
ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో డ్రగ్స్, సైబర్ క్రైమ్ ప్రధానమైనవి అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం(జులై 2) ఆయన హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో నార్కోటిక్, సైబర్ సెక్యూరిటీ ఫొటో ఎగ్జిబిషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో చాలా మంది విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ కి బానిస అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
వాటిని అరికట్టడంలో మనం మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ విషయంలో తెలుగు చిత్ర పరిశ్రమ కూడా తమవంతుగా కృషి చేయాలని ఆయన కోరారు. ఈ సందర్బంగా ఆయన మెగాస్టార్ చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. చిరంజీవి గారు డ్రగ్స్ నియంత్రణ కోసం స్వయంగా తనంతట తానే ముందుకు వచ్చి వీడియో విడుదల చేశారు. అందుకు ఆయనకు నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. తెలుగు చిత్ర పరిశ్రమ నుండి ఇతర నటీనటులు కూడా ఇలాగే ముందుకు రావాలని, సమాజానికి ఉపయోగపడే వీడియోలను చేయాలని, థియేటర్స్ లో సినిమా ప్రదర్శనకు ముందు ఆ వీడియోలను ప్రదర్శించాలని.. సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.