
- సిండికేట్‌గా మారిన గంజాయి, డ్రగ్ స్మగ్లర్లు
- డబ్బులకు బదులుగా మాదకద్రవ్యాల మార్పిడి
- ఐటమ్, మాల్, టికెట్ బుకింగ్ పేర్లతో ఆన్‌లైన్‌లో ఆర్డర్లు
- కొరియర్లు, క్యారియర్లతో ట్రాన్స్‌పోర్ట్, డోర్ డెలివరీ
- డీలర్లు, సప్లయర్లకు మధ్య కాంటాక్ట్ లేకుండా డెడ్ డ్రాప్ విధానం
- గోవా, ముంబై, బెంగళూరులో ఐదు డ్రగ్ ముఠాల గుర్తింపు
- డెకాయ్ ఆపరేషన్లకు ప్లాన్ చేస్తున్న ఈగల్
హైదరాబాద్, వెలుగు: గంజాయి, డ్రగ్స్ స్మగ్లర్లు రూటు మార్చారు. పోలీసులు, సెంట్రల్ ఏజెన్సీలకు చిక్కకుండా కొత్త ఎత్తులు వేస్తున్నారు. ‘ఇదర్ కా మాల్ ఉదర్.. ఉదర్ కా మాల్ ఇదర్’ -అన్న తరహాలో డ్రగ్స్, గంజాయి ఇచ్చిపుచ్చుకుంటున్నారు. క్వాలిటీని బట్టి గంజాయి విలువకు సమానంగా సింథటిక్ డ్రగ్స్ అందిస్తున్నారు. ఈ క్రమంలో డబ్బుల చెల్లింపులు లేకుండా వస్తు మార్పిడి తరహాలో కేవలం డ్రగ్స్, గంజాయి మాత్రమే చేతులు మారుతున్నాయి.
ఆన్‌లైన్ ఆర్డర్లు, కొరియర్లు, క్యారియర్ నెట్‌వర్క్‌తో మాదకద్రవ్యాలు ట్రాన్స్‌పోర్ట్, డెలివరీ జరుగుతుండడంతో స్మగ్లర్లను పట్టుకోవడంలో పోలీసులకు సవాళ్లు ఎదురవుతున్నాయి. దీంతో కస్టమర్లపైనే ఈగల్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్) నిఘా పెట్టింది. గోవా, ముంబై, బెంగళూరు కేంద్రంగా ఐదు డ్రగ్ ముఠాలను గుర్తించినట్టు తెలిసింది.
లారీ, క్యాబ్ డ్రైవర్ల ద్వారా..
రాష్ట్రంలో ఏటా 25 వేల కిలోల నుంచి 30 వేల కిలోల వరకు గంజాయి పట్టుబడుతున్నది. ఈ ఏడాది జులై 31 నాటికి 9,238 కిలోల గంజాయిని ఈగల్ టీమ్ స్వాధీనం చేసుకుంది. 1,248 కేసుల్లో 2,610 మంది గంజాయి సప్లయర్లను అరెస్ట్ చేసింది. అయితే కొరియర్లు, లోకల్ సప్లయర్లు మినహా గంజాయి డీలర్లు మాత్రం చిక్కలేదు. దీనికి కారణం.. గంజాయి, డ్రగ్ డీలర్లు సిండికేట్‌గా మారడమే. వీళ్లంతా పోలీసులకు చిక్కకుండా క్యారియర్ నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్నారు.
ఏపీ, ఒడిశా సహా ఏజెన్సీ ప్రాంతాల్లో పండిస్తున్న గంజాయిని గోవా, బెంగళూర్, ముంబైలోని డ్రగ్ డీలర్లకు సప్లయ్ చేస్తున్నారు. హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర, కర్నాటక, గోవాకు గంజాయి తరలిస్తున్నారు. ఇందుకోసం లారీ డ్రైవర్లు, ప్రైవేట్ ట్రావెల్స్, క్యాబ్ డ్రైవర్లను ఎంగేజ్ చేసుకుంటున్నారు. డీలర్లకు, సప్లయర్లకు ఎక్కడా డైరెక్ట్ కనెక్టివిటీ ఉండడం లేదు. కేవలం ఐటమ్, మాల్, టికెట్ బుకింగ్ సహా అనేక కోడ్స్‌తో గంజాయి, డ్రగ్స్ చేరవేస్తున్నారు.
గోవాలో గంజాయి డెలివరీ అయిన తర్వాత.. అక్కడి నుంచి కొకైన్, చరాస్, ఎండీఎంఏ సహా సింథటిక్ డ్రగ్స్ హైదరాబాద్ తరలిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో డ్రగ్ డీలర్లు, సప్లయర్లు ఒకరికి ఒకరు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. కేవలం ఆన్‌లైన్‌లోనే ఆర్డర్లు, కొరియర్లలో సప్లయ్ చేస్తూ డోర్ డెలివరీ చేస్తున్నారు. డెడ్‌డ్రాప్ విధానంలో అంటే ఓ ప్రాంతంలో డ్రగ్స్, గంజాయి పార్సిల్ పెట్టి ఆయా లొకేషన్లను కస్టమర్లు లేదా సప్లయర్లకు షేర్ చేస్తున్నారు. ఇలా గోవా, ముంబై, బెంగళూర్ నుంచి కొరియర్, స్పెషల్ క్యారియర్ల ద్వారా డ్రగ్స్‌ను హైదరాబాద్ రవాణా చేస్తున్నారు.
పబ్, రేవ్ పార్టీల కల్చర్ పెరగడంతో..
హైదరాబాద్‌లో పబ్, రేవ్ పార్టీల కల్చర్ పెరగడంతో డ్రగ్ వినియోగం కూడా భారీగా పెరిగిపోయింది. దీంతో ఎల్ఎస్‌డీ, చరాస్, హెరాయిన్, కొకైన్‌కు డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలోనే గంజాయి సప్లయర్లను డ్రగ్ పెడ్లర్లుగా మార్చి మత్తు ముఠాలు దందా చేస్తున్నాయి. డ్రగ్ రకాన్ని బట్టి ఒక్కో గ్రామ్‌కు రేట్ ఫిక్స్ చేసి కమీషన్లు అందిస్తున్నాయి. గోవాలో రూ.వెయ్యికి లభించే ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌ను సిటీకి తరలించి డిమాండ్‌ను బట్టి రూ.1,500 నుంచి రూ.-3,000 వరకు విక్రయిస్తున్నారు.
హెరాయిన్ గ్రామ్ రూ.6 వేల నుంచి రూ.8,500 వరకు విక్రయిస్తున్నారు. ఈజీ మనీ కోసం అలవాటు పడిన యువత, చిల్లర దొంగలనే డ్రగ్స్ ముఠాలు టార్గెట్ చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇప్పటికే పట్టుబడిన గంజాయి, డ్రగ్ సప్లయర్లు, కస్టమర్ల కాల్ డేటా, ఫోన్ నంబర్స్ ఆధారంగా క్యారియర్స్‌పై పోలీసులు నిఘా పెట్టారు.