
హైదరాబాద్, వెలుగు: సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సెప్టెంబర్ 1న సీపీఎస్ ఉద్యోగుల ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లింగమొల్ల దర్శన్ తెలిపారు. ఉద్యోగులకు భద్రత లేని ఈ సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి,1980 పెన్షన్ నిబంధనల ప్రకారం పాత విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగులు వృద్ధాప్యంలో పదవీ విరమణ తర్వాత ఆత్మగౌరవంతో జీవించాలంటే ఇది తప్పనిసరి అని ఆయన అన్నారు.
ఆదివారం హైదరాబాద్ లోని యూనియన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కె. రామకృష్ణ మాట్లాడారు. సుమారు 30 నుంచి -35 సంవత్సరాలు ప్రజల కోసం పనిచేసిన ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత పెన్షన్, ఆరోగ్య కార్డులు లేక ఆర్థిక, ఆరోగ్య సమస్యలతో మానసికంగా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల సంక్షేమం ప్రభుత్వాల బాధ్యత కాబట్టి, ప్రభుత్వం వెంటనే సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగులను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.