సెగ్మెంట్ రివ్యూ: ఖైరతాబాద్​ ఓటర్ ఎవరి వైపు?

 సెగ్మెంట్ రివ్యూ:  ఖైరతాబాద్​ ఓటర్ ఎవరి వైపు?

ఖైరతాబాద్​ ఓటర్​  ఎవరి వైపు? 
రెండోసారి పోటీలోఎమ్మెల్యే దానం నాగేందర్ 
తండ్రి చరిష్మాను నమ్ముకున్న విజయారెడ్డి
మరోసారి గెలుపు కోసం చింతల పోరాటం 

హైదరాబాద్, వెలుగు: సంపన్న వర్గాలు, మురికివాడలు, బస్తీ ఓటర్లు ఉన్న సెగ్మెంట్ ఖైరతాబాద్. వీరి ఓట్లు ఎవరికి పడితే ఆ పార్టీ అభ్యర్థికే గెలుపు అవకాశాలు ఉంటాయి. సెగ్మెంట్ పరిధిలోని సంపన్నులు, మైనార్టీల ఓట్లే కీలకం కానున్నాయి. ఈసారి ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు బరిలో నిలిచారు. గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎవరికి వారు తమ వ్యూహాలతో ముందు కెళ్తున్నారు. తమ పార్టీదే గెలుపు అనే ధీమాతో నేతలు కార్యకర్తలు ప్రచారం కొనసాగిస్తున్నారు. దీంతో  త్రిముఖ పోటీ నెలకొంది. సంపన్న వర్గాల ఓటర్లే కాకుండా ఫిల్మ్​నగర్​బస్తీలు, ఎంఎస్​ మక్తా, బీఎస్​మక్తా, పంజాగుట్ట, ఖైరతాబాద్​లోని బస్తీల ఓటర్లు అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపుతారు.

 ప్రజలకు అందుబాటులో లేకపోగా..

బీఆర్ఎస్​ సిట్టింగ్​ అభ్యర్థి, ఎమ్మెల్యే దానం నాగేందర్ రెండోసారి పోటీ చేస్తున్నారు. 2018లో గెలిచిన తర్వాత  దాదాపు 3  ఏండ్ల పాటు ఆయన అనారోగ్య కారణాలతో సెగ్మెంట్ ప్రజలకు దూరంగా ఉండిపోయారు.  కరోనా కాలంలోనూ ప్రజలకు  అందు బాటులో లేకపోవడంతో ఆయనపై వ్యతిరేకత పెరిగింది. పార్టీ కార్యక్రమాల్లో  తప్ప సెగ్మెంట్​లో  ప్రజల సమస్యలపై స్పందించడం లేదనే వాదన కూడా ఉంది. గత రెండేళ్లుగా ఉత్సాహంగా పని చేస్తున్న దానంపై ముఖ్యంగా సంపన్న వర్గాలు, మైనారిటీ వర్గాల్లోనూ కొంత వ్యతిరేకత పెరిగినట్టు చెబుతున్నారు.  ప్రభుత్వ పథకాల కారణంగా బీఆర్ఎస్​కు ఆదరణ ఉన్నట్టు ప్రచారంలో ఉంది. సంక్షేమ పథకాలే తన విజయానికి దోహదం చేస్తాయని దానం నాగేందర్​ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

 తండ్రి చరిష్మాపైనే గెలుపు ధీమా 

కాంగ్రెస్ అభ్యర్థిగా దివంగత పీజేఆర్ ​కూతురు, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి పోటీలో ఉన్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్​ వేవ్​లో ఆమె ఈజీగా గెలుస్తుందనే ధీమాతో ఆ పార్టీ నేతలు ఉన్నారు. పీజేఆర్ ​చరిష్మాను దృష్టిలో ఉంచుకునే కాంగ్రెస్​ ఆమెకు టికెట్ ఇచ్చినట్టు చెబుతున్నారు. కార్పొరేటర్​గా ఉన్నా  సెగ్మెంట్ లోని అన్ని ప్రాంతాలకు పెద్దగా ఆమె ఎవరో తెలియక పోవడం, గతంలో బీఆర్ఎస్​లో ఉండి పార్టీని వీడడం కూడా ఆమెకు పెద్దగా ప్రయోజనం ఉండదని అంటున్నారు. అయితే ప్రభుత్వంపై వ్యతిరేకత, కాంగ్రెస్​ వేవ్​ మాత్రం ఈసారి విజయారెడ్డిని విజయం వరిస్తుందని భావిస్తున్నారు. 

రెండు పార్టీలపై వ్యతిరేకతే..

బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలోకి దిగారు. గతంలో తాను చేసిన అభివృద్ధి పనులు, ప్రజల్లో పార్టీకి ఉన్న ఆదరణ గెలిపిస్తాయని ఆయన ధీమాతో ఉన్నారు. అయితే.. సెగ్మెంట్​లో బీజేపీకి చెందిన ఇద్దరు కార్పొరేటర్లు పార్టీని వీడారు. అదేవిధంగా కార్యకర్తలు కొంత వ్యతిరేకతతో ఉన్నారు. అయినా.. బీఆర్ఎస్, కాంగ్రెస్​పై ఉన్న వ్యతిరేకత తనకు అనుకూలంగా మారుతుందని ఆయన చెబుతున్నారు. మరోవైపు సొంత పార్టీలోని వర్గపోరు నష్టం కలిగిస్తుందని భావిస్తున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో చింతల రామచంద్రారెడ్డి గెలుపు ఎలా ఉంటుందన్నది వేచి చూడాలి.