విద్యార్థులపై లాఠీ చార్జ్ అమానుషం..కేంద్ర విద్యాశాఖ మంత్రి  వెంటనే రాజీనామా చేయాలి

విద్యార్థులపై లాఠీ చార్జ్ అమానుషం..కేంద్ర విద్యాశాఖ మంత్రి  వెంటనే రాజీనామా చేయాలి

 

  •     నీట్ లీకేజీపై విచారణ జరిపించాలి
  •     వెల్లువెత్తిన నిరసనలు 


నెట్​వర్క్, వెలుగు: నీట్​పేపర్ లీకేపీకి బాధ్యతగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఢిల్లీలోని జంతర్​మంతర్​వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్​ చేయడం అమానుషమని కాంగ్రెస్​ నేతలు, ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్​ చేస్తూ గురువారం అనేక చోట్ల నిరసన వెల్లువెత్తాయి. నిర్మల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్​చార్జ్ కూచాడి శ్రీహరి రావు నాయకత్వంలో సారంగాపూర్​లో భారీ ధర్నా చేశారు. విద్యార్థులకు మద్దతుగా వెళ్లిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్​గాంధీ, ప్రియాంకా గాంధీపై లాఠీచార్జ్‌‌‌‌ను ఖండించారు. ఆసిఫాబాద్​ జిల్లా కౌటాలలో కాంగ్రెస్​ నాయకులతో కలిసి రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్, ఎమ్మెల్సీ దండే విఠల్ రాస్తారోకో, నిరసన చేపట్టారు.

నీట్ పరీక్ష అవకతవకలపై ప్రభుత్వం విచారణ జరిపించి బాధ్యులను శిక్షించాలని మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలోని అంబేద్కర్ విగ్రహం ముందు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కొల్లూరి రవికుమార్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. మంచిర్యాల బస్టాండ్ ఆవరణలో సీపీఎం నేతలు నల్ల గుడ్డలతో వినూత్న నిరసన తెలిపారు. జన్నారంలో, సిరిసిల్ల జిల్లా బోయినపల్లి, కోనరావుపేటలో కాంగ్రెస్​నేతలు ఆందోళన చేశారు. సిరిసిల్లలో రిపబ్లికన్ స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా ప్రెసిడెంట్ రంజిత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన  వ్యక్తం చేశారు.

కరీంనగర్​లో చాయ్​పే చర్చ

దేశం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేసి విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని కరీంనగర్​ సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. నీట్ పరీక్ష లీకేజీపై దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనకు దిగుతున్న నేపథ్యంలో నరేందర్ రెడ్డి వినూత్నంగా కరీంనగర్​లో చాయ్​పే చర్చ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యావంతులు, మేధావులు, లాయర్లు, సీనియర్ సిటిజన్​లతో కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను వారితో పంచుకున్నారు. మేధావుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్నవారిని కర్కషంగా అరెస్ట్​ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.