
ములుగు: ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. మేడారంలో సీఎం మొక్కులు చెల్లించుకున్నారు. సీఎం రేవంత్ తులాభారం ద్వారా అమ్మవారికి బంగారం (బెల్లం) సమర్పించారు. సీఎం రేవంత్ 68 కిలోల బరువు తూగడంతో 68 కిలోల బంగారం ( బెల్లం ) సమర్పించి ఆయన మొక్కు చెల్లించుకున్నారు. మేడారం ఆలయ అభివృద్ధి పనులను సీఎం రేవంత్ స్వయంగా సమీక్షిస్తారు.
అభివృద్ధి పనులకు సంబంధించి డిజిటల్ ప్లాన్‌ను ఆయన విడుదల చేయనున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మల అభివృద్ధి కోసం రూ.236.2 కోట్లు ఖర్చు చేసి మాస్టర్ ప్లాన్ అమలు చేసే నేపథ్యంలో సీఎం రేవంత్ మేడారం వెళ్లారు. మేడారం తల్లుల గద్దెల మార్పు, భక్తులకు కావాల్సిన సౌకర్యాల కల్పన, జంపన్నవాగు సుందరీకరణ తదితర అంశాలపై మంత్రులు సీతక్క, కొండా సురేఖ తదితరులతో కలిసి పూజారులతో సీఎం రేవంత్ చర్చించారు.
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం అభివృద్ధిపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రూ. 236 కోట్లతో ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్‌ను రూపొందించిన సర్కార్.. ఈ నిధులతో వందేండ్ల పాటు నిలిచేలా శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టేందుకు చర్యలు ప్రారంభించింది. దీంతో పాటు వచ్చే ఏడాది జరగనున్న మహాజాతరకు తరలిరానున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకల సౌకర్యాలు కల్పించేందుకు మరో రూ. 150 కోట్లను కేటాయించింది. ఈ నిధులతో జాతర నాటికి సివిల్, నాన్ సివిల్ వర్క్స్‌ను పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
వచ్చే ఏడాది జరగనున్న మేడారం మహాజాతరకు తరలివచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు మాస్టర్ ప్లాన్‌తో సంబంధం లేకుండా రూ. 150 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇందులో రూ.90.87 కోట్లను సివిల్ వర్క్స్‌కు, రూ.59.13 కోట్లను నాన్ సివిల్ వర్క్స్‌కు కేటాయించారు.