భూకబ్జా ఫిర్యాదులకు సెంటర్లు పెట్టాలె

భూకబ్జా ఫిర్యాదులకు సెంటర్లు పెట్టాలె

రాష్ట్రంలో ప్రస్తుతం భూ మాఫియా జడలువిప్పి పేదల నోట్లో మట్టికొడుతోంది. భూకబ్జా చేసింది ఈటలైనా ఇంకెవరైనా కుల, మత, వర్గ, లింగ, ప్రాంత, హోదాలాంటి అంశాలతో సంబంధం లేకుండా విచారణ జరిపించాలి. దోషులుగా తేలిన వారికి తగిన శిక్ష పడేలా చూడాలి. ఈటల తతంగాన్ని మూడంటే మూడే రోజుల్లో ముగించిన ముఖ్యమంత్రి.. ప్రతి జిల్లాకు ఒక్కటి చొప్పున మొత్తం 33 భూ కబ్జా ఫిర్యాదుల కేంద్రాలను ఏర్పాటు చేయాలి. వాటిలో వచ్చిన ప్రతి ఫిర్యాదును త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలివ్వాలి. నిష్పక్షపాతంగా అన్ని కేసులు పరిష్కరించి ప్రతి ఒక్క కబ్జా బాధితునికి న్యాయం చేయాలి. అప్పుడే దోపిడీరహిత, భూకబ్జారహిత తెలంగాణకు బాటలుపడి  ప్రజలు సంతోషంగా బతకగలుగుతారు.
ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన ఈటల రాజేందర్​ తొలుత వామపక్ష సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యారు. టీఆర్ఎస్ సిద్ధాంతాలు కూడా దాదాపు అలాగే ఉన్నాయని రెండు దశాబ్దాల క్రితం ఆ పార్టీలో చేరారు. ఆ రోజు మొదలుకుని నిన్న మొన్నటి వరకూ ఈటలపై బహిరంగంగా పెద్దగా ఆరోపణలు లేవు. 2014లో టీఆర్ఎస్​ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి.. పార్టీకి ఎనలేని సేవ చేసి.. కేసీఆర్​ వెన్నంటే ఉన్న ఈటలకు ఆర్థిక, పౌర సరఫరాల శాఖలను కేటాయించారు. పరిమిత అధికారాలతోనే ఆయన తన శాఖలను సమర్థవంతంగా నిర్వర్తించారు. 2018లో టీఆర్ఎస్​ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈటల మంత్రి పదవి కోసం వేచిచూడాల్సి వచ్చింది. కొంచెం ఆలస్యమైనా వైద్యవిద్య, ఆరోగ్య శాఖను అప్పగించారు.
వ్యతిరేకత వస్తుందనే మంత్రి పదవి ఇచ్చిన్రు
ఇతర పార్టీల నుంచి గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి వరకూ ఎంతో మంది నేతలు టీఆర్ఎస్​లో చేరారు. ఈ క్రమంలో పార్టీలో కొత్త వాళ్లకు ప్రాధాన్యత పెరిగి.. ఏండ్లుగా అంటిపెట్టుకుని ఉన్నవారికి ప్రయారిటీ తగ్గడం మొదలైంది. ఈ పరిస్థితులు ఉద్యమకాలం నుంచి పార్టీనే నమ్ముకున్నవారికి రుచించలేదు. ఈ కారణాల వల్లే ఈటలకు మంత్రి పదవి రావడం ఆలస్యమైనా.. తప్పనిసరి పరిస్థితుల్లోనే కేసీఆర్​ ఆయనకు పదవిని కట్టబెట్టారు. ఈటలకు పదవి ఇవ్వకపోతే తెలంగాణ సమాజానికి, ముఖ్యంగా ఉద్యమంలో పనిచేసిన వారికి, బీసీ కులాల వారికి తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఆందోళన దానికి కారణం. దీని వల్ల ప్రభుత్వం వ్యతిరేకతను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయని ముందుగానే పసిగట్టిన కే‌‌సీఆర్, ఈటలకు బెర్త్ ఖాయం చేశారు.
సర్కార్​ను ఇరుకున పెట్టేలా ఈటల కామెంట్లు
మంత్రి పదవి ఒకరి భిక్ష కాదని, అలాగని బీసీ అయినందున వచ్చింది కూడా కాదని ఒక సందర్భంలో ఈటల అన్నారు. ఉద్యమంలో ప్రాణాలకు తెగించి తెలంగాణ ఆత్మగౌరవం కోసం కొట్లాడితేనే ఈ పదవి వచ్చిందన్నారు. తామే గులాబీ జెండా ఓనర్లమని, పదవి శాశ్వతం కాదు- ప్రజలకు చేసిన సేవ ముఖ్యమని మరో సందర్భంలో అన్నారు. ఆ తర్వాత పలు సందర్భాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా కొన్ని కామెంట్లను ఈటల చేస్తూ వచ్చారు. ఈ కామెంట్లతో కేసీఆర్​కు, ఈటలకు మధ్య ఏదో అగాధం ఏర్పడిందని ప్రజలకు అర్థమైంది. మరోవైపు, ఆరోగ్యశాఖ మీద పట్టులేకపోవడం, నిర్ణయాధికారం తన పరిధిలో లేకపోవడం, పార్టీలో విలువ తగ్గడం వంటి అంశాలు ఈటల మనసు విరిగేలా చేశాయి. ఉద్యమ సమయంలో చేసిన వాగ్దానాలకు, స్వరాష్ట్రంలో  అమలవుతున్న పథకాలకు పొంతనలేదని ఆయన గ్రహించారు. ప్రజల ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా నడవని పాలనలో ఈటల ఇమడలేకపోయారు. 
భూకబ్జా ఆరోపణలపై రాజకీయ దుమారం
ఇటీవల ఈటలపై భూకబ్జా ఆరోపణలు రావడం రాష్ట్రంలో రాజకీయ దుమారాన్నే లేపింది. అధికార పార్టీకి చెందిన టీవీ చానల్, మరికొన్ని చానల్స్​ కలిసి మాసాయిపేట్ మండలంలోని అచ్చంపేట, హకీంపేట్ గ్రామాల్లో ఈటల అసైన్డ్​ భూములను ఆక్రమించాడని వార్తలు ప్రసారం చేశాయి. బాధిత రైతులు నేరుగా సీ‌‌ఎం కేసీ‌‌ఆర్ కు లెటర్​ రాయడం, ఆయన ఆగమేఘాల మీద విచారణకు ఆదేశించడం అన్నీ గంటల్లో జరిగిపోయాయి. చారణ నివేదిక అందకుండానే ఈటల నిర్వహిస్తున్న ఆరోగ్య శాఖను సీ‌‌ఎంకు బదిలీ చేస్తూ, ఆ తర్వాత ఆయనను కేబినెట్​నుంచి తొలగిస్తున్నట్టు గవర్నర్ కార్యాలయం ప్రకటించింది. ఈ‌‌ పరిణామాలన్నింటినీ నిశితంగా చూస్తే సగటు తెలంగాణవాదికి రాజకీయంగా ఈటలను దెబ్బతీయడానికి ప్లాన్​ ప్రకారం కుట్ర పన్నారని అనిపించకమానదు. ఇన్నిరోజుల నుంచి వెంట ఉన్న వ్యక్తి తప్పు చేశాడని అనిపిస్తే పిలిచి వివరణ అడగాల్సింది. మంత్రి పదవి నుంచి తప్పుకుని విచారణకు సహకరించాలని సూచించాల్సింది. విచారణ తర్వాత నిజానిజాలు నిగ్గుతేల్చి తదుపరి(క్రమశిక్షణ) చర్యలకు దిగాల్సింది. ఈ విషయంలో కే‌సి‌ఆర్ రాజనీతిని ప్రదర్శించాల్సింది. ప్రత్యేక రాష్ట్రం కోసం గొంగళి పురుగునైనా ముద్దాడతానన్న కేసీఆర్.. ఉద్యమ కాలంలో, పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు గొంగళ్లుగా మారిన ఆణిముత్యాల్లాంటి నాయకులను అణగదొక్కడం అందరినీ షాక్​కు గురిచేస్తోంది.
ఆత్మగౌరవమే గొప్పదన్న ఈటల
తనపై వచ్చిన ఆరోపణలపై మీడియాలో స్పందించిన ఈటల ఒక్క పొల్లు మాట కూడా అనలేదు. మీడియాతో మాట్లాడుతున్నంతసేపు నోరు జారిందీ లేదు, నొసలు కొట్టుకున్నదీ లేదు. ధైర్యంగా, ఓపికగా, లౌక్యంగా ఎవరినీ పల్లెత్తు మాట అనకుండా మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా వల్ల ఆరోగ్య రంగం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నందున ఈటల వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయలేకపోయారు. తాను ఏ తప్పు చేయలేదనే నమ్మకం ఒకవైపు, రాజ్యాంగబద్ధమైన మంత్రి పదవికి గౌరవం ఇవ్వాలనే బుద్దికుశలత మరోవైపు ఆయనను  స్థితప్రజ్ఞత ప్రదర్శించేలా చేశాయి. తనకు మంత్రి పదవి కంటే ఆత్మగౌరవం గొప్పదని ఈటల స్పష్టం చేశారు. 
ఈటల అడుగులు ఎటువైపో?
కేసీ‌‌ఆర్ ఆడిన ఆటలో ఈటల మొదటి పావు కాదు అలాగని చివరి పావూ కాదు. గాదె ఇన్నయ్యతో మొదలై దేశిని చినమల్లయ్య, ఆలె నరేంద్ర, విజయరామారావు, దిలీప్ కుమార్, విజయశాంతి, ప్రొ.కోదండరాం, స్వామి గౌడ్, వివేక్ వెంకటస్వామి ఇంకా ఎందరెందర్నో రాజకీయంగా దెబ్బతీస్తూ ఇప్పుడు ఈటలనూ తాకింది. ఈటల రాజకీయ భవిష్యత్తు ఏమిటనేది త్వరలోనే తేలనుంది. టీఆర్ఎస్​లోనే కొనసాగుతారా? వేరే పార్టీలో చేరుతారా? కలిసివచ్చే నాయకులతో కొత్త పార్టీని పెడతారా? అనేది కాలమే నిర్ణయిస్తుంది. బీసీల్లో బలమైన నాయకుడిగా ఈటలకు పేరుంది. అది ఆయనకు కలిసివచ్చే అంశం. ప్రస్తుతానికి ఈటల తన రాజకీయ భవిష్యత్ గురించి సన్నిహితులతో సంప్రదిస్తున్నారు. వారి సూచనలు, సలహాల ఆధారంగా త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ‘తెలంగాణ పునర్నిర్మాణం’ పేరిట రాజకీయ పునరేకీకరణ జరిగితే తప్ప ప్రజలకు ప్రయోజనం ఉండదు.-డాక్టర్ గోసికొండ శ్రీరాములు,అసిస్టెంట్ ప్రొఫెసర్, హైదరాబాద్.