లోకల్​ అవసరాలకు ఇసుక ఉచితం

లోకల్​ అవసరాలకు ఇసుక ఉచితం
  • వాగుల నుంచి తీసుకునేందుకు అనుమతి
  • కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ

హైదరాబాద్, వెలుగు: గ్రామీణ  ప్రాంతాల్లోని ప్రజలకు ఇసుక కొరత రావద్దన్న ఉద్దేశంతో స్థానిక అవసరాలకు, సొంత ఇండ్ల నిర్మాణానికి ఉచితంగా వాడుకునేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇసుక లభ్యత లేదన్న కారణంతో ఇంటి నిర్మాణాలు ఆగిపోరాదని పేర్కొంది. ఇందుకోసం స్థానికంగా ఉండే వాగుల్లోంచి ఇసుకను ఉచితంగానే తీసుకెళ్లేందుకు అవకాశం కల్పిస్తూ మైనింగ్  డిపార్ట్ మెంట్  సెక్రటరీ మహేష్​  దత్  ఎక్కా శనివారం ఉత్తర్వులు జారీచేశారు. 

గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులకు ఇసుక కొరత లేకుండా ఉండేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ  నిర్ణయం తీసుకుందని ఉత్తర్వుల్లో తెలిపారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. స్థానిక అవసరాలకు సరిపడేంత మోతాదులో ఇసుక రవాణాకు అనుమతించాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. వివిధ గ్రామాల నుంచి ప్రజలు వారి సొంత ఇండ్ల నిర్మాణాలకు, గ్రామాల ఉమ్మడి అవసరాలకు ఇసుక విషయంలో ఇబ్బందులు పడుతున్నట్లు ప్రభుత్వానికి వినతులు వచ్చాయని, ఉచితంగా ఇసుక రవాణాకు అనుమతి ఇవ్వాలంటూ వరుసగా విజ్ఞప్తులు చేస్తున్నారని ఆ ఉత్తర్వుల్లో ఎక్కా పేర్కొన్నారు. 

గ్రామాల్లో నిర్మాణాలకు ఆటంకం లేకుండా స్థానిక అవసరాలకు సమీపంలోని వాగుల నుంచి ఇసుకను ఉచితంగా తీసుకెళ్లవచ్చని, అవసరమైనవారు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లలోనూ రవాణా చేసుకోవచ్చని వెల్లడించారు. ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుందని, ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

ముందు నుంచే ఫోకస్​ పెట్టిన సీఎం రేవంత్​

అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ఇసుకపై సీఎం రేవంత్​ రెడ్డి ఫోకస్​ పెట్టారు. గత నెలలో జరిగిన రివ్యూలోనే ఇసుక అమ్మకాలకు కొత్త విధానం తీసుకురావాలని అధికారులను ఆయన ఆదేశించారు.  ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంతో పాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండేలా పాలసీని రూపొందించాలన్నారు. దీంతో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. 

ఫలితంగా గతంతో చూస్తే రోజూ అదనంగా రూ.2 కోట్ల మేర ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతున్నట్లు తెలిసింది. ఇప్పుడున్న ఇసుక రీచ్‌‌లు, డంప్‌‌లను ఎప్పటికప్పుడు తనిఖీ చేయడంతో పాటు తప్పులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అన్ని ఇసుక రీచ్‌‌ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించి ప్రత్యేకంగా మానిటరింగ్​ చేయిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు జియో ట్యాగింగ్, జీపీఆర్‌‌ఎస్‌‌ను వినియోగంలోకి తీసుకువచ్చారు.