
- ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థన
- కేసు విచారణను 14కు వాయిదా వేసిన కోర్టు
న్యూఢిల్లీ, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ఉన్న మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్‌లో ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) రిపోర్ట్ సమర్పించేందుకు టైం ఇవ్వాలని సుప్రీంకోర్టును తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థించింది. ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. కేసు విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఎస్‌ఐబీ సెంటర్‌లో పలువురి ఫోన్లు అక్రమంగా ట్యాపింగ్ చేసినట్లు 2023 మార్చి 10న పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు ఫైల్ అయింది.
ఇందులో ప్రభాకర్ రావును ఏ1గా చేర్చారు. అయితే ఈ కేసులో అభియోగాల నేపథ్యంలో ఆయన అమెరికా వెళ్లిపోయారు. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే, తాను స్వదేశానికి తిరిగి వస్తానని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో ఆయన హైకోర్టు తీర్పును ఈ ఏడాది మే 9న సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ విచారించిన ధర్మాసనం.. మే 29న సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించడంతో ఆయన దేశానికి వచ్చి సిట్ విచారణకు హాజరవుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆ పిటిషన్ మరోసారి బుధవారం జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్‌ల ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ లూథ్రా, ప్రభాకర్ రావు తరఫున సీనియర్ అడ్వకేట్ దామా శేషాద్రి నాయుడు హాజరయ్యారు. అయితే, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిందని, దానిని సుప్రీంకోర్టుకు సమర్పించేందుకు వారం రోజుల టైమ్ ఇవ్వాలని కోరడంతో కేసును ధర్మాసనం వాయిదా వేసింది.