ఒకే గొడుగు కిందికి పంచాయతీ రాజ్ శాఖ

ఒకే గొడుగు కిందికి  పంచాయతీ రాజ్ శాఖ
  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను ఒకే గొడుగు కిందకు తెచ్చింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల సాధికారతకు, వాటిని తయారు చేయడానికి ఈ పాలసీ దోహదపడుతుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణలో 65 లక్షల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. సొసైటీ ఫర్  ఎలిమినేషన్  ఆఫ్  రూరల్  పావర్టీ (సెర్ప్), పేద మహిళల కోసం మున్సిపల్  ఏరియాల్లో మిషన్  ఫర్  ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (మెప్మా) ఏర్పాటు చేశారు. 

మహిళలు గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి, సమగ్ర అభివృద్ధికి ఈ సంస్థలు దోహదపడుతున్నాయి. రాష్ట్రంలో 4.37 లక్షల సహాయక సంఘాల్లో 47.40 లక్షల మంది సభ్యులు ఉన్నారు. వీఓలు 18000 మంది, మండల మహిళా సమాఖ్యలు 553 ఉండగా, 32 జిల్లా సమాఖ్యలు ఉన్నాయి. అర్బన్  ప్రాంతాల్లో 1.72లక్షల మహిళా సంఘాలు ఉండగా 17.60 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు.

 189 పట్టణాల్లో 6,367 ఏరియా లెవల్  ఫెడరేషన్లు ఉన్నాయి. మహిళలను మూడంచెల వ్యవస్థలోకి సమీకరించారు.  కోటి మంది మహిళలను స్వయం సహాయక బృందంలోకి తీసుకురావడం, స్వయం సహాయక బృందాలు, వాటి సమాఖ్యలను కోటీశ్వరులుగా మార్చడం వంటి లక్ష్యాలను విస్తృతం చేసి, బలోపేతం చేసే లక్ష్యంతో  ప్రభుత్వం ఇప్పుడు ‘ఇందిరా మహిళా శక్తి మిషన్ -2025’ ను ప్రవేశపెట్టింది.