- 12 వేల ఎకరాలపై సర్కార్ నజర్
- కేంద్ర సంస్థలకిచ్చిన భూముల వివరాలు సేకరణ
- నాన్ ఫంక్షనల్ సంస్థల భూములు అమ్మేందుకు రెడీ
- సీసీఐ, ఐడీపీఎల్, హెచ్ఎంటీ కిందున్న 3,304 ఎకరాలపై ఫోకస్
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చిన భూములపై రాష్ట్ర సర్కార్ కన్ను పడింది. ఏకంగా12 వేల ఎకరాలను అమ్మేసి ఆదాయం సమకూర్చుకోవడంపై దృష్టిసారించింది. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు(సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్–సీపీయూఎస్ యూలు) ఉన్నాయి? వాటిలో ఫంక్షనల్, నాన్ ఫంక్షనల్ గా ఉన్నవి ఎన్ని? ఆయా సంస్థల్లో యుటిలైజేషన్ (వాడకం)లో ఉన్నవి? లేనివి ఎన్ని? అనే వివరాలను రాష్ట్ర సర్కారు తెప్పించుకున్నది. దీంట్లో దేనికింద ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి? వాటి వ్యాల్యూ ఏంటనేది లెక్కగట్టింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ నాన్ ఫంక్షనల్ అయితే ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకుని అమ్మాలని సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ప్రపోజల్స్ కూడా రెడీ చేసింది. సంబంధిత కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కూడా ఈ సమాచారాన్ని చేరవేసినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని మొత్తం11 సంస్థల కింద ఉన్న భూముల వివరాలను సేకరించగా.. అందులో ప్రస్తుతం మూడు సీపీఎస్‌యూలు నాన్ ఫంక్షనల్‌గా ఉన్నాయి. ఈ భూములను గతంలో ఇండస్ర్టీల కోసమని అప్పటి రాష్ట్ర ప్రభుత్వాలు తక్కువ ధరకే కేటాయించాయని.. ఇప్పుడు నాన్ ఫంక్షనల్ గా ఉన్నందున తిరిగి ఇవ్వాలని కోరింది. ఆ భూములు రాష్ట్ర సర్కార్ అధీనంలోకి రాగానే అమ్మకానికి పెట్టాలని చూస్తోంది. దీంతోపాటు ఫంక్షనల్‌గా ఉన్న కేంద్ర సంస్థలు భూములను ఎంతవరకు యుటిలైజ్ చేసుకుంటున్నాయో అంత మేరకే ఉంచి.. మిగతా మొత్తాన్ని వెనక్కి తీసుకువాలని కూడా సర్కార్ భావిస్తోంది.
ఆ భూములు చాలా కాస్ట్ లీ
ఆదిలాబాద్ శివారులో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) నాన్ ఫంక్షనల్‌గా ఉన్నది. దీనికి 2,290 ఎకరాల భూమి ఉంది. ఇందులో దాదాపు 1500 ఎకరాలు యుటిలైజ్ కావడం లేదు. ఈ సిమెంటు ఫ్యాక్టరీకి 1982, ఆగస్టు 15న అంకురార్పణ జరిగింది. రూ.47 కోట్లతో 772 ఎకరాల్లో ప్లాంట్, 170 ఎకరాల్లో టౌన్‌షిప్ ఏర్పాటైంది.1996లో యాజమాన్యం ఉత్పత్తిని నిలిపివేయగా 2008లో ఉద్యోగులు స్వచ్ఛంద విరమణ ప్రకటించడంతో పరిశ్రమను మూసివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అప్పటి నుంచి ఆ భూములు అట్లనే ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఆ భూములను రాష్ట్ర సర్కార్ స్వాధీనం చేసుకోవాలని యోచిస్తోంది. వీటిని అమ్మేయాలని లేదంటే మంచి ఆఫర్ వస్తే లీజుకిచ్చే విషయాన్ని ఆలోచించాలని భావిస్తోంది. ఈ భూములను అమ్మితే రూ. 8 వేల కోట్ల నుంచి రూ. 10 వేల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అలాగే హైదరాబాద్ లోని ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (ఐడీపీఎల్) కూడా నాన్ ఫంక్షనల్ గా ఉన్నది. దీనికింద 891 ఎకరాలు ఉండగా.. 543 ఎకరాలు మాత్రమే వాడకంలో ఉంది. ఈ భూముల ధర ఎకరాకు రూ.30 కోట్లపైనే ఉన్నది. వీటిని కేంద్రం తిరిగి రాష్ట్ర సర్కారుకు హ్యాండోవర్ చేస్తే ఓపెన్ మార్కెట్లో రూ.26 వేల కోట్లు వచ్చే చాన్స్ ఉంటుంది. ఇక కుత్బుల్లాపూర్ లోని హిందుస్థాన్ మిషన్ టూల్స్(హెచ్ఎంటీ) కింద ఇంకో 123 ఎకరాల భూమి ఉంది. ఇందులో 50 ఎకరాలు మాత్రమే యుటిలైజ్ లో ఉన్నది. ఈ పీఎస్ యూ కూడా నాన్ ఫంక్షనల్‌గా ఉన్నది. ఈ భూములను అమ్మితే రూ.3 వేల కోట్ల నుంచి రూ.4 వేల కోట్లు వచ్చే అవకాశం ఉంది.
మిగులు భూములూ గుర్తింపు
ఫంక్షనల్ అవుతున్న మరికొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల కింద ఉన్న భూముల్లోనూ యుటిలైజ్ కాని భూములను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర సర్కార్ ప్లాన్ చేస్తోంది. మొత్తం 8 సీపీఎస్‌యూల కింద 8,948 ఎకరాల భూములు ఉన్నాయని గుర్తించింది. ఇందులో 2,313 ఎకరాలు మాత్రమే యుటిలైజేషన్లో ఉందని, మిగిలిన 6,635 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకుంటే ఇతర కంపెనీలకు ఇవ్వడమా? లేదంటే అమ్మడమా? అనేదానిపై నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్నది. వీటిలో మిథాని, ధాతు నిగం లిమిటెడ్, డీఆర్డీవో, బీడీఎల్ సంస్థల కింద 1,500 ఎకరాలు ఉండగా, 188 ఎకరాలు మాత్రమే యుటిలైజేషన్ లో ఉన్నది. అలాగే, మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి 3,500 ఎకరాలు ఉండగా, 1,500 ఎకరాలు మాత్రమే వినియోగంలో ఉన్నట్లు అధికారులు రిపోర్ట్‌లో పేర్కొన్నారు. లింగంపల్లిలోని భెల్ కంపెనీకి 2,350 ఎకరాలు ఉండగా, 225 ఎకరాలు, చర్లపల్లిలోని ఈసీఐఎల్ కు 1,200 ఎకరాలకు గాను 270 ఎకరాలు, హెచ్ఏఎల్కు 314 ఎకరాలకు గాను 100 ఎకరాలు, చాంద్రాయణగుట్ట డీఆర్డీవో అండ్ డీఆర్డీఎల్కు 85 ఎకరాలకు 30 ఎకరాలు వాడకంలో ఉన్నట్లు గుర్తించారు.
