తొమ్మిదేండ్ల కల సాకారం.. నారాయణపేట-కొడంగల్​ ఎత్తిపోతలకు పరిపాలన అనుమతులు

తొమ్మిదేండ్ల కల సాకారం.. నారాయణపేట-కొడంగల్​ ఎత్తిపోతలకు పరిపాలన అనుమతులు

నారాయణపేట, వెలుగు: లక్ష ఎకరాలకు నీరందించే నారాయణపేట–కొడంగల్​ ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుకు రూ.2945 కోట్లు శాంక్షన్​ చేస్తూ ఇరిగేషన్​ చీఫ్  సెక్రటరీ రాహుల్​ బొజ్జ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల జిల్లాలోని ఎమ్మెల్యేలు మంత్రి ఉత్తమ్ కుమార్​రెడ్డితో పాటు సంబంధిత అధికారులను కలిసి ప్రాజెక్ట్​ అవసరాన్ని వివరించారు. ప్రాజెక్టుకు అవరసమైన సర్వే, డిజైన్, అధ్యయనం, ఎగ్జిక్యూషన్​  చేయాల్సిందిగా మహబుబ్​నగర్​ చీఫ్​ ఇంజినీర్లను ఆదేశించారు. 

ఫలించిన ఎదురుచూపులు..

ఎన్నో ఏండ్లుగా సాగునీటి కోసం ఎదురు చూస్తున్న నారాయణపేట జిల్లా రైతుల కల సాకారం కానుంది. తెలంగాణ ఏర్పాటు అనంతరం గవర్నర్​ జీవో 69ని జారీ చేసి ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చినా, గత బీఆర్ఎస్​ ప్రభుత్వం పట్టించుకోలేదు. కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పాటైన రెండు నెలల్లోనే జీవో 69ని అమలు చేస్తూ ప్రాజెక్టుకు అనుమతిస్తూ జీవో14ను జారీ చేసింది. నారాయణపేట, మక్తల్, కొడంగల్​ నియోజకవర్గాలకు సాగునీటిని అందించేందుకు కెనాల్స్​తో పాటు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

ప్రాజెక్టు స్వరూపం..

2008లో రాష్ట్ర ఇంజనీర్స్​ ఫోరం స్టడీ చేసి నారాయణపేట జిల్లాలోని భీమా ప్రాజెక్టుకు కేటాయించిన 20 టీఎంసీల్లో 7 టీఎంసీలు ఈ ప్రాంతానికి మళ్లించి సాగునీటిని ఇవ్వవచ్చని ప్రాజెక్టును డిజైన్​ చేసి ప్రభుత్వానికి అందించారు. మక్తల్​ మండలం భూత్పూర్​ రిజర్వాయర్​ నుంచి మోటార్ల ద్వారా ఊట్కూర్​ మండలం పెద్ద చెరువుకు, అక్కడి నుంచి నారాయణపేట మండలం జాజాపూర్​ చెరువుకు నీటిని ఎత్తిపోయనున్నారు. అక్కడి నుంచి జాయమ్మ చెరువులో నిర్మించనున్న  రిజర్వాయర్ లోకి నీటిని లిఫ్ట్​ చేయనున్నారు.

ఇక్కడి నుంచి దామరిగిద్ద మండలం కాన్​కుర్తిలో మరో రిజర్వాయర్​ ఏర్పాటు చేసి మండలంతో పాటు కొడంగల్​ నియోజకవర్గంలోని దౌల్తాబాద్, మద్దూర్, కోస్గి, కొడంగల్, బొంరాస్​పేట మండలాల్లో చెరువులను నింపుతూ కెనాల్స్​ ద్వారా నీటిని ఇవ్వడమే లక్ష్యం. దీని కోసం 2015లో అప్పటి గవర్నర్​ జీవో 69 జారీ చేసి ప్రాజెక్టుకు రూ.1470 కోట్లు అవసరమని, సర్వే కోసం కొన్ని నిధులు కూడా మంజూరు చేశారు. 90 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వమే భరించనుంది. ఈ ప్రాజెక్టుతో జిల్లాలోని నారాయణపేట, మక్తల్, కొడంగల్​ ప్రాంతాల్లోని లక్ష ఎరాలకు సాగు, తాగునీటిని అందించాలనేది ఈ ప్రాజెక్టు లక్ష్యం.

సీఎం రేవంత్​రెడ్డి ప్రత్యేక చొరవతోనే..

నారాయణపేట–కొడంగల్​ ప్రాజెక్ట్​ కోసం 2009 నుంచి సీఎం రేవంత్​రెడ్డి కొట్లాడారు. పలుమార్లు ఆల్​ పార్టీ నేతలతో కలిసి ఉద్యమాల్లో పాల్గొన్నారు. 2015లో గవర్నర్​ 69 జీవో జారీ చేయడంలోనూ కీలక పాత్ర పోషించారు. అయితే బీఆర్ఎస్​ సర్కారు ఈ ప్రాజెక్టును పక్కన పెట్టి పాలమూరు రంగారెడ్డి ద్వారా నీటిని ఇస్తామని చెప్పింది. ఇది సాధ్యం కాదని రేవంత్​ ఎన్నోసార్లు చెబుతూ వచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ సర్కారు రావడం, ఎన్నికల్లో చెప్పిన విధంగానే ఈ ప్రాజెక్టుకు పర్మిషన్​ ఇవ్వడంతో ఇక్కడి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

రైతుల కల నెరవేరింది..

ఎన్నో ఏండ్లుగా ఈ ప్రాంత రైతులు సాగునీటి కోసం ఉద్యమాలు చేశారు. నేడు ప్రాజెక్టుకు పరిపాలన అనుమతులు రావడంతో ఇక్కడి రైతుల కల సాకారమైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేస్తున్నాం. ప్రాజెక్టును మంజూరు చేసిన సీఎం రేవంత్​రెడ్డికి రైతులు, ప్రజల తరపున కృతజ్ఞతలు.
- చిట్టెం పర్ణికారెడ్డి, ఎమ్మెల్యే, నారాయణపేట.