల్ని ఊళ్ల నుంచి తరిమే పరిస్థితి వస్తుంది” అని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.
పొర్లు దండాలు పెట్టినా.. మీ పాపాలు పోవు
బీఆర్ఎస్ నేతలు పాలమూరు పర్యటనలు చేసినా, పొర్లు దండాలు పెట్టినా, వాళ్లు చేసిన పాపాలు పోవని సీఎం రేవంత్విమర్శించారు. ‘‘ఇయ్యాల కొంత మంది దొంగలకు సద్దులు మోసేటోళ్లు, తిన్నింటి వాసాలు లెక్కించేటోళ్లు మాట్లాడుతున్నరు. పాలమూరు కోసం పాదయాత్రలు చేస్తామంటున్నారు. మీరు నడిచినా, పొర్లినా.. కాశీ వరకు పొర్లు దండాలు పెట్టినా మీరు చేసిన పాపాలు పోవు. మీరు చేసిన అన్యాయాన్ని ఈ జిల్లా ప్రజలు మరిచిపోరు’’ అని మండిపడ్డారు. కేసీఆర్ అధికారంలో ఉన్న పదేండ్లలో 8 లక్షల కోట్లు ఖర్చు చేశాడని, అందులో సాగునీటి ప్రాజెక్టులకు లక్షా 81 వేల కోట్లు పెట్టాడని సీఎం చెప్పారు.
అందులో ఉద్దండాపూర్ వాళ్లకు రూ.800 కోట్లు ఇవ్వలేక, పరిహారం అడిగిన పాపానికి పోలీస్ స్టేషన్లలో పెట్టి కొట్టించాడని ఆవేదన వ్యక్తం చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని, దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని, కేజీ టూ పీజీ విద్య ఇస్తామని, ఉద్దండాపూర్ నిర్వాసితులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని అబద్దాలు చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు తాము ఆ పని చేస్తుంటే కాళ్లల్లో కట్టె పెట్టి అడ్డం పడి మా పాలమూరు అభివృద్ధిని అడ్డకుంటున్నారని మండిపడ్డారు. పాలమూరు బిడ్డలకు తవ్విన గోతిలో మట్టి తీసుడే కాదు.. పండ బెట్టి మట్టి కప్పేయడం కూడా తెలుసన్నారు. గతంలో మోసం చేసినట్లే మళ్లో సారి మోసం చేద్దామని అనుకుంటే.. మొలక కూడా ఎత్తనియ్యమని హెచ్చరించారు.
ఔర్ ఏక్ బార్ కాంగ్రెస్ సర్కార్
బీఆర్ఎస్కు పాలమూరులో అడ్రస్‌లేకుండా చేస్తానని సీఎం రేవంత్ ప్రతినబూనారు. ‘‘కేసీఆర్ .. భవిష్యత్తులో పాలమూరు జిల్లాలో నీ జెండా ఎగరనియ్యం. గద్దెలు కూలాలే. పాల మూరు గడ్డ మీద మీ గుర్తు అనేది ఇక మర్చిపో. నీ గుర్తు, నీ ఎమ్మెల్యేలు గతమే. భవిష్యత్తులో ఒక్క రిని కూడా గెలువనియ్యం” అని హెచ్చరించారు. బిల్లా రంగాలను (కేటీఆర్, హరీశ్‌ను ఉద్దేశించి) ఊరిమీదకు వదిలాడని, వాళ్లిద్దరికి ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదన్నారు. ‘‘ఈయన పొద్దగా ల ప్రెస్మీట్పెడితే, సాయంత్రం ఇంకో ఆయన ట్విట్టర్లో పోస్టు పెడతాడు. మీకు మీకే పొంత న లేదు. మీరా మా గురించా మాట్లడేది?’’ అని ఎద్దేవా చేశారు. ఉత్తమ్ కుమార్‌రెడ్డికి హరీశ్‌రావు రాసిన లెటర్చూసి నవ్వాలో, ఏడ్వాలో తెలుస్తలేదన్నారు.
వాళ్ల నిర్వహణ సరిగ్గాలేక కాళేశ్వరం కూలి, లక్ష కోట్లు గోదావరిలో కలిసి పోయాయని, వారిప్పుడు తమకు సుద్దులు చెప్తు న్నారని అన్నారు. పాలమూరు ప్రజలు ఇలాంటి దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ‘‘1994 నుంచి 2004 వరకు పదేండ్లు టీడీపీ అధికారంలో ఉంది.. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంది.. 2014 నుంచి 2024 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది.. 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ పదేండ్లు అధికారంలో ఉంటుంది.. నేనే సీఎంగా ఉంటా.. ఇదే కేసీఆర్‌కు నా సవాల్” అని అన్నారు. 2029 ఎన్నికల్లో కేసీఆర్ సంగతి తేలుస్తామన్నారు. రెండోసారి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చి, వెనుకబడిన పాలమూరు జిల్లాను దేశంలోనే ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతానని రేవంత్ హామీ ఇచ్చారు. ‘ఔర్ ఏక్ బార్.. కాంగ్రెస్ సర్కార్’ అంటూ సీఎం నినదించారు.
ఏపీ నుంచి 90 టీఎంసీలకు ఎన్‌వోసీ తీసుకుంటా..
కృష్ణానది జలాలపై 60 ఏండ్లుగా తెలంగాణ, ఏపీ నడుమ రావణ కాష్టం రగులుతోందని, ఈ సమస్యకు శాశ్వ త పరిష్కారం చూస్తున్నామని సీఎం రేవంత్ చెప్పారు. ‘‘ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఏపీతో చర్చలు జరపాలి. కానీ, ఇందుకు కేసీఆర్ అడ్డంపడుతున్నడు. తిక్క మాటలు, వెర్రి మాటలు మాట్లాడుతున్నడు. పగోని తోనైనా, పక్క దేశంతోనైనా సమస్యలుంటే చర్చించుకోవాలే. కానీ, ఏపీతో చర్చలు చేస్తామంటే కేసీఆర్ నా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు బురద జల్లినా, తల కిందికి, కాళ్లు మీదికి పెట్టినా, పక్క రాష్ట్రంతో చర్చలు జరుపుతాం. ఏపీపై ఒత్తిడిపెట్టయినా, కొట్లాడైనా డిసెంబరులోపు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు 90 టీఎంసీలకు ఎన్‌వోసీ తీసుకొచ్చి. ప్రాజెక్టు పూర్తిచేస్తాం’’ అని సీఎం స్పష్టంచేశారు. డిండి ప్రాజెక్టుకు 20 టీఎంసీల నుంచి 30 టీఎంసీల నీళ్లకు అనుమతి తేచ్చే బాధ్యత తానే తీసుకుంటానన్నారు. ఉద్దండాపూర్ వరకు కావావాల్సిన నీళ్లు ఇచ్చి, ఏడాదిలోపు పూర్తి చేస్తామని తెలిపారు. రాబోయే రెండు న్నరేండ్లలో కొత్త రిజర్వాయర్లు కట్టుకోవడంతోపాటు కర్నాటక, మక్తల్ సరిహద్దులో రోడ్ కం బ్రిడ్జీలు కడతా మని చెప్పారు. భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, ఎంఎన్కేఎల్ఐఎస్కు గ్రీన్ చానల్ ద్వారా నిధులు ఇచ్చి ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యత తీసుకుంటానని సీఎం హామీ ఇచ్చారు.
