
- రామప్ప సరస్సులో ఐల్యాండ్ ఏర్పాటుకు చర్యలు
- ములుగు జిల్లా ఇంచర్ల, గణపురంలో ఎకో ఎథ్నిక్ విలేజ్‌లు
- రంగారావుపల్లి పంప్ హౌస్ నుంచి రామప్ప చెరువు వరకు బోటింగ్
- రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాల్లో టూరిజం డెవలప్‌మెంట్
- టెండర్ నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం
ములుగు/వెంకటాపూర్(రామప్ప), వెలుగు : పర్యాటక రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. రామప్ప, లక్నవరం, మేడారం, మల్లూరు హేమాచలక్షేత్రం, బొగత జలపాతం, ఏటూరునాగారం అభయారణ్యం వంటి ప్రాంతాలతో టూరిజం హబ్‌గా మారిన ములుగు జిల్లాలో మరిన్ని టూరిస్ట్ ప్లేస్‌ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటోంది. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప రామలింగేశ్వరస్వామి ఆలయం కేంద్రంగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే రామప్ప ఆలయంతో పాటు ఉప ఆలయాల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో నాలు జిల్లాల్లో టూరిస్ట్ ప్లేస్‌ల అభివృద్ధి పనులకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది.
రామప్పలో ఐల్యాండ్...
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని రామప్ప సరస్సులో ఐల్యాండ్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లక్నవరంలో ఇప్పటికే మూడు ఐల్యాండ్‌లు ఉండగా.. రామప్పలో సైతం ఐల్యాండ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఐల్యాండ్‌లో చిన్నారులు ఆడుకునేందుకు, పెద్దలు కూర్చొని సేదతీరుతూ ప్రకృతి అందాలను వీక్షించేందుకు వీలుగా ప్రత్యేక సౌకర్యాలను కల్పించనున్నారు. రామప్ప సరస్సులో నిత్యం నీళ్లు ఉండేలా దేవాదుల ద్వారా పంపింగ్ చేస్తున్నారు. ములుగు శివారులోని రంగారావుపల్లి వద్ద గల పంప్ హౌస్ నుంచి రామప్ప చెరువు తూము వరకు మూడు కిలోమీటర్ల మేర బోటింగ్ సౌకర్యం కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో రామప్ప కట్ట నుంచి గుడి వరకు ఆటో డ్రైవర్లు, వ్యాపారులకు సైతం ఉపాధి కలుగుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అలాగే భూపాలపల్లి జిల్లా గణపురం సరస్సు కట్ట వద్ద పర్యాటక అభివృద్ధితో పాటు కోటగుళ్లు, ములుగు మండలం ఇంచర్ల వద్ద ఎకో ఎథ్నిక్ విలేజీల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నారు.
హైవేలపై స్వాగత తోరణాలు
జిల్లాలోని హైవేలు, ప్రధాన జంక్షన్లను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు. ములుగు మండలం జంగాలపల్లి వద్ద ఇప్పటికే ఢమరుకం, నందీశ్వరులు, ఏనుగులతో కూడిన స్వాగత తోరణాలు అందుబాటులోకి వచ్చాయి. అదేవిధంగా ములుగులోని జిల్లా ఆస్పత్రి కూడలిలో ‘ఐ లవ్ములుగు’, గట్టమ్మ ఆలయం వద్ద ఆదివాసీ సంప్రదాయాలతో కూడిన దృశ్యాలు, తాడ్వాయి, పస్రా వద్ద సైతం ప్రత్యేక ఆకర్షణీయ దృశ్యాలతో కూడిన పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా జాతీయ రహదారులపై పలు చోట్ల స్వాగత తోరణాలను నిర్మించనున్నారు. మూలమలుపుల వద్ద చిహ్నాలు, సూచికలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఐదు జిల్లాల్లో పనులకు రూ. 1.59 కోట్లతో టెండర్లు
ములుగు జిల్లాతో పాటు రాష్ట్రంలోని భద్రాద్రికొత్తగూడెం, నాగర్‌కర్నూల్, కామారెడ్డి, నల్గొండ జిల్లాల్లో ప్రసాద్ స్కీమ్ కింద చేపట్టే పనులకు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ టెండర్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ములుగు జిల్లాలో ఎన్‌హెచ్‌పై స్వాగత తోరణాల ఏర్పాటు, రామప్ప గుడి, ములుగు వద్ద చిహ్నాలు, గుర్తుల ఏర్పాటు ఇతర పనుల కోసం రూ.98.31 లక్షలు, రామప్ప రీజియన్ సస్టెయినబుల్ టూరిజం సర్క్యూట్‌లో భాగంగా కోటగుళ్లు, రామప్ప ఐల్యాండ్, ఇంచర్ల ఎకో ఎథ్నిక్ విలేజ్ నిర్మాణం, ఎస్‌ఏఎస్‌సీఐ కింద పలు అభివృద్ధి పనులకు రూ.2.90 లక్షలు కేటాయించారు. అలాగే భద్రాద్రికొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద పర్యాటక చిహ్నాలు, డిజైన్ల ఏర్పాటు, నాగర్‌కర్నూల్ జిల్లా అమరగిరి, ఈగలపెంట, చెంచు మ్యూజియం వద్ద చిహ్నాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. స్వదేశ్ దర్శన్2.0 పథకం ద్వారా కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ వద్ద చాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్‌మెంట్ కింద చిహ్నాల ఏర్పాటు, నల్గొండ జిల్లా బుద్ధవనం వద్ద చిహ్నాలు, డిజైన్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకుగాను రూ. కోటి 59 లక్షల 93 వేలతో టెండర్లు పిలిచారు. ఇందుకు సంబంధించి ఈ నెల 17న నోటిఫికేషన్ రిలీజ్ చేయగా... శనివారం నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు.
పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం
ములుగు జిల్లాలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే ప్రధాన కూడళ్ల వద్ద సుందరీకరణ పనులు జరిగాయి. రాష్ట్రం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తున్నారు. టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తోంది. ఎకో ఎత్నిక్ విలేజీ, ఐల్యాండ్, ఎకో పార్క్, చిన్నారుల కోసం ప్లేయింగ్ బోట్ వంటి సౌకర్యాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. పనులు పూర్తి అయితే టూరిస్ట్ ప్లేస్‌ల అభివృద్ధితో పాటు స్థానిక యువతకు ఉపాధి కూడా పెరగనుంది.- దివాకర టీఎస్, ములుగు కలెక్టర్