పోతిరెడ్డిపాడు నుంచి  నీళ్ల తరలింపు ఆపాలి

పోతిరెడ్డిపాడు నుంచి  నీళ్ల తరలింపు ఆపాలి

హైదరాబాద్‌‌, వెలుగు: పోతిరెడ్డిపాడు హెడ్‌‌ రెగ్యులేటర్‌‌ నుంచి ఏపీ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలిస్తోందని, నీళ్ల తరలింపును వెంటనే ఆపాలని తెలంగాణ డిమాండ్‌‌ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఇరిగేషన్‌‌ స్పెషల్‌‌ సీఎస్‌‌ రజత్‌‌కుమార్‌‌ శనివారం కేఆర్‌‌ఎంబీ చైర్మన్‌‌ ఎంపీ సింగ్‌‌కు లెటర్​ రాశారు. అదే లెటర్​ను కేంద్ర జలశక్తి శాఖ సెక్రటరీకి పంపారు. పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ నీటిని తరలించకుండా చర్యలు చేపట్టాలని తమ శాఖ నుంచి ఇప్పటికే పలుమార్లు లెటర్లు రాశామని తెలిపారు. పోతిరెడ్డిపాడు నుంచి తీసుకునే నీళ్లను పెన్నా బేసిన్‌‌కు తరలించి, అనుమతి లేని ప్రాజెక్టుల ఆయకట్టుకు ఇస్తున్నారని పేర్కొన్నారు.  చెన్నై తాగునీటి కోసం 15, ఎస్‌‌ఆర్బీసీ 19 టీఎంసీలే తీసుకునేందుకు ఒప్పందం ఉందని గుర్తు చేశారు. ఈ నీళ్లు జులై నుంచి అక్టోబర్‌‌ మధ్య మాత్రమే తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఏపీ ప్రభుత్వం ఏటా రూల్స్ దాటి భారీగా నీళ్లు తరలిస్తోందని లెటర్​లో పేర్కొన్నారు. రెండేండ్లలో 179,  129 టీఎంసీలు తరలించిందని, ఈ ఫ్లడ్‌‌  ఇయర్‌‌లో ఇప్పటికే 25 టీఎంసీలు తరలించిందని తెలిపారు.  శ్రీశైలం హైడ్రో ఎలక్ట్రిక్‌‌  పవర్‌‌ ప్రాజెక్టేనని, కరెంట్‌‌ ఉత్పత్తి ద్వారా నాగార్జునసాగర్‌‌  ఆయకట్టు అవసరాల కోసం నీటిని తరలించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలోని భూభాగాన్ని సాగుకు రైతులు 35 లక్షల బోర్లు తవ్వుకున్నారని, ప్రభుత్వం ఎత్తిపోతల ద్వారా నదీ జలాలను లిఫ్ట్‌‌ చేస్తోందన్నారు. ఇందుకు పెద్ద ఎత్తున కరెంట్ అవసరమని,  పూర్తి స్థాయి సామర్థ్యం మేరకు తాము కరెంట్‌‌ ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందని లెటర్​లో తెలిపారు. సాగర్‌‌ కింద తాగు, సాగు, పారిశ్రామిక అవసరాల కోసం శ్రీశైలం నుంచి కరెంట్‌‌ ఉత్పత్తి ద్వారా 280 టీఎంసీలు తరలించేలా బచావత్‌‌ (కేడబ్ల్యూడీటీ -1) అవార్డు స్పష్టం చేసిందన్నారు. హైదరాబాద్​కు తాగునీళ్లకోసం అదనంగా 16.5 టీఎంసీలు తరలించాల్సి ఉంటుందని తెలిపారు. వర్షాకాలంలో శ్రీశైలం నుంచి పూర్తి స్థాయి కేటాయింపుల మేరకు కరెంట్‌‌ ఉత్పత్తి ద్వారా నీళ్లు తీసుకునే అవకాశం కల్పించాలన్నారు. సాగర్‌‌ ప్రాజెక్టు అవసరాలపై ప్రభావం పడకుండా పోతిరెడ్డిపాడు నుంచి నీటి తరలింపును ఆపేలా ఏపీని ఆదేశించాలని కోరారు.