- ఢిల్లీ, హర్యానా తరహాలో అమలు చేసేందుకు హౌసింగ్ అధికారుల అధ్యయనం
- త్వరలో ప్రభుత్వానికి నివేదిక... హౌసింగ్ పాలసీపై డ్రాఫ్ట్ రెడీ
- ఉమ్మడి ఏపీలో జీవో జారీ... గచ్చిబౌలిలో స్థలం ఇచ్చి ఇండ్లు కట్టించిన ‘రాంకీ’
- ‘రాంకీ’ ప్రాజెక్టు తరహాలో రాష్ట్రమంతా అమలు చేసేందుకు ముమ్మర కసరత్తు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం 'అఫర్డబుల్ హౌసింగ్ పాలసీ'ని సిద్ధం చేస్తోంది. ఈ పాలసీపై హౌసింగ్ అధికారులు ఇప్పటికే డ్రాఫ్ట్ ను రెడీ చేయగా త్వరలో ప్రభుత్వానికి అందచేయనున్నారు. ఈ పాలసీని పకడ్బందీగా అమలు చేసేందుకు కీలక అంశాలను చేర్చనున్నది.
ఇకపై రాష్ట్రంలో బిల్డర్లు చేపట్టే ప్రతి ప్రైవేట్ రెసిడెన్షియల్ ప్రాజెక్టులో తప్పనిసరిగా 20 శాతం స్థలాన్ని లేదా ఇళ్లను ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) కేటాయించాల్సి ఉంటుంది. ప్రస్తుతం 20 శాతం గ్రీన్ ఏరియా, ఓపెన్ ప్లేస్ కు కేటాయించాల్సి ఉండగా దీనికి అదనంగా మరో 20 శాతం వదలాల్సి ఉంటుంది. ఇది ఉమ్మడి ఏపీలో అప్పటి ప్రభుత్వం జీవో ఇచ్చి అమలు చేసిందని హౌసింగ్ అధికారులు చెబుతున్నారు.
గత ఏడాది జరిగిన తెలంగాణ రైజింగ్ సదస్సులో ‘అఫర్టబుల్ హౌసింగ్ పాలసీ’పై హైదరాబాద్ కు చెందిన పలువురు ప్రముఖ బిల్డర్లు ఈ పాలసీపై తమ సలహాలు, సూచనలను ప్రభుత్వానికి తెలిపారు. ప్రతి ప్రైవేట్ హౌసింగ్ ప్రాజెక్టులోనూ పేదల కోసం నిర్ణీత వాటాను కేటాయించేలా చట్టబద్ధమైన నిబంధనలను తీసుకురావాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. పాలసీ రూపకల్పనలో బిల్డర్ల సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. డ్రాఫ్ట్ బిల్లుపై సైతం త్వరలో బిల్డర్లతో మీటింగ్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
ఢిల్లీ, హర్యానా నమూనాలో అమలు..
ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో 20 శాతం పేదలకు ఇవ్వాలన్న చట్టం విజయవంతంగా అమలవుతోంది. అక్కడ బిల్డర్లు కేటాయించిన స్థలంలో ప్రభుత్వం పేదల కోసం సింగిల్ లేదా డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను నిర్మించి వేలమందికి అందజేసింది. దీనిపై అధ్యయనం చేసేందుకు మన రాష్ట్ర హౌసింగ్ బోర్డు ఉన్నతాధికారుల బృందం ఇటీవల ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో పర్యటించింది.
అక్కడి క్షేత్రస్థాయి పరిస్థితులు, రిజిస్ట్రేషన్ ప్రక్రియను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించనున్నారు. హౌసింగ్ , అర్బన్ డిపార్ట్ మెంట్ అధికారులతో సమావేశమై స్టడీ టూర్ పై రిపోర్ట్ రెడీ చేసి త్వరలో ప్రభుత్వానికి అందచేస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
గత అనుభవాలే స్ఫూర్తిగా..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇటువంటి నిబంధనపై గతంలో జీవో జారీ అయిందని అధికారులు చెప్తున్నారు. దానికి నిదర్శనమే గచ్చిబౌలిలోని రాంకీ ప్రాజెక్టులో 20 శాతం స్థలం కేటాయించి, పేదలకు సింగిల్ బెడ్‌రూమ్ ఫ్లాట్లను నిర్మించింది. ప్రభుత్వం ఇటీవల సుమారు 600 ఎస్ ఎఫ్ టీ లోపు విస్తీర్ణం ఉన్న ఫ్లాట్ ను రూ. 15 లక్షల లోపు ధరకే వేలం వేయగా ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. పెద్ద అపార్ట్‌మెంట్లు, విల్లాల్లో పని చేసే కార్మికులు, పేదలు దూర ప్రాంతాల నుంచి రానవసరం లేకుండా అదే ప్రాజెక్టు ఆవరణలో నివసించేలా చూడటమే ఈ విధానం ప్రధాన ఉద్దేశం.
ఉమ్మడి రాష్ట్రంలోని జీవో ప్రకారం.. ఒకవేళ బిల్డర్ 20 శాతం స్థలాన్ని కేటాయించలేకపోతే, దానికి బదులుగా విస్తీర్ణాన్ని బట్టి నిర్ణీత రుసుమును (ఎఫ్టీకి రూ. 20 నుంచి రూ. 70 వరకు) ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందని అప్పటి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పుడు అదే తరహాలో మరింత పకడ్బందీ చట్టబద్ధమైన నిబంధనలను తీసుకురావాలని సర్కారు భావిస్తోంది. త్వరలోనే ఈ డ్రాఫ్ట్ బిల్లుపై బిల్డర్లతో సమావేశం ఏర్పాటు చేసి, వారి సలహాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం పాలసీని అధికారికంగా ప్రకటించనున్నారు. ఉమ్మడి రాష్ర్టంలో ఈ రూల్ పై 378 పేజీల జీవో ను విడుదల చేసింది.
