
- వారంలో రెండ్రోజులు వరి కోతలు బన్జేయాలని హార్వెస్టర్ యజమానులకు ఆఫీసర్ల ఆదేశాలు
- మాట వినకుంటే కేసులు పెడుతున్న సర్కారు
- ఇంకా 70% కొనుగోలు సెంటర్లు తెరుచుకోలే
- తెరుచుకున్న చోట టోకెన్ల పేరిట రైతులకు తిప్పలు
- కరీంనగర్ జిల్లాలో మంత్రి గంగుల నిలదీత
- ఆఫీసర్లు చెప్పిన టైమ్‌కే వడ్లు తేవాలన్న మంత్రి
హైదరాబాద్ / నల్గొండ, వెలుగు: పునాస వడ్లను కొనేందుకు రాష్ట్ర సర్కారు కండిషన్ల మీద కండిషన్లు పెడ్తున్నది. హార్వెస్టర్ల ద్వారా వరికోస్తే మార్కెట్లోకి ఒక్కసారిగా వడ్లు వస్తాయనే నెపంతో వారంలో రెండ్రోజులు వరి కోయొద్దని ఆంక్షలు పెడుతున్నది. పర్మిషన్ లేకుండా పొలాల్లోకి వెళ్తే కేసులు పెడతామని హార్వెస్టర్ల యజమానులకు పోలీసులతో ఆఫీసర్లు హెచ్చరికలు జారీ చేయిస్తున్నరు. వడ్లు ఒకేసారి తేకుండా పలు జిల్లాల్లో టోకెన్ సిస్టం పెట్టిన్రు. ఆ టోకెన్లను కూడా టైమ్‌కు ఇవ్వకుండా రైతులను సతాయిస్తున్నరు. రాష్ట్రవ్యాప్తంగా వరి పంట కోతకు వచ్చినా.. ఇప్పటివరకు 30 % కొనుగోలు సెంటర్లే మొదలైనయ్. సెంటర్లు స్టార్ట్ చేసిన చోట ఎప్పటికప్పుడు కొంటలేరు. దీంతో రైతులు రోజుల తరబడి వడ్ల కుప్పల దగ్గర పడిగాపులు కాస్తున్నరు. తప్ప, తాలు పేరుతో క్వింటాల్‌పై 4 కిలోల చొప్పున ఆఫీసర్లు కోతలు విధిస్తున్నరు. హార్వెస్టర్లను అడ్డుకోవడంపై, టోకెన్లను ఇవ్వకపోవడంపై, సెంటర్లలో కొనుగోళ్లు స్టార్ట్ చేయకపోవడంపై రైతులు ఆందోళనలు చేస్తున్నరు. వెంటనే అన్నిచోట్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి, ఎలాంటి కండిషన్లు, కటింగ్‌లు లేకుండా వడ్లు కొనాలని డిమాండ్ చేస్తున్నారు.
లేట్ అవుతున్న కొనుగోళ్లు
ఈ వానకాలం సీజన్‌లో కోటి 30 లక్షల టన్నుల వడ్లు వస్తాయనే అంచనా ఉంది. ఇందుకోసం 6,575 కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర సర్కారు టార్గెట్‌గా పెట్టుకున్నా ఇప్పటివరకు 2,142 కొనుగోలు సెంటర్లనే ప్రారంభించారు. ఆయా కేంద్రాల్లోనూ పూర్తి స్థాయిలో కొనుగోళ్లు జరపట్లేదు. రెండు, మూడు వారాలుగా కోతలు పెరిగి వడ్లు భారీగా వస్తున్నా చాలాచోట్ల సెంటర్లు తెరుచుకోలేదు. మొదట దసరా తర్వాత ఓపెన్ చేస్తామన్న ఆఫీసర్లు.. దీపావళి తర్వాత పూర్తిస్థాయిలో సెంటర్లను స్టార్ట్ చేస్తామంటూ కాలయాపన చేశారు. ఉదాహరణకు సూర్యాపేట జిల్లాలో 333 కొనుగోలు సెంటర్ల ద్వారా 5 లక్షల టన్నుల వడ్లు కొనాలని ఆఫీసర్లు టార్గెట్ పెట్టుకున్నారు. కానీ ఇప్పటికీ జిల్లాలో కొనుగోలు సెంటర్లు ప్రారంభించకపోవడంతో రైతులు మిర్యాలగూడ మిల్లులకు వడ్లను తరలిస్తున్నారు. ఇదే అదనుగా మిల్లర్లు తప్ప, తాలు, తేమ పేరుతో కోతలు పెట్టడమేగాక రేట్లను తగ్గిస్తున్నారు. వెంటనే కొనుగోళ్లు మొదలుపెట్టాలంటూ నేరేడు చర్ల, హుజూర్ నగర్, పాలకీడు మండలాల రైతులు ధర్నాలకు దిగారు. వడ్లు ఎక్కువగా పండే కరీంనగర్ జిల్లాలో 351 సెంటర్లకుగాను 175 మాత్రమే ప్రారంభించారు. మెదక్ లో 365 సెంటర్లకుగాను 195, పెద్దపల్లి జిల్లాలో 292 సెంటర్లకుగాను 81 సెంటర్లు మొదలుపెట్టారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఇప్పటికి 5 సెంటర్లే ప్రారంభించగా.. మహబూబాబాద్, ఖమ్మం, మంచిర్యాల లాంటి జిల్లాల్aలో ఒక్క సెంటర్‌నూ ఓపెన్ చేయలేదు. సెంటర్లు ప్రారంభమైన చోట్ల గోనె సంచులు, హమాలీలు, లారీలు రాక వడ్ల కొనుగోళ్లు ముందుకు సాగడం లేదు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం కనగర్తిలో హమాలీ కూలీ రేట్లు కొలిక్కి రాక కొనుగోళ్లు లేటవుతున్నాయి. శంకరపట్నం మండలం మెట్పల్లి ప్రాథమిక సహ సహకారం సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో నిర్వాహకులు 40 కిలోల బస్తా కు మూడు కిలోల చొప్పున కటింగ్ చేస్తుండడంతో రైతులంతా లోకల్ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు ఫిర్యాదు చేశారు.
సన్నవడ్లకు కష్టకాలం
ఈసారి వానాకాలంలో సన్నవడ్లు సాగుచేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ సీజన్‌లో వరంగల్, హనుమకొండ, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్, యాదాద్రి, జనగామ జిల్లాల్లో రైతులు ఎక్కువగా సన్న వడ్లు సాగుచేశారు. కానీ ఆ జిల్లాల్లో కొనుగోలు సెంటర్లు ఓపెన్ కాక రైతులు ఆందోళన చెందుతున్నారు. మిల్లర్లకు మేలు చేసేందుకే ఆఫీసర్లు కొనుగోలు సెంటర్లను తెరవడంలో లేట్ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. సెంటర్లు ఓపెన్ చేయకపోవడం, వర్షాలు పడుతుండడంతో రైతులు.. వచ్చిన వడ్లను వచ్చినట్లు మిల్లులకు తరలిస్తున్నారు. దీంతో మిల్లు పాయింట్ల వద్ద వందలాది ధాన్యం ట్రాక్టర్లు క్యూలో కనిపిస్తున్నాయి. ఇదే అదునుగా మిల్లర్లు దోపిడీకి తెగబడుతున్నారు. వడ్లలో తేమ ఎక్కువుందంటూ మిల్లర్లు, కమీషన్ వ్యాపారులు, లారీ యజమానులు సిండికేట్‌గా మారి రేట్లు తగ్గిస్తున్నారు. వాస్తవానికి సన్న వడ్లను మిల్లింగ్ చేసినప్పుడు క్వాలిటీ రైస్ రావాలంటే 25 శాతం లోపు తేమ ఉండాలని మిల్లర్లు చెప్తున్నారు. కానీ మబ్బుపట్టి ఉండడంతో తేమ శాతం ఎక్కువగా వస్తున్నది. ఏ– గ్రేడ్ రకాలకు రూ. 1,960, కామన్ రకాలకు రూ. 1,940 మద్దతు ధర ఉండగా.. రూ. 500 వరకు తక్కువ చెల్లించి కొంటున్నారు.
వారంలో రెండ్రోజులు కోతలు బంద్
సెంటర్లకు వచ్చిన వడ్లను వచ్చినట్లు కొనలేకపోతున్న ఆఫీసర్లు కోతలపై, వడ్లు తేవడంపై కండిషన్లు పెడుతున్నారు. వారంలో రెండ్రోజులు కోతలు బంద్ చేయాలని వివిధ జిల్లాల్లో హార్వెస్టర్ల యజమానులకు ఆఫీసర్లు ఆదేశాలు ఇస్తున్నారు. నల్గొండ జిల్లాలోనైతే ఏకంగా పోలీసులే రంగంలోకి దిగి ఆదేశాలు పాటించని హార్వెస్టర్ యజమానులపై కేసులు పెడతామని హెచ్చరించారు. గురు, ఆదివారాల్లో గాని.. శుక్ర, ఆదివారాల్లో గానీ స్థానిక పరిస్టితులకు తగ్గట్టు కోతలు ఆపేయాలన్న ఆఫీసర్ల నిర్ణయాన్ని రైతుబంధు సమితులు కూడా అంగీకరించడంతో గత రెండు వారాలుగా జిల్లాల్లో కోతల విరామం అమలవుతోంది. టోకెన్ల సిస్టంమూ రైతులకు ఇబ్బందిగా మారింది. గతంలో క్లస్టర్ల పరిధిలో టోకెన్లు ఇవ్వగా.. ఇప్పుడు మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో ఇస్తున్నా రు. తీరా అక్కడ రెండెకరాలకే టోకెన్ ఇస్తుండడంతో, అంతకన్నా ఎక్కువ విస్తీర్ణంలో పండించిన రైతులు ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నారు. పదెకరాలుంటే ఐదు సార్లు టొకెన్ తీసుకోవాల్సిరావడంతో వారం, పది రోజుల పాటు వెయిట్ చేయక తప్పట్లేదు. దీంతో రైతులు కోతలు మొదలుపెట్టేముందే టోకెన్ల కోసం తిరగాల్సి వస్తున్నది. ఫలితంగా రైతు వేదికల దగ్గర భారీ క్యూలు కనిపిస్తున్నాయి.
క్లస్టర్ల పరిధిలో టోకెన్లు ఇవ్వాలి
మూడెకరాల్లో వరి వేసిన. కోతలకు రెడీగా ఉంది. పంటను వెంటనే అమ్ముకునేందుకు వీలు కల్పించాలి. ఆంక్షలు ఉండటంతో హార్వెస్టర్లు వరి కోతలకు వస్తలేవు. నిరుడు మాదిరిగా క్లస్లర్ల వారీగా టోకెన్లు ఇయ్యాలి.
- నూకపంగ శ్రీనివాస్, గూడూరు గ్రామం, మిర్యాలగూడెం మండలం
కోతలు ఆపితే నష్టపోతం
ఆరెకరాల సొంత పొలంతోపాటు మరో 14 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేసిన. పంట కోత ఆలస్యమైతే వడ్ల క్వాలిటీ దెబ్బతింటది. టోకెన్ల సిస్టం పెట్టి టైమ్‌కు కొంటలేరు. రెండు ఎకరాలకు కలిపి ఒక టోకెన్ ఇస్తున్నరు. నేను సాగు చేసిన 20 ఎకరాల వడ్లు అమ్ముకోవాలంటే కనీసం ఇంకా వారానికి పైగా ఆగాల్సి వచ్చెటట్లుంది.
‑ భోగబోయిన రాజు యాదవ్, ముల్కలకాల్వ, మిర్యాలగూడ