కాళేశ్వరం పక్కనే ఉన్నా భూములన్నీ బీళ్లు

కాళేశ్వరం పక్కనే ఉన్నా భూములన్నీ బీళ్లు

మంథని నియోజకవర్గం దుస్థితి
ఓసీపీల విస్తరణలో ఎస్సారెస్పీ కెనాల్స్​ ధ్వంసం
40 వేల ఎకరాలకు అందని నీళ్లు
పోతారం లిఫ్ట్​పై సర్కారు నిర్లక్ష్యం

పక్కనే గోదారి పారుతోంది.. దానిపై కాళేశ్వరం పరిధిలోని మూడు బ్యారేజీలున్నాయి. అయినా పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని భూములు మాత్రం బీళ్లుగా ఉంటున్నాయి. నీరందక మంథని, ముత్తారం, రామగిరి మండలాల్లోని 20 గ్రామాల్లో 40 వేల ఎకరాలు సాగుకు నోచుకోవడం లేదు. సమస్య పరిష్కారానికి పోతారం ఎత్తిపోతల పథకం నిర్మించాలని దశాబ్దాలుగా డిమాండ్​ ఉన్నా సర్కారు మాత్రం పట్టించుకోవడం లేదు. 

పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని పంట పొలాలకు 1980 నుంచి ఎస్సారెస్సీ కెనాల్ ద్వారా నీరందేది. గుండారం రిజర్వాయర్ నుంచి వచ్చే ఎల్ సిక్స్ కెనాల్ ద్వారా సుమారు 40 వేల ఎకరాలు సాగయ్యేవి. సింగరేణి సంస్థ ఓసీపీల విస్తరణ పనులతో రామగిరి మండలంలో ఎల్ సిక్స్ కెనాల్ పూర్తిగా ధ్వంసమైంది. సింగరేణి సంస్థ కెనాల్స్ నిర్మించే ప్రయత్నం చేసినా అవి పూర్తి స్థాయిలో లేకపోవడం, సరైన ప్రణాళిక కొరవడడంతో పనికి రాకుండా పోయాయి. దీంతో ఎస్సారెస్సీ డి 83 గుండారం కింది ప్రాంతంలో పొలాలకు 2007 నుంచి నీరందడం లేదు. అప్పటివరకు వరి సాగు చేసిన గుండారం రిజర్వాయర్ కింది ప్రాంతమైన మంథని, రామగిరి, ముత్తారం మండలంలోని 20 గ్రామాల రైతులు ప్రత్యామ్నాయ పంటలు చూసుకోవాల్సి వచ్చింది. నీళ్లు వస్తాయని ప్రతి ఏడాది పంటలు వేసి నష్టపోతున్నారు. చాలామంది రైతులు పత్తి సాగు చేస్తున్నప్పటికీ ఆర్థికంగా గిట్టుబాటు కావడం లేదని వాపోతున్నారు. మరికొందరు రైతులు ఖరీఫ్​లో పంటలు వేస్తూ రబీలో మాత్రం సాగుకు దూరమవుతున్నారు. దీంతో మంథని మండలం పోతారం వద్ద లిఫ్ట్​ఏర్పాటు చేయాలనే డిమాండ్​తెరమీదకొచ్చింది. 

లిఫ్ట్​లతోనే సమస్యకు పరిష్కారం

టీడీపీ హయాం నుంచి గోదావరిపైన ఆరెంద, పోతారం, ఉప్పట్ల వద్ద లిఫ్ట్​లు పెట్టాలనే డిమాండ్​ ఉంది. ఆనాటి నుంచి రైతులు లిఫ్ట్​ల కోసం పోరాడుతూనే ఉన్నారు. అనంతరం తెలంగాణ సర్కారు కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టింది. ప్రస్తుతం మంథని ప్రాంతంలో మూడు బ్యారేజీల్లో 365 రోజులు నీరు ఉంటున్నా ఇక్కడి రైతులకు మాత్రం చుక్క నీరు కూడా అందడం లేదు. నియోజకవర్గంలోని 20 గ్రామాలకు సాగునీరు అందాలంటే ఎత్తిపోతల పథకం ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పద్నాలుగేళ్లుగా సాగు నీరందక నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మంథని నియోజకవర్గంలోని బాధిత గ్రామాలకు సాగు నీరందుతుందని ఆశించారు. ప్రాజెక్టు పూర్తయినా సాగునీరందకపోవడంతో బాధిత గ్రామాల రైతులు పోతారం లిఫ్ట్ ఏర్పాటు కోసం ఐదేళ్లుగా పోరాటం చేస్తున్నారు. రెండేళ్ల క్రితం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్​కు వినతిపత్రం ఇచ్చారు. అలాగే స్థానికంగా కూడా రైతులు వివిధ రూపాల్లో సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. అయినా ఇప్పటివరకు ప్రభుత్వం లిఫ్ట్​పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో రైతులు మరోసారి పోరుబాటకు సిద్ధమవుతున్నారు. సింగరేణి ఓసీపీల విస్తరణ కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి, ఎస్సారెస్సీ కాలువలతో  పనిలేకుండా గోదావరిపై నిర్మించిన బ్యారేజీల నుంచి నీరు అందించాలని, దాని కోసం పోతారం వద్ద లిఫ్ట్​ఏర్పాటు చేయాలని డిమాండ్​చేస్తున్నారు. 

సాగు నీరు వస్తలేదు

పదెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నా. కాళేశ్వరం పక్కనే ఉన్నా స్థానిక రైతులకు సాగునీరు అందడం లేదు. ఏడాదికి వర్షాధారంగా ఒక్క పంటే పండించగలుగుతున్నం. లిఫ్ట్ ఏర్పాటు అయితే జిల్లాలోని చాలా మండలాలకు నీళ్లు అందుతాయి. ఏడాదికి రెండు పంటలు పండించవచ్చు.
- సాధుల శ్రీనివాస్,  రైతు, గుంజపడుగ