మల్లన్నసాగర్ నీళ్లు వాడుకునుడెట్ల .. రూ.1.30 కోట్లతో కొత్త పైప్​లైన్​

మల్లన్నసాగర్ నీళ్లు వాడుకునుడెట్ల .. రూ.1.30 కోట్లతో కొత్త పైప్​లైన్​
  • బీఆర్​ఎస్​ హయాంలో మిడ్​ మానేరు నుంచి తరలింపు
  • ప్రస్తుతం 9 .7 టీఎంసీల  నిల్వ
  • వినియోగించుకునేందుకు సర్కారు ప్లాన్​
  • హైదరాబాద్​ మెట్రోపాలిటన్​ వాటర్​ సప్లై సంప్ హౌజ్ కు మళ్లించేలా పనులు
  • 200 మీటర్ల పైప్ లైన్  కోసం రూ.1.30 కోట్ల తో టెండర్లు

సిద్దిపేట, వెలుగు:  మిడ్​ మానేరు నుంచి మల్లన్నసాగర్​కు గత బీఆర్ఎస్ ​ప్రభుత్వం తరలించి, నిల్వ చేసిన సుమారు 10 టీఎంసీల నీళ్లను వినియోగించుకోవడంపై రాష్ట్ర సర్కారు ఫోకస్​ పెట్టింది. ప్రస్తుతం ఇక్కడి నుంచి సిద్దిపేట మున్సిపాలిటీతోపాటు గజ్వేల్​, జనగామ నియోజకవర్గాల్లో తాగునీటి అవసరాల కోసం ప్రతిరోజూ 130ఎంఎల్​డీ(మిలియన్​ లీటర్స్​ పర్​ డే) సప్లై చేస్తున్నారు. ఎండాకాలమంతా సరఫరా చేసినా ఒక టీఎంసీకి మించి వాడుకునే పరిస్థితి లేదు.

 కానీ, హైదరాబాద్​లో నీటి అవసరాలు ఉన్నా ఇక్కడి నుంచి తరలించే ఏర్పాట్లు గత సర్కారు చేయలేదు. దీంతో మల్లన్నసాగర్​ నుంచి కొత్తగా పైపులైన్​ వేసి, దానిని ఎల్లంపల్లి నుంచి వచ్చే మెట్రో వాటర్​ పైపు లైన్​కు కనెక్ట్​ చేసి హైదరాబాద్​కు 100ఎంఎల్​డీ తరలించాలని  ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.  ఈ మేరకు 200 మీటర్ల పైప్ లైన్ నిర్మాణం కోసం రూ.1.30 కోట్లతో ఇటీవల టెండర్లు పిలిచారు. ఇలా తరలించినా మల్లన్నసాగర్​లో ఇంకా 7 నుంచి 8టీఎంసీలు మిగిలే ఉంటాయని ప్రాజెక్టు ఇంజినీర్లు చెప్తున్నారు. 

హైదరాబాద్​కు ఒక టీఎంసీ నీరు తరలించే ఏర్పాట్లు.. 

గత  ఆగస్టు నెల నుంచి వివిధ దశల్లో మిడ్​మానేరు నుంచి  మల్లన్నసాగర్​కు ఎత్తిపోసిన నీళ్లు  రిజర్వాయర్​లో 9.7 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. మిడ్​మానేరు మాత్రం పూర్తిగా అడుగంటి అందులో మునిగిన పదికిపైగా గ్రామాలు తేలాయి.  ప్రస్తుతం మల్లన్నసాగర్​ నుంచి  మంగోలు ట్రీట్ మెంట్ ప్లాంట్ ద్వారా సిద్దిపేట మున్సిపాలిటీతో పాటు గజ్వేల్​, జనగామ నియోజకవర్గాలకు 130 ఎంఎల్​డీ నీటిని శుద్ది చేసి తరలిస్తున్నారు. 

ఈ ఎండాకాలమంతా వాడుకున్నా ఒక టీఎంసీకి మించదు. మల్లన్నసాగర్​లో ఎవాపరేషన్​లాసెస్​(ఆవిరి నష్టాలు) ఎక్కువ. మరోవైపు హైదరాబాద్​లో నీటి కష్టాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో మల్లన్నసాగర్​ నీటిని హైదరాబాద్​తరలించేందుకు రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. మంగోలు ట్రీట్​మెంట్​ ప్లాంట్ కెపాసిటీ 270 ఎంఎల్​డీ కావడంతో  రెండో మోటారును వినియోగంలోకి తెచ్చి, 100 ఎంఎల్​డీని లిఫ్ట్​ చేయనున్నారు. మల్లన్న సాగర్ నుంచి  హైదరాబాద్  తాగు నీటి అవసరాల కోసం  గరిష్టంగా  ఒక టీఎంసీ నీటిని  మల్లించనున్నారు.

రూ.1.30 కోట్లతో కొత్త పైప్​లైన్​ 

మంగోలు ట్రీట్​మెంట్​ ప్లాంట్ ​నుంచి  కొండపాక  హెచ్ఎండబ్ల్యూ పంప్ హౌజ్​లోకి మళ్లించేందుకు ప్రత్యేకంగా పైప్​లైన్​ ఏర్పాటు చేస్తున్నారు.  దాదాపు 200 మీటర్ల పైప్​లైన్​ను రూ.1.30  కోట్లతో నిర్మించేందుకు హెచ్ఎండబ్ల్యూఎస్​(హైదరాబాద్ ​మెట్రోపాలిటన్​ వాటర్ సప్లై )  ఆధ్వర్యంలో  టెండర్ల  స్వీకరణ  ప్రక్రియ పూర్తి చేశారు.  త్వరలోనే  ఆర్ డబ్ల్యూఎస్​,  హెచ్ఎండబ్ల్యూఎస్​ అధికారుల ఆధ్వర్యంలో పనులు ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నిజానికి  కొండపాక పంప్ హౌజ్  నుంచి బీఆర్ఎస్​ హయాంలో హైదరాబాద్​ నీటిని గజ్వేల్, ఆలేరు, భువనగిరి, బీబీనగర్ ప్రాంతాలకు తరలించారు. ఇప్పుడు ఆ పాత నెట్​వర్క్​నే ఉపయోగించుకోవాలని నిర్ణయించడం విశేషం.

పాత నెట్​వర్క్​ వాడుకుంటాం..

మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్​కు తాగు నీటిని తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. పాత నెట్ వర్క్ ద్వారా మంగోల్ ట్రీట్ మెంట్ ప్లాంట్ మీదుగా కొండపాక  హెచ్ఎండబ్ల్యూఎస్​ పంప్ హౌజ్ కు మళ్లిస్తాం. ఇందుకోసం కొత్తగా 200 మీటర్ల మేర 1.30 కోట్ల వ్యయంతో పైప్ లైన్  వేస్తున్నాం. ఈ పనులకు సంబంధించి టెండర్లు స్వీకరిస్తాం. పది రోజుల్లో పనులు పూర్తి చేసి  ప్రతి రోజు 100 ఎంఎల్ డీ నీటిని  హైదరాబాద్​కు తరలిస్తాం. 

ఎం.బ్రిజేశ్, ఈఈహెచ్ఎండబ్ల్యూ