- రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్
ములుగు, వెలుగు: తెలంగాణ రైతుల తలసరి ఆదాయం 2047 నాటికి మరింత పెంచేలా ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను చేపడుతోందని తెలంగాణ వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా ములుగులోని కొండా లక్ష్మణ్ హార్టికల్చర్వర్సిటీని సందర్శించారు. వర్సిటీ వీసీ దండా రాజిరెడ్డితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.
కూరగాయల సాగును భారీగా ప్రోత్సహించేందుకు రైతుల నుంచి నేరుగా కూరగాయలు కొనేందుకు కలెక్షన్ సెంటర్లు, మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్భారీగా పెంచుతామన్నారు. పండ్లు ఇప్పుడున్న నాలుగున్నర లక్షల ఎకరాల నుంచి 12 లక్షల ఎకరాలకు, కూరగాయలు 10 లక్షల ఎకరాలు, సుగంధ ద్రవ్యాలు 6 లక్షల ఎకరాలకు విస్తరించేలా ప్రణాళికలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
2025 నాటికి 2.7 లక్షల ఎకరాల్లో ఉన్న పామాయిల్ విస్తీర్ణాన్ని 12 లక్షల ఎకరాలకు పెంచుతామన్నారు. పట్టు పరిశ్రమలో ప్రస్తుతం కంటే ఐదు రెట్లు మల్బరీ ఉత్పత్తి, ఎనిమిది రెట్లు టస్సర్ సిల్క్ ఉత్పత్తి టార్గెట్గా పెట్టుకున్నట్లు చెప్పారు. వర్సిటీలో సెంట్రల్ ఇన్స్ట్రుమెంట్ఫెసిలిటీ, స్మార్ట్ క్లాస్ రూమ్స్, ఆర్ఎఫ్ఐడీ ఆధారిత లైబ్రరీ, రైతుల కోసం ఏర్పాటు చేసిన నర్సరీ, విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన అక్షయ డైనింగ్ హాల్ ను సందర్శించారు.
పీజీ, పీహెచ్ డీ స్టూడెంట్స్ పరిశోధన క్షేత్రాలని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో టీఎస్ ఆయిల్ ఫెడ్ ఓఎస్డీ కిరణ్ కుమార్, వర్సిటీ కన్సల్టెంట్ వీరాంజనేయులు, టెక్నికల్ అడ్వైజర్ సునందిని, కూరగాయల పరిశోధన స్థానం హెడ్ అనిత కుమారి, ప్రొఫెసర్ పిడిగం సైదయ్య, ఉద్యాన శాఖ జాయింట్ డైరెక్టర్ సరోజిని, జిల్లా ఉద్యాన అధికారి సువర్ణ, జేడీఏ శ్రీధర్, శాస్త్రవేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.
