తెలంగాణ పండుగలు

తెలంగాణ పండుగలు

మనతోపాటు తెలుగు మాట్లాడే ఆంధ్రప్రదేశ్​తో పోల్చినప్పుడు పండుగల విషయంలో తెలంగాణది భిన్నమైన సంస్కృతి. తెలంగాణలో కొన్ని పండుగలు కులమతాలకు అతీతంగా జరుగుతాయి. ముఖ్యంగా బతుకమ్మ లాంటి ప్రకృతిని ఆరాధించే పండుగలను మన దగ్గర బాగా చేస్తుంటారు.

బోనాలు: తెలుగు మాసం ఆషాడ (జూలై లేదా ఆగస్టు)లో సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాల్లో, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో బోనాల పండుగ చేసుకుంటారు. ఈ పండుగ రోజు పాలు, బెల్లంతో వండిన అన్నాన్ని బోనం (కుండ)లో పెట్టి, నెత్తి మీద ఎత్తుకుని అమ్మవారి సన్నిధికి తీసుకెళ్తారు. తర్వాత బోనాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. ప్రత్యేక పూజలు చేస్తారు. బోనాన్ని పసుపు, వేపాకులు, కుంకుమతో అలంకరిస్తారు. 

మేడారం జాతర: తెలంగాణలో అతిపెద్ద గిరిజన పండుగ ఇది. దీన్నే సమ్మక్క సారలమ్మ జాతర అని కూడా పిలుస్తారు. ఈ జాతర ప్రతి రెండేండ్లకు మేడారం గ్రామంలో జరుగుతుంది. కాకతీయులతో పోరాడుతూ చనిపోయిన తల్లీకూతుళ్లు సమ్మక్క, సారలమ్మలు ఇక్కడ దేవతలుగా వెలిశారని నమ్ముతారు. పౌర్ణమి రోజు సాయంత్రం కన్నెబోయినపల్లె గ్రామం నుంచి సారలమ్మ అమ్మవారిని తీసుకొస్తారు. తర్వాత చిలుకలగుట్ట నుంచి సమ్మక్క దేవతను తీసుకొస్తారు. మన దేశంలో కుంభమేళా తర్వాత ఎక్కువమంది వచ్చేది ఈ జాతరకే. 

పీర్ల పండుగ: మొహర్రం పండుగ ముస్లింలకు చాలా ముఖ్యమైనది. కానీ.. తెలంగాణలో ఈ  పండుగలో హిందువులు కూడా పాల్గొంటారు. మొక్కులు తీర్చుకుంటారు. ముస్లింలతో కలసి ఆడతారు, పాడతారు. తెలంగాణలో దీన్ని పీర్ల పండుగ అంటారు. 

పెద్దగట్టు జాతర: తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర ఇదే. ప్రతి రెండేండ్లకు ఒకసారి జరుపుకుంటారు. ఐదు రోజుల ఉత్సవాల్లో చౌడమ్మ దేవి, లింగమంతుల స్వామికి పూజలు చేస్తారు. ఈ జాతరకు ప్రతిసారి 10 నుంచి 15 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా.

ఏడుపాయల జాతర: ప్రతి ఏడాది శివరాత్రి సందర్భంగా మెదక్ జిల్లాలోని నాగ్సాన్‌పల్లిలో ఏడుపాయల జాతర జరుగుతుంది. మంజీరా నది ఏడు పాయలుగా చీలిపోయిన చోట ఈ ఆలయం ఉంది. తెలంగాణ నలుమూలల నుండి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. 

కొమురవెల్లి: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి గ్రామంలో మల్లికార్జున స్వామి జాతర జరుగుతుంది. ఈ జాతరలో భక్తులు శివునికి పూజలు చేస్తారు. మహా శివరాత్రి టైంలో ఈ ఆలయానికి జనాలు ఎక్కువగా వస్తారు. ఒగ్గు పూజారులు పూజలు చేస్తారు. 

సదర్ పండుగ: ఈ పండుగను హైదరాబాద్‌లోని యాదవులు చేసుకుంటారు. దీనిని దీపావళి తర్వాత రెండవ రోజు చేస్తారు. దీన్నే దున్నపోతుల పండుగ అని కూడా పిలుస్తారు. ఈ పండుగలో భాగంగా దున్నపోతులను ఊరేగిస్తారు. బలంగా ఉండే దున్నపోతుకు బహుమతి ఇస్తారు.

డోక్రా మెటల్ క్రాఫ్ట్స్

ఆదిలాబాద్ జిల్లా జైనూర్ మండలంలో చేసే గిరిజన మెటల్ క్రాఫ్ట్. డోక్రా జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాల్లో నివసిస్తున్న ఓజా మెటల్ స్మిత్‌లు చేసే పురాతన బెల్ మెటల్ క్రాఫ్ట్. అయితే, వీటిని తయారుచేసే స్టయిల్​ ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. దీన్ని బెల్ మెటల్ క్రాఫ్ట్ అని కూడా అంటారు. ఇత్తడిని ఉపయోగించి  చేసే వస్తువులను ‘ఒజ్జీలు’ అని పిలుస్తారు. వీళ్లు ఎక్కువగా నెమళ్లు, ఏనుగులు, గుర్రాలు, దీపాలు తయారుచేస్తారు. పూర్తిగా చేతితోనే తయారు చేసినా.. వీటిలో ఎక్కడా ఒక్క అతుకు కూడా కనిపించకపోవడం వీటి స్పెషాలిటీ.

చేర్యాల స్క్రోల్ పెయింటింగ్స్

చేర్యాల గ్రామంలో తయారుచేసే స్క్రోల్ పెయింటింగ్స్​కు చాలా డిమాండ్​ ఉండేది. ఖాదీతో తయారు చేసిన కాన్వాస్‌పై బొమ్మలు గీస్తారు. ఇవి  ప్రాచీన భారతీయ సాహిత్యం, పురాణాలు, జానపద కథలను చెప్తాయి. కళాకారులు కాన్వాస్‌పై నేరుగా పెయింట్ చేస్తారు. అందుకు వాడే రంగులు కూడా సహజ వనరుల నుండి తయారు చేసుకుంటారు. ఈ పెయింటింగ్స్​కు 2007లో జియోగ్రాఫికల్ ఇండికేషన్ హోదా దక్కింది.

బతుకమ్మ పండుగ

బతుకమ్మ పండుగ రంగురంగుల పూల పండుగ. ఇదే  తెలంగాణలో ముఖ్యమైన పండుగ. ఈ పండుగ మహాలయ అమావాస్యనాడు మొదలవుతుంది. దుర్గాష్టమి నాడు సద్దుల బతుకమ్మతో ముగిసే 9 రోజుల పండుగ ఇది. ఈ తొమ్మిది రోజుల్లో పూలతో బతుకమ్మను పేర్చి రోజుకో నైవేద్యం సమర్పిస్తారు. తర్వాత ఆడవాళ్లు వాటి చుట్టూ చేరి పాటలు పాడుతూ, బతుకమ్మ ఆడతారు. లయబద్ధంగా చప్పట్లు కొడతారు. తర్వాత బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేస్తారు.