థియేటర్ల దగ్గర పార్కింగ్ చార్జ్‌ వసూలుకు ఓకే.. సర్కారు జీవో

V6 Velugu Posted on Jul 20, 2021

హైదరాబాద్: రాష్ట్రంలో సినిమా థియేటర్ల యాజమాన్యాలు పార్కింగ్ చార్జీలు వసూలు చేసకునే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వైరస్ కారణంగా మూతపడిన సినిమా థియేటర్లకు ఊరట కల్పిస్తూ రాష్ట్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. థియేటర్లకు ఆర్థికంగా వెసులుబాటు కలిగేలా పార్కింగ్ ఫీజులు వసూలు చేసుకునేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి రాష్ట్రంలోని అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్ల వద్ద యాజమాన్యం సినిమాకు వచ్చే ప్రేక్షకుల నుంచి వాహనాల పార్కింగ్ ఫీజు వసూలు చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. 2018లో పార్కింగ్ ఫీజులను రద్దు చేస్తూ జారీ చేసిన జీవో నంబర్ 63ను సవరిస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులు కేవలం సింగిల్ స్క్రీన్ థియేటర్లకు మాత్రమే వర్తిస్తాయని, మల్టీఫ్లెక్స్ లు, వ్యాపార వాణిజ్య సముదాయాల్లో ప్రజల 
నుంచి పార్కింగ్ ఫీజులు వసూలు చేయవద్దని ఆదేశించింది. ఇందుకు సంబంధించి గతంలో జారీ చేసిన ఉత్తర్వులే అమల్లో ఉంటాయని పేర్కొంది. సినిమా చూడడానికి వచ్చే వాళ్లే  కాకుండా ఇతరులు కూడా థియేటర్ల వద్ద వాహనాలు పార్కింగ్ చేసి వెళ్లడం వల్ల వాటిని కాపాడడంతో పాటు మెయింటెనెన్స్‌కు ఇబ్బంది కలుగుతుండడంతో చార్జీ వసూలుకు నిర్ణయం తీసుకున్నట్లు జీవోలో తెలిపింది.
పార్కింగ్ చార్జ్ తగ్గిస్తాం
పార్కింగ్ చార్జీ ఎంత వసూలు చేయాలనేది థియేటర్ యాజమాన్యాలకే ప్రభుత్వం వదిలేసింది. 2018లో కారుకు రూ.30, ద్విచక్రవాహనాలకు రూ.20 చొప్పున థియేటర్ యాజమాన్యాలు వసూలు చేసేవి. అయితే ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు గతంలో కంటే పార్కింగ్ ఫీజులు తగ్గిస్తామని థియేటర్ యాజమాన్యాల వెల్లడించాయి.

Tagged Telangana, Cinema theaters, malls, Multiplex, Parking Charges

Latest Videos

Subscribe Now

More News