వరంగల్​ కాకతీయ జూపార్క్​పై సర్కార్ ఫోకస్​

 వరంగల్​ కాకతీయ జూపార్క్​పై సర్కార్ ఫోకస్​
  • వరంగల్‍ కాకతీయ జూపార్క్​లో అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ పనులు షురూ 
  • పదేండ్లలో గత సర్కారు పట్టించుకోని పనులకు ఇప్పుడు మోక్షం 
  • జూకు పెద్ద పులులు, అడవి దున్నలు, బార్క్​ డీర్స్..
  • క్యూరేటర్‍ కొత్త బిల్డింగ్‍ పనులకు శంకుస్థాపన 
  •  మంత్రి కొండా సురేఖ చొరవతో ఫండ్స్​ మంజూరు

వరంగల్‍, వెలుగు: వరంగల్​ కాకతీయ జూపార్క్​ అభివృద్ధిపై సర్కార్​ ఫోకస్​ పెట్టింది. సుమారు 40 ఏండ్ల కింద ఈ పార్క్​ ఏర్పాటు చేసినప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదు. పదేండ్లలో గత ప్రభుత్వం పట్టించుకోని పనులకు ఇప్పుడు మోక్షం లభిస్తున్నది. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రత్యేక చొరవతో ఫండ్స్​ మంజూరు చేస్తుండడంతో ఏండ్ల తరబడి పెండింగ్​లో ఉన్న, కొత్త పనులు చకచకా సాగుతున్నాయి. దీంతో కాకతీయ జూపార్క్​ పర్యాటకులతో కళకళలాడనున్నది.  

40 ఏండ్ల కింద ఓరుగల్లులో జూపార్క్..  

వరంగల్‍ కాకతీయ జూపార్కును 1985లో అప్పటి గవర్నర్ శంకర్‍ దయాల్‍ శర్మ దాదాపు 48 ఎకరాల విస్తీర్ణంలో 'మినీ జూ' గా ప్రారంభించారు. 2014 జనవరిలో 'స్మాల్ జూ' కేటగిరిలో గుర్తింపు పొందింది. దాదాపు 470 రకాల వన్యమృగాలు, జంతువులు, పక్షులు కనువిందు చేస్తున్నాయి. మొన్నటివరకు సెలవులు, వీకెండ్స్​లో 1000 నుంచి 1200 వరకు పర్యాటకులు వచ్చేవారు. ప్రస్తుతం పెద్ద పులులు, అడవి దున్నలు రాకతో ఈ సంఖ్య 1800 నుంచి 2 వేలకు చేరింది. టిక్కెట్ల రూపంలో ఏటా రూ.24 లక్షల ఆదాయం సమకూరుతోంది. దాదాపు 10 లక్షలకు పైగా జనాభా ఉన్న వరంగల్‍ ట్రైసిటీలో ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ 'జూ'ను సమైక్య రాష్ట్రంలో పట్టించుకోకపోగా,  స్వరాష్ట్రంలోని గత సర్కారు సైతం 10 ఏండ్లు ఇటువైపు చూడలేదు. అభివృద్ధిపై అప్పటి ప్రజాప్రతినిధులు హామీలిచ్చి వదిలేశారేకానీ ఏనాడూ పట్టించుకోలేదు. 

మంత్రి చొరవతో పెద్ద పులుల రాక.. 

అటవీ శాఖ మంత్రిగా కొండా సురేఖ జూపార్క్ అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపారు. జూకు పెద్ద పులులను తేవాలని చాలాకాలం కింద నిర్ణయించినా, ఆ దిశగా అడుగులు పడలేదు. మంత్రి సురేఖ వెంటనే పులులను తేవాలని ఆదేశించగా ఎన్‍క్లోజర్‍ పనులను చేపట్టారు. మొత్తంగా జూలోకి రెండు పెద్దపులులు, అడవి దున్నలు, హాగ్‍ డీర్, బార్కింగ్‍ డీర్‍లను కాకాతీయ జూకు తరలించారు. మంత్రి ముఖ్య అతిథిగా హాజరై పులులను ఎన్‍క్లోజర్‍లోకి వదిలారు.

 ఈ సందర్భంగా 4 వన్య ప్రాణులను దత్తత తీసుకున్నారు. వీటికోసం వ్యక్తిగతంగా రూ.2 లక్షలు అందించడం ద్వారా ఏడాది పాటు వాటికి ఆహారం, ఇతర సంరక్షణకు ముందుకొచ్చారు. త్వరలోనే పార్కులోకి వైట్‍ టైగర్స్, సింహాలు తీసుకురానున్నట్లు మంత్రి పేర్కొన్నారు. దీంతో ఆఫీసర్లు దీనికి అవసరమైన ప్రతిపాదనలు రెడీ చేస్తున్నారు.

జూలో ప్రారంభమైన అండర్‍ గ్రౌండ్‍ డ్రైనేజీ వర్స్క్​..

హనుమకొండ హంటర్‍రోడ్‍లోని జూపార్క్​ ప్రాంతం చుట్టూరా వందలాది కాలనీలు, వేలాది ఇండ్లు వెలిశాయి. ప్రస్తుతం పార్క్​ ఏరియా వాటికంటే డౌన్‍లో ఉంది. దీంతో రెగ్యూలర్‍ డ్రైనేజీ వాటర్​తోపాటు ఏటా వానాకాలంలో వచ్చే వరద జూపార్కులోకి చేరుతోంది. దీంతో జంతువులు రోగాలబారిన పడుతుండగా, దుర్వాసనతో పర్యాటకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏండ్ల తరబడి ఉన్న ఈ సమస్యను అధికారులు మంత్రి సురేఖ దృష్టికి తీసుకువెళ్లగా, పార్కులో వరద ఆగకుండా దాదాపు కిలోమీటర్ దూరం వరకు అండర్‍ గ్రౌండ్‍ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు.

 జూపార్క్​ అభివృద్ధికి మొదటిదఫాగా రూ.కోటి మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. దీంతో అండర్‍ గ్రౌండ్‍ డ్రైనేజీ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే కాలువలు తీశారు. అవసరమైన సిమెంట్‍, ఇసుక, ఐరన్‍ సమకూర్చుకుని పనులు చేస్తున్నారు. పార్కులో కొత్తగా క్యూరేటర్‍ బిల్డింగ్‍ నిర్మాణం చేపడుతున్నారు. మొత్తంగా ఓరుగల్లు కాకతీయ జూపార్కుకు కొత్త కళ సంతరించుకుంటోంది.