
- సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల స్పందన ఇది
- తెలంగాణ ఇంటెన్షన్స్ సర్వేలో వెల్లడి
- 31 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఓ ప్రతిపక్ష ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకత
- వారు గెలువలేరని తేల్చిన సర్వే ఫలితాలు
- ఇప్పటికే అందులో ఐదుగురికి టికెట్ నిరాకరించిన కేసీఆర్
- పక్కా గెలిచేవాళ్లలో 20 మంది బీఆర్ఎస్, ముగ్గురు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు
- 64 మంది ఎమ్మెల్యేలకు ఫిఫ్టీ ఫిఫ్టీ చాన్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మొత్తం 119 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కేవలం 23 మంది ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో పక్కాగా గెలిచే అవకాశాలున్నాయి. 32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై జనంలో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. మిగతా 64 మంది ఎమ్మెల్యేల గెలుపోటములపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. ఎలక్షన్ సర్వేలు నిర్వహించడంలో పేరొందిన తెలంగాణ ఇంటెన్షన్స్ సంస్థ రాష్ట్ర వ్యాప్త సర్వేలో ఇది తేలింది. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల గెలుపోటములను ఈ సర్వే అంచనా వేసింది. అన్ని నియోజకవర్గాల్లో వివిధ కోణాల్లో ప్రజాభిప్రాయాలను సేకరించింది. 15 వేల రాండమ్ శాంపిళ్లను సేకరించింది. జనంతో ముఖాముఖితో పాటు ఫోన్ ద్వారా అభిప్రాయాన్ని సేకరించింది. ఆగస్టు 22 నుంచి 27 మధ్య ఈ సర్వే చేసినట్లు సంస్థ ప్రకటించింది.
అందులో 31మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే
తాజా సర్వే ప్రకారం రాబోయే ఎన్నికలు 32 మంది సిట్టింగ్‌లకు ముచ్చెమటలు పట్టించనున్నాయి. తమ సొంత నియోజకవర్గాల్లో వారికి ఓటర్ల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఉందని సర్వేలో తేలింది. వీరిలో ఒక్కరే ప్రతిపక్షాలకు చెందిన ఎమ్మెల్యే ఉండగా.. మిగతా 31 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ప్రజాగ్రహం చవిచూస్తున్న వారిలో పది మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలే ఉండటం కొత్త పాయింట్. అంటే గత ఎన్నికల్లో తాము గెలిపించిన పార్టీని కాదని.. ఆ ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి మారటం అందుకు ప్రధాన కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలకు నాలుగు నెలల ముందే 115 సీట్లకు పార్టీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ ఇదే కారణంతో పలు చోట్ల సిట్టింగ్‌లను మార్చినట్లు ఇప్పటికే చర్చ జరుగుతున్నది.
సర్వే ఫలితాల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ సిట్టింగ్‌ల్లో ఐదుగురికి కేసీఆర్ జాబితాలో చోటు దక్కలేదు. రాష్ట్రంలో మొత్తం 119 నియోజకవర్గాలున్నాయి. వీరిలో 104 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (ఇందులో ఇటీవల కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న చనిపోవడంతో ఆ స్థానం ఖాళీగా ఉంది), ఐదుగురు కాంగ్రెస్, ఏడుగురు ఎంఐఎం, ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలున్నారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న 32 మంది ఎమ్మెల్యేల్లో ఉత్తర తెలంగాణకు చెందిన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే కూడా ఉన్నట్లు సర్వేలో తేలింది.
ఢోకా లేనోళ్లలో 20 మంది బీఆర్ఎస్ వాళ్లు
ఇప్పుడున్న సిట్టింగ్‌ల్లో 23 మందికి ఢోకా లేదని ఈ సర్వే చెప్పింది. వీరిలో 20 మంది అధికార పార్టీకి చెందిన వారు కాగా.. ముగ్గురు అపొజిషన్ ఎమ్మెల్యేలున్నారు. నియోజకవర్గ ప్రజల్లో వీరికి ఆదరణ ఉండటంతో వచ్చే ఎన్నికల్లోనూ జనం వీరి వెంటే ఉంటారని.. అందుకే సానుకూల ఫలితాలుంటాయని సర్వే విశ్లేషించింది. సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన కుమారుడు కేటీఆర్ ఈ జాబితాలో ఉన్నారు. ఇదే జాబితాలో ఉన్న సిట్టింగుల్లో ఒకరికి బీఆర్ఎస్ జాబితాలో టికెట్ గల్లంతవటం విశేషం.
సగం మంది ఎమ్మెల్యేలపై మిశ్రమ స్పందన
సగానికి పైగా ఎమ్మెల్యేలపై నియోజకవర్గాల్లో మిశ్రమ స్పందన వ్యక్తమైందని తెలంగాణ ఇంటెన్షన్స్ చేసిన సర్వేలో తేలింది. వీరికి జనంలో ఆదరణ ఎంత ఉందో.. వ్యతిరేకత కూడా అదే స్థాయిలో ఉందని వెల్లడైంది. మొత్తం సిట్టింగుల్లో 64 మంది ఈ టఫ్ ఫైట్‌ను ఫేస్ చేస్తున్నారు. వీరిలో ముగ్గురు ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ టికెట్ రిజెక్ట్ చేసింది. బీఆర్ఎస్ పెండింగ్ పెట్టిన నాలుగింటిలో రెండు సీట్లలోనూ ఎమ్మెల్యేలు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అపొజిషన్ ఎమ్మెల్యేలు నలుగురు ఈ లిస్ట్‌లో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వీరి గెలుపోటములు తక్షణ కారణాలతో పాటు పోటీలో ఉండే ప్రత్యర్థులపై ఆధారపడుతాయని సర్వే సంస్థ తమ ఫలితాలను విశ్లేషించింది.