గొర్రెల స్కామ్లో అరెస్టులకు రంగం సిద్ధం

గొర్రెల స్కామ్లో అరెస్టులకు రంగం సిద్ధం

 

  • ఈడీ అదుపులో తలసాని ఓఎస్డీ కల్యాణ్ కుమార్, మరో ఇద్దరు
  • సోదాల్లో స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా స్టేట్ మెంట్ల రికార్డ్
  • నేడు కూడా కొనసాగనున్న విచారణ

హైదరాబాద్, వెలుగు:  గొర్రెల స్కీమ్​ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రూ.వందల కోట్ల స్కామ్​ ఈడీ దర్యాప్తులో వెలుగులోకి వస్తున్నది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌‌‌‌కు  ఓఎస్డీగా పనిచేసిన కల్యాణ్‌‌‌‌ కుమార్​ను ఈడీ అధికారులు రెండు రోజులుగా విచారిస్తున్నారు. గురువారం కల్యాణ్ కుమార్​తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని 11 గంటల పాటు  ప్రశ్నించారు. శుక్రవారం కూడా ఈ ముగ్గురిని విచారించనున్నారు. విచారణ ముగిసిన అనంతరం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచే అవకాశాలు ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా కల్యాణ్ కుమార్ ఇంటితో పాటు 8 ప్రాంతాల్లో బుధవారం ఈడీ అధికారులు సోదాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సోదాల్లో నిధుల గోల్‌మాల్‌, మనీలాండరింగ్‌ కు సంబంధించిన కీలక పత్రాలను పెద్ద సంఖ్యలో స్వాధీనం చేసుకున్నారు. కల్యాణ్ కుమార్ ను బుధవారం అర్ధరాత్రి వరకు విచారించారు. కొనసాగింపుగా గురువారం మరో ఇద్దరితో కలిపి ప్రశ్నించారు. 

కీలకంగా మారిన రికార్డులు

పశుసంవర్ధక శాఖ, గొర్రెలు మేకల డెవలప్‌మెంట్‌ ఫెడరేషన్‌లో ఇప్పటికే సీజ్‌ చేసిన గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించిన ఆడిట్‌ రికార్డులు, బ్యాంకుల స్టేట్‌మెంట్ల ఆధారంగా ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. ఇందులో గొర్రె పిల్లల కొనుగోలు, తరలింపు దగ్గర నుంచి లబ్ధిదారులకు అప్పగించేంత వరకు మంజూరు చేసిన నిధుల ఆర్థికశాఖ రికార్డులు కీలకంగా మారినట్లు సమాచారం. నిధుల దారిమళ్లింపుకు బాధ్యులైన అధికారులు సహా సూత్రధారి కల్యాణ్ కుమార్  విచారణ ముగిసిన అనంతరం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి.