
- ఉమ్మడి జిల్లాలో సుమారు 1.39 కోటి లక్షలు మొక్కలు నాటడమే లక్ష్యం
- నాటిన మొక్కలను సంరక్షించకపోవడంపై సర్కార్సీరియస్
- ఈసారి నాటిన ప్రతిమొక్క బతికేలా కార్యాచరణ
పెద్దపల్లి, వెలుగు: ప్రభుత్వం ఏటా ప్రతిష్టాత్మకంగా అమలుచేసే వనమహోత్సవంపై రాష్ట్ర సర్కార్ ఫోకస్ చేసింది. ఈసారి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు కోటి 39లక్షలు మొక్కలు నాటేందుకు అధికారులు నిర్ణయించారు. కాగా ప్రతీ యేటా లక్షల మొక్కలు నాటుతున్నా వాటిలో చాలా వరకు బతకడం లేదన్న ఆరోపణలున్నాయి. అధికారులకు మొక్కలు నాటడం వరకు ఉన్న శ్రద్ధ వాటిని కాపాడడంలో లేకపోవడంతో ఏటా మొక్కలు నాటుతున్నా బతకడం లేదు.
మొక్కల సంరక్షణపై సర్కార్ సీరియస్
ఏటా మొక్కలు నాటుతున్నా వచ్చే ఏడాదికి అవి కనిపించకపోవడంపై సర్కార్ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం హయాంలో హరితహారం పేరిట నాటిన మొక్కలు అధికారుల నిర్లక్ష్యంతో నేడు కనిపించడంలేదు. కనీసం ఎన్ని బతికి ఉన్నాయో చెప్పలేని పరిస్థితిలో అధికారులు ఉన్నట్లు సమాచారం. మొక్కల పెంపకంపై సర్కార్ సమీక్షలు నిర్వహించి జిల్లాలోని అధికారులకు ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోవడంలేదు. ఏటా వర్షాకాలం ప్రారంభం కాగానే మొక్కల పెంపకానికి సర్కార్ ఆదేశిలిస్తుంది.
అధికారులు మొక్కుబడిగా స్థలాలు గుర్తించి అక్కడ మొక్కలను నాటిస్తున్నారు. కానీ వాటికి ట్రీగార్డులు ఏర్పాటు చేయడం లేదు. నిత్యం వాటికి నీళ్లు పోయాల్సి ఉన్నా.. అప్పుడప్పుడు పోస్తున్నారు. రోడ్ల పక్కన పొలాల సమీపంలో నాటిన మొక్కలు.. రైతులు వరి కొయ్యలకు అంటించిన నిప్పుతో కాలిపోతున్నాయి. దీంతో అదే స్థానంలో మళ్లీ మొక్కలు నాటి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. కానీ వాటిని కాపాడే ప్రయత్నం చేయడం లేదన్న ఆరోపనులున్నాయి. ఈక్రమంలో ఈ యేడు నాటే ప్రతీ మొక్క బతకాలనే ఉద్దేశంతో సర్కార్ సీరియస్ గైడ్లైన్స్ ఇచ్చినట్లు తెలిసింది.
మొక్కల లక్ష్యం ఇలా
- పెద్దపల్లి జిల్లాలో గతేడాది వివిధశాఖల ఆధ్వర్యంలో 30లక్షల మొక్కలు నాటిన అధికారులు.. ఈసారి 31లక్షలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. డీఆర్‌డీవో ఆధ్వర్యంలో 16 లక్షలు, ఫారెస్ట్ శాఖ 90 వేలు, మున్సిపాలిటీల్లో 8 లక్షలు, సింగరేణి 5 లక్షలు, ఇతర శాఖల ద్వారా మొక్కలు పంపిణీ చేయనున్నారు.
- కరీంనగర్ జిల్లాలో 48,59,900 మొక్కలను నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా డీఆర్డీఏకు 17,32,200, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కు 9,47, 400, వ్యవసాయ శాఖకు 6,38,500, హార్టికల్చర్, సెరికల్చర్ శాఖకు 3.83 లక్షలు, ఎక్సైజ్ శాఖకు 2,03,100, మున్సిపాలిటీల్లో 2.50 లక్షలు, ఎస్సారెస్పీకి లక్ష, అటవీ శాఖకు 1.44 లక్షలు టార్గెట్ విధించారు.
- జగిత్యాల జిల్లాలో మొత్తం 48.98 లక్షల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 38.43 లక్షలు, వ్యవసాయ శాఖ 1.62 లక్షలు, ఆర్‌అండ్‌బీ 55 వేలు, ఇరిగేషన్22 వేలు, రెవెన్యూ 28 వేలు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ 7.81 లక్షలు, గృహ నిర్మాణ శాఖ 55 వేలు, వివిధ శాఖల ఆధ్వర్యంలో మొక్కలు నాటనున్నారు.
- రాజన్నసిరిసిల్ల జిల్లాలో10,38,500 లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రతీ మొక్క బతికేలా }చర్యలు తీసుకుంటాం
జిల్లాలో వివిధ శాఖల ద్వారా గుర్తించిన స్థలాలతో పాటు ఇండ్లకు పంపిణీ చేసే మొక్కలను కలుపుకొని, దాదాపు 31 లక్షల మొక్కలను నాటనున్నాం. సర్కార్ ఆదేశానుసారం మొక్కల సంరక్షణను సీరియస్‌గా తీసుకుంటున్నాం. ప్రతీ మొక్క బతికేలా చర్యలు తీసుకుంటాం. వాటి సంరక్షణ విషయంలో నిర్లక్ష్యం వహించే వారిని ఉపేక్షించం.
కాళిందిని, డీఆర్‌డీవో, పెద్దపల్లి జిల్లా