వరి కొనుగోలు కేంద్రాల ఊసే లేదాయె!

వరి కొనుగోలు కేంద్రాల ఊసే లేదాయె!

నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా వర్షాకాలం సీజన్ లో 4 లక్షల 20 వేల ఎకరాల్లో వరి సాగు జరిగింది. గత 10 రోజులుగా వరి కోతలు ఊపందుకున్నాయి. రైతులు రోడ్లపై ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. ప్రాథమిక సహకార సంఘాలు, ఐకేపీ కేంద్రాల ద్వారా ధాన్యం కొంటామని ప్రభుత్వం చెప్పినా... ఇప్పటివరకు పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు.  దీంతో రోడ్లపై ఆరబోసిన ధాన్యం దగ్గర రాత్రంతా చలిలో కాపలా ఉంటున్నారు రైతులు. 

నిజామాబాద్ జిల్లాలోని 430 కొనుగోలు కేంద్రాల ద్వారా  25లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కొనాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఎమ్ఎల్ఏలు, ప్రజాప్రతినిధులు ఉన్న చోటే కొనుగోలుకేంద్రాలు మొదలయ్యాయి. బాన్సువాడ కేంద్రంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. నియోజక వర్గంలోని మిగితా కొనుగోలు కేంద్రాలు ఇంకా తెరుచుకోలేదు. మంత్రి ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గం బాల్కొండలో కొనుగోలు కేంద్రాల ఊసే లేదంటున్నారు రైతులు. 

ఇక కామారెడ్డి జిల్లాలో 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని నిర్ణయించారు. అయితే ఇప్పటివరకు కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాల్లో వరి ఎక్కువగా సాగవుతోంది. బాన్సువాడలో వరి కోతలు దాదాపు పూర్తయ్యాయి. అయినా కొనుగోలు కేంద్రాలు తెరుచుకోలేదంటున్నారు రైతులు.  ప్రారంభమైన కొనుగోలు కేంద్రాల్లో హమాలీలు, గన్నీ సంచుల కొరత తీవ్రంగా ఉంది. లారీల కొరత కూడా ఉంది.