ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టులపై ఫోకస్​

ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టులపై ఫోకస్​
  •    వేగవంతంగా పూర్తి చేసేలా అధికారుల చర్యలు
  •    కల్వకుర్తి, పాలమూరు పూర్తికి 2025 మార్చి వరకు డెడ్​లైన్
  •    కొడంగల్​ లిఫ్ట్​ స్కీమ్ ​పైనా ప్రత్యేక దృష్టి
  •    ఆర్డీఎస్, నెట్టెంపాడు లాంటి ప్రాజెక్టులనూ త్వరగా పూర్తిచేసేలా కసరత్తు 


హైదరాబాద్, వెలుగు : ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పెండింగ్​ప్రాజెక్టులపై రాష్ట్ర సర్కారు దృష్టి సారించింది. ఏడాదిలోనే ముఖ్యమైన ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తిచేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు, కల్వకుర్తి లిఫ్ట్​ఇరిగేషన్​ స్కీమ్స్​తోపాటు కొత్తగా చేపట్టనున్న కొడంగల్ లిఫ్ట్​ ఇరిగేషన్​ స్కీమ్​పై అధికారులు దృష్టి సారించారు.  పాలమూరు, కల్వకుర్తి లిఫ్ట్​ ఇరిగేషన్​ స్కీమ్​లను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేసేలా సీఎం రేవంత్​ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది.

అయితే, చాలా వరకు పనులు పెండింగ్​లో ఉన్న నేపథ్యంలో వచ్చే ఏడాది డిసెంబర్​వరకు టైం ఇవ్వాలని అధికారులు అడుగుతున్నట్టు తెలిసింది. డెడ్​లైన్​ను దృష్టిలో పెట్టుకొని అధికారులు వేగంగా చర్యలు చేపడుతున్నారు. ఇటు ఆర్డీఎస్​, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులపైనా అధికారులు ఫోకస్​ పెట్టారు. దీనిపై సోమవారం ఇరిగేషన్​శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి.. జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది. దీంతో ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన కీలక ఫైళ్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఎక్కడెక్కడ పెండింగ్​పనులున్నాయి? ప్రాజెక్టుల పనులకు ఏర్పడుతున్న అడ్డంకులేమిటి? లాంటి వివరాలను మంత్రికి అధికారులు అందించనున్నట్టు తెలిసింది. 

కల్వకుర్తికి ఇంకో ఏడాది 

తెలంగాణ చరిత్రలోనే అత్యంత లేట్​ అయిన ప్రాజెక్ట్.. కల్వకుర్తి లిఫ్ట్​ ఇరిగేషన్​ స్కీమ్​. 1984లో  ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తే.. 2014లోగానీ పనులకు మోక్షం కలగలేదు. ఇప్పటికీ ఆ ప్రాజెక్టు పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. ఈ లిఫ్ట్​ స్కీమ్​లో భాగంగా 4.50 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇంకా 1.74 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే పనులు పెండింగ్​లో ఉన్నాయి. ఈ స్కీమ్​లోని 29, 30వ ప్యాకేజీ పనులు పెండింగ్​లో పడిపోయాయి. 29వ ప్యాకేజీలో భాగంగా 1.05 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లివ్వాలని టార్గెట్​పెట్టుకున్నారు. అయితే, పలు చోట్ల 1,670 ఎకరాల భూములను ఇంకా సేకరించాల్సిన అవసరం ఉంది. అయితే, అందుకు చాలా చోట్ల రైతులు అడ్డుపడుతున్నారు.

మరోవైపు సేకరించిన భూములకుగానూ రైతులకు  గత ప్రభుత్వం పరిహారం సక్రమంగా ఇవ్వలేదన్న ఆరోపణలూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆ భూసేకరణ, పరిహారం విషయాలను ప్రస్తుత ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరం ఏర్పడింది. ఇటు 30వ ప్యాకేజీలో భాగంగా 14  వేల ఎకరాలు.. దానికి ఎక్స్​టెన్షన్​గా అచ్చంపేట బ్రాంచి కెనాల్​ను 15 కిలోమీటర్ల మేర నిర్మించి, మరో 16 వేల ఎకరాలకు నీళ్లందించాల్సి ఉంది. ఈ పనులను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేసేలా డెడ్​లైన్​ విధించారు. ఇదే ప్యాకేజీలో వనపర్తి జిల్లాలోనూ 49 వేల ఎకరాల ఆయకట్టుకూ నీళ్లిచ్చేందుకు పనులు చేపట్టాల్సి ఉంది.

ఈ వర్క్స్​ను 2025 డిసెంబర్​ లేదా 2026 తొలి త్రైమాసికం నాటికి పూర్తి చేసేలా టార్గెట్​పెట్టుకున్నారు. అందులో భాగంగానే వాటి పనులను పూర్తి చేసేందుకు వేగవంతంగా చర్యలు చేపడుతున్నారు. సీఎం రేవంత్​రెడ్డి సొంత నియోజకవర్గంలో చేపడుతున్న కొడంగల్–నారాయణపేట ​లిఫ్ట్​ ఇరిగేషన్​ స్కీమ్​పైనా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఆ ప్రాజెక్టు టెండర్లపై కసరత్తులు మొదలుపెట్టే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాల ద్వారా తెలుస్తున్నది. 

గత సర్కారు నిర్లక్ష్యం.. పెండింగ్​లోనే పాలమూరు ప్రాజెక్టు

పాలమూరు– రంగారెడ్డి లిఫ్ట్​ స్కీమ్​కు 2015లో శంకుస్థాపన చేసినా.. ​ఇప్పటికీ పెండింగ్​లోనే ఉన్నది. గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈ ప్రాజెక్టు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ఈ ప్రాజెక్టులో రూ.15 లక్షల విలువైన పనులు పెండింగ్​లో ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. మొత్తం 34 భారీ మోటార్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో నిరుడు సెప్టెంబర్​లో గత ప్రభుత్వం తొలి మోటార్​ను ప్రారంభించింది. నార్లాపూర్​ పంప్​హౌస్​లోని తొమ్మిది పంపుల్లో ఒక మోటార్​ను డ్రైరన్​ చేశారు. పూర్తయిన ఫేజ్​ కూడా జస్ట్​ తాగు నీటి అవసరాల కోసం చేపట్టిన పనులే. అది తప్ప ఆ ప్రాజెక్ట్​ను పూర్తి చేయడంలో గత సర్కార్​ నిర్లక్ష్యం వహించింది.

సాగునీటికి సంబంధించి ఏపీ కొర్రీలు పెడుతుండడంతో వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని సర్కారు ప్రయత్నిస్తున్నది. ఈ ప్రాజెక్టును తొలుత 6 రిజర్వాయర్లుగా నిర్మించాలనుకున్నారు. నార్లాపూర్​, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్ధండాపూర్​, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్లలో నీటిని నింపుకొని, ఆయకట్టుకు నీళ్లివ్వాలని మొదట భావించారు. కానీ, ఆ తర్వాత గత సర్కారు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్​ను వద్దనుకున్నది. ఉద్ధండాపూర్​వరకు నిర్మించి నీటిని తరలించాలనుకుంది. 

లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్​ను కట్టకుండా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లివ్వాలని గత ప్రభుత్వం యోచించిందని, అందుకే లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్​ను పక్కనపెట్టిందని అధికార వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో అక్కడిదాకా కాదు కదా.. అసలు ఎంత వరకు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు ఎత్తిపోసుకోవచ్చో కూడా సందిగ్ధత ఏర్పడిందని, ఈ క్రమంలోనే ప్రస్తుత ప్రభుత్వం లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్​నూ నిర్మించేందుకు నిర్ణయించిందని చెప్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది డిసెంబర్​నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.