ఆర్టీసీ కార్గో, పార్సిల్ చార్జీల పెంపు

ఆర్టీసీ కార్గో, పార్సిల్ చార్జీల పెంపు
  • ఒక్కో ఐటమ్‌‌కు రూ.10 నుంచి 100 దాకా పెరుగుదల
  • కిలోమీటర్ల శ్లాబ్‌‌ల కుదింపు.. అమల్లోకి వచ్చిన కొత్త రేట్లు

హైదరాబాద్‌‌, వెలుగు: ఆర్టీసీ కార్గో, పార్సిల్‌‌ చార్జీలు పెరిగాయి. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌‌ ఉత్తర్వులు జారీ చేశారు. పెరిగిన ధరలు ఈ నెల 26 నుంచి అమల్లోకి వచ్చాయి. ఒక్కో ఐటెమ్‌‌కు రూ.10 నుంచి రూ.100 వరకు పెంచారు. యూనిఫాం, పెట్రో రేట్ల పెరుగుదలతో కిలోమీటర్ల శ్లాబ్స్‌‌ సవరించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుత ధరలతో గిట్టుబాటు కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు చెప్తున్నారు. గతేడాది మార్చిలో ఆర్టీసీ కార్గో, పార్సిల్‌‌ సర్వీసులను తీసుకొచ్చారు. రాష్ట్రంలో సుమారు 200 బస్సులను మోడిఫై చేసి, కార్గోకు ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వ పథకాలకు చెందిన వస్తువులతో పాటు ప్రైవేట్‌‌ పార్సిల్స్‌‌, కవర్స్‌‌ను రవాణా చేస్తోంది. దీని ద్వారా రోజుకు రూ.20 లక్షల ఆదాయం సమకూరుతోంది. అయితే తాజాగా మేనేజ్‌‌మెంట్‌‌ రేట్లను సవరించింది. కేటగిరీని బట్టి మినిమం రూ.10, మ్యాగ్జిమం రూ.100 వరకు పెంచింది. కిలోమీటర్ల శ్లాబ్‌‌ కూడా మార్చింది. గతంలో 0-–75 కిలోమీటర్లు, 76–-200 కి.మీ. ఉండగా, ఇప్పుడు 0-–50, 51-–100, 101–150, 151-–200 కిలోమీటర్ల యూనిఫాంగా మార్చారు.

  •     పార్సిల్స్‌‌:  సవరించిన ధరల ప్రకారం 0–50 కిలోమీటర్ల వరకు 5 కిలోల లోపు పార్సిల్‌‌ అయితే రూ.30, 6–25 కిలోలకు రూ.70, 26 నుంచి 50 కిలోలకు రూ.100గా నిర్ణయించారు. ఇదివరకు రూ.20, రూ.50, రూ.75 తీసుకునేవారు. గతంలో ఉన్న విధంగా ప్రతి ఐటెంకు హమాలీ చార్జీ రూ.20, క్లరికల్‌‌కు రూ.10, ట్రాన్‌‌షిప్‌‌మెంట్‌‌కు రూ.30, ఇన్సూరెన్స్‌‌, తదితర చార్జీలు విధించనున్నారు.
  •     పెరిషబుల్‌‌ ఐటెమ్స్‌‌: 0–50 కిలో మీటర్ల దూరానికి 25 కిలోల లోపు అయితే రూ.40, 26–50 కిలోలకు రూ.50, 51–75 కిలోలకు రూ.70, 76–100 కిలోలకు రూ.80గా నిర్ణయించారు. వీటికి కూడా హమాలీ, క్లరికల్‌‌, ట్రాన్‌‌షిప్‌‌మెంట్‌‌, ఇన్స్యూరెన్స్‌‌ చార్జీలు అదనంగా విధిస్తారు. 
  •     పార్సిల్‌‌ కవర్స్‌‌ : 250 గ్రాములకు వరకు పార్సిల్‌‌కు రూ.40, 251–500 గ్రాముల దాకా రూ.50, అరకేజీ నుంచి కేజీ వరకు రూ.80గా నిర్ణయించారు. ఇందులోనే ట్రాన్స్‌‌పోర్ట్‌‌, క్లరికల్‌‌, ఇన్సూరెన్స్‌‌ చార్జీలు కలిపి ఉంటాయి. ఇక ఇవే బరువుకు ఇప్పటి వరకు వరుసగా రూ.30, రూ.40, రూ.60గా చార్జి చేసేవారు.