రాష్ట్ర కీర్తిని ప్రతిబింబించేలా ఆవిర్భావ వేడుకలు

రాష్ట్ర కీర్తిని ప్రతిబింబించేలా ఆవిర్భావ వేడుకలు
  • ఉత్సవాలకు జపాన్ మేయర్,మిస్​ వరల్డ్ విజేతలు
  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి 
  • అవతరణ దినోత్సవ ఏర్పాట్లపై సమీక్ష

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను అంబరాన్ని తాకేలా నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈ దిశగా ప్రణాళికాబద్ధంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కోఆర్డినేషన్  సమావేశం మంగళవారం సెక్రటేరియెట్ లో జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర అవతరణ రోజైన జూన్ 2న సీఎం రేవంత్ రెడ్డి అమరవీరుల స్తూపానికి నివాళులర్పిస్తారని తెలిపారు. తరువాత సికింద్రాబాద్  పరేడ్ గ్రౌండ్ లో జరిగే జెండా వందనం, మార్చ్  ఫాస్ట్ లో సీఎం పాల్గొంటారని వివరించారు. 

జిల్లా కేంద్రాల్లో ఇన్ చార్జి మంత్రులు, ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల నిర్వహణపైనా భట్టి సమీక్షించారు. ఈసారి అవతరణ ఉత్సవాలకు  అతిథులుగా జపాన్  మేయర్, మిస్  వరల్డ్  విజేతలు హాజరవుతారని వెల్లడించారు. ఎన్నికల కోడ్  వల్ల గత సంవత్సరం అనుకున్న మేరకు అవతరణ వేడుకలు నిర్వహించలేకపోయామని, ఈసారి రాష్ట్ర కీర్తిని ప్రతిబింబించేలా ఉత్సవాలు నిర్వహించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు నరేందర్ రెడ్డి, చీఫ్  సెక్రటరీ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్  సెక్రటరీ సందీప్  కుమార్  సుల్తానియా, స్పెషల్ సీఎస్​లు వికాస్ రాజ్, రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు.