ఇది సామాన్యుల సర్కార్: గవర్నర్ తమిళిసై

ఇది సామాన్యుల సర్కార్: గవర్నర్ తమిళిసై
  • ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా పాలన
  • కంచెలు తొలగించి ప్రజాభవన్ తెరిచాం
  • ప్రజలు  నేరుగా వచ్చి సమస్యలు చెప్పుకుంటున్నారు
  • ఆరు గ్యారెంటీలు నెరవేర్చుతం.. త్వరలో రూ. 500కే సిలిండర్
  • గత ప్రభుత్వం అప్పుల పాలు చేసి అప్పగించింది
  • ప్రజలపై భారం వేయకుండా ఆర్థిక పునర్నిర్మాణం 
  • ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సేవలు అందిస్తం
  • రూ. 2 వేల కోట్లతో ఐఐటీలను అప్ గ్రేడ్ చేస్తం
  • వెయ్యెకరాల్లో 10–12 ఫార్మా విలేజ్ లు
  • త్వరలో యువతకు 2 లక్షల కొలువులిస్తం
  • వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నూతన పారిశ్రామిక విధానం
  • ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన గవర్నర్ తమిళిసై

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగా పాలన అందిస్తోందని, ఇది సామాన్యుల సర్కార్ అని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. ఇవాళ అసెంబ్లీలో ఆమె ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ ప్రజలు  ప్రజాస్వామ్యం కోసం పోరాడారని, అందుకు అనుగుణంగానే పాలన కొనసాగుతోందని అన్నారు.  

ప్రజల సర్కారు కొలువుదీరగానే ప్రగతి భవన్ కంచెలు తొలగించి జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్ గా మార్చిందని గవర్నర్ అన్నారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా సామాన్యులు నేరుగా ప్రజాభవన్ కు వచ్చి  సమస్యలు చెప్పుకొనే పరిస్థితి కల్పించామని చెప్పారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేసి తీరుతామని గవర్నర్ ఉద్ఘాటించారు. ఇప్పటికే రెండింటిని అమలు చేశామని, మరో రెండింటిని త్వరలో అమలు చేయనున్నామని అన్నారు.

రూ. 500 కే అర్హులకు గ్యాస్ సిలిండర్లను త్వరలోనే అందించబోతున్నట్టు చెప్పారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వెళ్లిందని, ప్రస్తుతం  ప్రజలపై భారం వేయకుండా ఆర్థికంగా పునర్నిరించే ప్రయత్నాల్లో ఉన్నామన్నారు.  

2 లక్షల కొలువుల భర్తీపై ఫోకస్

టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తున్నామని, లక్షల కొలువును వీలైంత త్వరగా భర్తీ చేస్తామని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. ప్రభుత్వం రైతులు, మహిళలు, యువత ఆకాంక్షలు నెరవేర్చబోతోందని భరోసా ఇచ్చారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును  పూర్తి చేయడంపై ఫోకస్  పెట్టామని అన్నారు. త్వరలో కులగణన చేపట్టబోతున్నామని వివరించారు.  

ఇంటింటికీ ఇంటర్నెట్ 

రాష్ట్రంలో ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సేవలు అందించనున్నామని గవర్నర్ చెప్పారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటు, సేవల రంగం విస్తరణకు ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించారు. రూ. రెండు వేల కోట్లతో రాష్ట్రంలోని ఐఐటీలను అప్ గ్రేడ్ చేస్తామని చెప్పారు. 

వెయ్యెకరాల్లో ఫార్మా విలేజ్ లు

 వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో 10నుంచి 12 ఫార్మా విలేజ్ లను ఏర్పాటు చేయబోతున్నామని గవర్నర్ చెప్పారు. రూ. 40 వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు నెలకొల్పేందుకు పారిశ్రామిక వేత్తలతో ఎంఓయూలు కుదుర్చుకున్నట్టు చెప్పారు. వాస్తవ  పరిస్థితులకు అనుగుణంగా నూతన పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తామని గవర్నర్ చెప్పారు. మౌలిక వసతుల రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.