
- ఎన్ని ప్రమాదాలు జరిగినా చర్యలు తీసుకోని సర్కారు
- నాడు ఎల్లూరు పంప్‌హౌస్ మునిగినా స్పందించలే
- మొన్న ‘పాలమూరు’లో ఐదుగురు కార్మికులు చనిపోయినా పట్టించుకోలే
- రాళ్లు, కంకర, ఇసుకను అక్రమంగా ఏపీకి తరలించినా సైలెంట్
- నార్లాపూర్ పంప్‌హౌస్ పనులు తగ్గించుకుని, రూ.వెయ్యి కోట్లు పెంచుకున్న కంపెనీ
- అప్పనంగా అనుమతులిచ్చిన రాష్ట్ర సర్కారు
నాగర్ కర్నూల్, వెలుగు: పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో తరచూ ప్రమాదాలు జరిగి భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం వాటిల్లుతున్నా కాంట్రాక్ట్ సంస్థపై రాష్ట్ర సర్కారు కనీస చర్యలు తీసుకోవడం లేదు. రూల్స్‌కు విరుద్ధంగా అండర్ టన్నెల్లో బ్లాస్టింగులు చేయడం వల్లే రెండేండ్ల కింద కల్వకుర్తి ఫస్ట్ లిఫ్ట్‌లోని ఎల్లూరు పంప్‌హౌస్ నీట మునిగిందనే ఆరోపణలు వచ్చినా పట్టించుకోలేదు. ఈ ఘటనపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక కూడా బయటకు రాకుండా తొక్కిపెట్టారు.
మొరం, రాళ్లు ఏపీకి తరలించినా స్పందించ లేదు
ఇక్కడి మొరం, రాళ్లు, కంకర, ఇసుకను అక్రమంగా ఏర్పాటు చేసిన జెట్టి ద్వారా ఏపీకి తరలించినా స్పందించ లేదు. పాలమూరు–రంగారెడ్డి పనులు ఆపేస్తున్నామని గతేడాది అక్టోబర్‌లో ఎన్జీటీకి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అఫిడవిట్ ఇస్తే.. మేఘా కంపెనీ మాత్రం నార్లాపూర్, వట్టెంలో 3షిఫ్టుల్లో పంప్‌హౌస్ పనులు చేస్తున్నది. గురువారం రాత్రి నార్లాపూర్ పంప్‌హౌస్ వద్ద జరిగిన ప్రమాదంలో ఐదుగురు వలస కార్మికులు చనిపోవడంతో దానిపై ఏమని వివరణ ఇచ్చుకోవాలో తెలియక ఇరిగేషన్ఆఫీసర్లు తలపట్టుకుంటున్నారు. మేఘా కంపెనీ వెనుకాల ప్రభుత్వ పెద్దలు ఉన్నందునే ఆఫీసర్లు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారని రిటైర్డ్ ఇంజనీర్లు చెబుతున్నారు.
ముంచిన మేఘాకే బాగు చేసే బాధ్యతలు
పాలమూరు అండర్ టన్నెల్ అప్రోచ్ కెనాల్ బ్లాస్టింగ్ వల్లే కల్వకుర్తి ప్రాజెక్టులోని ఎల్లూరు పంప్‌హౌస్ నీట మునిగిందనే వార్తలు వచ్చాయి. పాలమూరు మొదటి పంప్‌హౌస్ నిర్మాణానికి ఎంపిక చేసిన స్థలం, అండర్ గ్రౌండ్‌లో నిర్మించడం సాంకేతికంగా సరైంది కాదని ఇంజనీర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాంట్రాక్టర్ల ఒత్తిడితో ఓపెన్ కట్ పంప్‌హౌస్‌కు బదులు అండర్ గ్రౌండ్ పంప్‌హౌస్ నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చింది. మొదట కేఎల్ఐ ఫస్ట్ లిఫ్ట్ ఎల్లూరుకు కిలోమీటరున్నర దూరంలో నార్లాపూర్ ఓపెన్ పంప్‌హౌస్‌ను ప్రతిపాదించగా.. దాన్ని అండర్ గ్రౌండ్ పంప్‌హౌస్‌గా మార్చి కేఎల్ఐ పంప్‌హౌస్‌కు 250 మీటర్ల దూరంలోకి తీసుకొచ్చారు. అండర్ గ్రౌండ్ అప్రోచ్ కెనాల్ తవ్వడానికి చేసిన బ్లాస్టింగ్ ధాటికి 2020 అక్టోబర్ 16న ఎల్లూరు పంప్‌హౌస్ నీటముని 18 నెలలైనా కల్వకుర్తి పంపులను బాగు చేయలేదు. మేఘాపై చర్యలు తీసుకోలేదు.
పనులు తగ్గించుకుని.. పైసలు పెంచుకున్నరు
పాలమూరు– రంగారెడ్డిలో భాగంగా నార్లాపూర్ వద్ద నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ పంప్‌హౌస్‌కు ఒక వైపు కల్వకుర్తి ఫస్ట్ లిఫ్ట్.. మరోవైపు కృష్ణా నది ఉన్నాయి. స్థలం చాలక నిర్మాణాలను ఇరికించి కడుతున్నారు. రూ.3,208 కోట్లతో ప్రతిపాదించిన అంచనా వ్యయం కంటే తక్కువ ఖర్చుతో నిర్మిస్తామని చెప్పి ఇప్పుడు ఏకంగా రూ.1,000 కోట్లు అదనంగా పెంచారు.
ఏపీ ప్రాజెక్టుకు.. మన కంకర, మొరం
కృష్ణా నదికి ఇరువైపులా ఇటు తెలంగాణలో పాల మూరు పనులు, అటు ఏపీలో రాయలసీమ లిఫ్ట్(సంగమేశ్వరం) పనులను మేఘా కంపెనీనే దక్కించుకుంది. రాయలసీమ లిఫ్ట్ నిర్మాణానికి అవసరమైన కంకర, రాళ్లు, మొరం, ఇసుక తెలంగాణలోని నల్లమల అటవీ ప్రాంతం నుంచి తరలించింది. దీనికోసం ఒక భారీ జెట్టీ తయారు చేయించింది. జెట్టీ కారణంగా కృష్ణానదిలో చేపల వేటపై ఆధారపడ్డ మత్స్యకారులు, చెంచుల వలలు తెగిపోయి కొట్టుకుపోయాయి. స్థానికులు ఫిర్యాదులు చేసినా ఫారెస్ట్, రెవెన్యూ, మైనింగ్ఇరిగేషన్, పోలీస్ అధికారులు పట్టించుకోలేదు.
మూడు ప్రమాదాల్లో 11 మంది కార్మికులు మృతి
నార్లాపూర్ పంప్‌హౌస్ వద్ద ఐదుగురు వలస కార్మికుల మృతికి కారణమైన కాంట్రాక్ట్ సంస్థకు ఇప్పటివరకు ఇటు ఇంజనీరింగ్ ఆఫీసర్లు గానీ, అటు లేబర్ఆఫీసర్లుగానీ కనీసం నోటీసులు ఇవ్వలేదు. పోలీసులు మాత్రం అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదు చేశారు. అంతకుముందు పాలమూరు టన్నెల్ బ్లాస్టింగ్‌లో ముగ్గురు, టిప్పర్ బోల్తా పడి ముగ్గురు చనిపోయారు. ఇప్పటికి మూడు ప్రమాదాల్లో 11 మంది కార్మికులు చనిపోయినా కాంట్రాక్ట్సంస్థపై ప్రభుత్వం ఈగ వాలనివ్వలేదు.
ఆఫీసర్ల పర్యవేక్షణ లేదు.. లేబర్ లెక్క లేదు..
పాలమూరు- రంగారెడ్డిలో భాగమైన వట్టెం, నార్లాపూర్, ఏదుల రిజర్వాయర్లు, పంప్‌హౌస్, సర్జ్‌పూల్, అండర్ టన్నెల్స్‌లో వందలాది మంది వలస కార్మికులు పనిచేస్తున్నా కాంట్రాక్ట్ ఏజెన్సీలు, కార్మిక శాఖ దగ్గర వారి వివరాలు లేవు. పగలు రాత్రి తేడా లేకుండా మూడు షిప్టుల్లో పనిచేసే కార్మికులకు హెల్మెట్, సేఫ్టీ బెల్టులు చాలా ముఖ్యం. కానీ హెల్మెట్లతో సరిపెడుతున్నారు. లేబర్ డిపార్ట్‌మెంట్ నుంచి అసిస్టెంట్ కమిషనర్ క్యాడర్ ఆఫీసర్ ప్రతి వారం సైట్ ఇన్‌స్పెక్షన్ చేయాల్సి ఉంటుంది. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్‌ను ప్రాజెక్ట్ సైట్‌లో విధుల్లో ఉంచాలి. వలస కార్మికులను పనిలో పెట్టుకునే లేబర్ కాంట్రాక్టర్‌కు మైగ్రేటెడ్ లేబర్ లైసెన్స్ విధి గా ఉండాలి. సొంత రాష్ట్రం, పని చేసే రాష్ట్ర కార్మిక శాఖల వద్ద వలస కార్మికుల వివరాలు ఉండాలి. ప్రమాదవశాత్తు కార్మికులు చనిపోతే ఇన్సూరెన్స్, పరిహారం రెండు వర్తించేలా చూడాల్సిన లేబర్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు మేఘా కంపెనీ పేరు వింటేనే భయపడిపోతున్నారు. జంతువుల కంటే హీనంగా కార్మికులను ఉంచుతున్నారు.
నోటీసులు ఎవరికి?
పాలమూరు–రంగారెడ్డి పనులు ప్రారంభించిన 2015లో ఫస్ట్ ప్యాకేజీలో రూ.3,224 కోట్ల విలువైన పంప్‌హౌస్ పనులను రూ.3,208 కోట్లకు నవయుగ దక్కించుకుంది. కానీ ప్రభుత్వం నవయుగ కంపెనీని తప్పించి మేఘాకి అప్పగించింది. అయితే ప్రాజెక్ట్ పనులు మేఘా కంపెనీ చేస్తున్నా రికార్డుల్లో మాత్రం నవయుగ కంపెనీతో లావాదేవీలు నడుపుతున్నట్లు చూపిస్తున్నారు. గురువారం రాత్రి ప్రమాదం జరిగిన దుర్ఘటనలో ఎవరికి నోటీసులు ఇవ్వాలో అర్థం కాక ఆఫీసర్లు తలలుపట్టుకుంటున్నారు.