ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భూభారతిపై నేటి నుంచి సదస్సులు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భూభారతిపై నేటి నుంచి సదస్సులు
  • పైలెట్ ప్రాజెక్టు కిందఉమ్మడి జిల్లాలో నాలుగు మండలాల ఎంపిక
  • కరీంనగర్‌‌‌‌లో సైదాపూర్, పెద్దపల్లిలో ఎలిగేడు, సిరిసిల్లలో రుద్రంగి, జగిత్యాలలో బుగ్గారం

కరీంనగర్, వెలుగు: దశాబ్దాల తరబడి పెండింగ్‌‌లో ఉన్న భూసమస్యలతోపాటు ధరణి పోర్టల్ కారణంగా తలెత్తిన వివాదాల పరిష్కారానికి తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టం భూభారతి అమలు ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభం కానుంది. 

రాష్ట్రంలో భూభారతి పోర్టల్ అందుబాటులోకి వచ్చాక తొలుత పైలట్ మండలాలుగా నాలుగింటిని ఎంపిక చేయగా.. అందులో ఉమ్మడి జిల్లాలోని మండలాలకు చోటుదక్కని విషయం తెలిసిందే. రెండో దఫాలో ఉమ్మడి జిల్లాలోని నాలుగు మండలాలను ఎంపిక చేశారు. కరీంనగర్ జిల్లాలో సైదాపూర్, పెద్దపల్లి జిల్లాలో ఎలిగేడు, రాజన్నసిరిసిల్ల జిల్లాలో రుద్రంగి, జగిత్యాల జిల్లాలో బుగ్గారం మండలాలు ఉన్నాయి. ఈ నెల 5 నుంచి 20 వరకు ఆయా మండలాల్లోని గ్రామాల్లో రెవెన్యూ సదస్సు నిర్వహించి రైతుల నుంచి భూసమస్యలపై దరఖాస్తులు స్వీకరించనున్నారు. 

మండలానికో ఇద్దరు తహసీల్దార్ల నేతృత్వంలో ప్రత్యేక టీమ్‌‌లు 

పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైన మండలంలో ఇద్దరు తహసీల్దార్ల నేతృత్వంలోని రెండు టీమ్‌‌లు చెరోసగం గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నాయి. తహసీల్దార్‌‌‌‌తోపాటు ముగ్గురు లేదా డీటీలు, ముగ్గురు లేదా నలుగురు ఆర్ఐ, ఒకరు లేదా ఇద్దరు సర్వేయర్లు టీమ్ సభ్యులుగా ఉంటారు. వీరు ఒక్కో గ్రామంలో రెండు రోజులపాటు రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూసమస్యలపై దరఖాస్తులు స్వీకరించి బాధితులకు రసీదు ఇవ్వనున్నారు. ఏ రోజుకారోజు డేటా ఎంట్రీ చేస్తూ పరిష్కారం కోసం సంబంధిత ఆర్డీవో, కలెక్టర్లకు పంపనున్నారు. 

సదస్సుల వద్ద భూభారతి దరఖాస్తులు

రెవెన్యూ సదస్సుల్లో రైతులకు అప్లికేషన్లు ఇవ్వనున్నారు. ఇందులో అప్లికేషన్ నంబర్‌‌‌‌తోపాటు జిల్లా, డివిజన్, మండలం, గ్రామం పేరు, భూమి యజమాని వివరాలకు ప్రత్యేక కాలమ్స్ ఉన్నాయి. వీటితోపాటు కులం, ఆధార్ నంబర్, కొత్త, పాత పాస్ బుక్స్ నంబర్లు, అడ్రస్ లాంటి వివరాలు తీసుకుంటారు. సమస్యల విషయానికొస్తే.. పాస్‌‌బుక్‌‌లో సర్వే నంబర్ మిస్సింగ్, మ్యుటేషన్ పెండింగ్, కోర్టు ఉత్తర్వుల అమలు, తహసీల్దార్ డిజిటల్ సైన్(డీఎస్) పెండింగ్, సర్వే నంబర్లవారీగా విస్తీర్ణంలో సవరణ, భూమి సంక్రమించిన విధానం, భూమి స్వభావంలో మార్పులు, పట్టాదారు పేరు, తండ్రి పేరు, కులం, జండర్ తదితర వివరాల్లో తప్పులున్నా సరి చేయడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. నిషేధిత జాబితాలో ఉన్న భూములను తొలగించడానికి కూడా దరఖాస్తు సమర్పించవచ్చు. పట్టా హక్కులకు సంబంధించి అసైన్మెంట్, ఓఆర్సీ, 38  ఇ రాకపోవడం, వారసత్వ సమస్య, భూసేకరణ సమస్యలతోపాటు ఇతర సమస్యలపై దరఖాస్తు చేసుకోవచ్చు.