వరి దీక్ష విరమించిన రేవంత్, కోమటిరెడ్డి

వరి దీక్ష విరమించిన రేవంత్, కోమటిరెడ్డి

ఇందిరా పార్క్ వద్ద వరిదీక్ష నిర్వహించారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. ఈ సందర్భంగా దీక్ష చేపట్టిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ... ఢిల్లీలో కేసీఆర్ దావత్ చేసుకొని వచ్చారన్నారు. వరికుప్పలపై రైతులు పడి చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రైతుల చావులకు కేసీఆరే కారణమన్నారు. ఇవి కేసీఆర్ చేసిన హత్యలే అన్నారు రేవంత్. పండించిన ధాన్యం మళ్లీ మొలకలు ఎత్తడానికి కారణం కేసీఆర్ మూర్ఖత్వమే అని విమర్శించారు రేవంత్. రైతుల సమస్యల సృష్టికర్త కేసీఆర్ అంటూ ధ్వజమెత్తారు. ఢిల్లీకి వెళ్లిన మహమూద్ అలీకి వరి గురించి తెలుసా ? కేటీఆర్ కు వరి గురించి ఏం తెలుసు ? అంటూ ప్రశ్నించారు. మోడీ కేసీఆర్ కలిసి రైతుల్ని మోసం చేస్తున్నారని విమర్శించారు రేవంత్ రెడ్డి. 

కేసీఆర్ ధర్నా చౌక్ లో ధర్నా అన్నాడు.. ఢిల్లీలో దందా అన్నాడు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మోదీని అపాయింట్ మెంట్ అడిగిన లెటర్ కేసీఆర్ చూపించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతులు ఫ్రీ కరెంట్, ఎరువులు అడగడం లేదన్నారు. కేవలం తాను పండించిన పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలని ఇవాళ రైతు వేడుకుంటున్నారన్నారు. రైతుల కోసం ఢిల్లీలో ఉద్యమిస్తామన్నారు రేవంత్ రెడ్డి. మరోవైపు జానా రెడ్డి మాట్లాడుతూ వరిదీక్షతో ప్రభుత్వానికి కనువిప్పు కావాలన్నారు. సంఘీభావం తెలిపిన పార్టీలు, ప్రజాసంఘాలకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ అనేక సమస్యలను పరిష్కరించిందని.. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిందన్నారు. ఆహార భద్రత చట్టాన్ని, అటవీ హక్కుల చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్సే అన్నారు. 

సమస్యలను పరిష్కరించడంలో మోది, టీఆర్ఎస్ ప్రభుత్వాలు విఫలం అయ్యాయని జానా రెడ్డి ఆరోపించారు. ప్రజలు ఎప్పుడు అధికారం ఇస్తే అప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. 
అప్పటి వరకు ప్రజల గోసను ప్రభుత్వానికి విన్నవిస్తామన్నారు జానారెడ్డి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు నెపాన్ని నెడుతూ సమస్యను పక్కదారి పట్టిస్తున్నాయని ఆరోపించారు. ప్రజలు రెండు ఈ పార్టీలను పక్కకు పెడతారన్నారు. కాంగ్రెస్ నేతలంతా ఐక్యమత్యంతో ముందుకు సాగాలని జానారెడ్డి ఈ సందర్భంగా పిలుపు నిచ్చారు.