
- మహిళా సంఘాల సహకారంతో అడ్మిషన్లు
- ఇప్పటికే 35 వేల వరకు అడ్మిషన్లు పూర్తి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వివిధ కారణాలతో చదువు మధ్యలో ఆపేసిన వారికి మళ్లీ చదువును అందించేందుకు సర్కారు ప్రణాళికలు రూపొందించింది. అలాంటి వారిని గుర్తించి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రాయించాలని డిసైడ్ అయింది. దీనికోసం మహిళా సంఘాల సహకారాన్ని తీసుకుంటున్నది. ఈ సారి లక్ష మందికి అడ్మిషన్లు కల్పించాలని టార్గెట్ పెట్టుకున్నది. దానికి తగ్గట్టుగా చర్యలు కొనసాగిస్తోంది.
వివిధ కారణాలతో చదువు మధ్యలో ఆపేసిన యువకులకు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) టెన్త్, ఇంటర్మీడియెట్ కోర్సులకు పరీక్షలు నిర్వహించి దాంట్లో పాసైన వారికి సర్టిఫికెట్లు అందిస్తోంది. 2009–10 నుంచి ఎస్ఎస్సీ, 2010–11 నుంచి ఇంటర్ కోర్సును ప్రారంభించారు. ప్రస్తుతం 33 జిల్లాల్లో 739 ఎస్ఎస్సీ, 778 ఇంటర్ స్టడీ సెంటర్లున్నాయి.
ఎస్ఎస్సీలో అడ్మిషన్ పొందే టైమ్‌కు ఆగస్టు 31 నాటికి 14 ఏండ్లు, ఇంటర్ అడ్మిషన్ పొందే టైమ్‌కు ఆగస్టు 31 నాటికి 15 ఏండ్లు నిండాల్సి ఉంటుంది. ఇప్పటికే పూర్తిగా నిరక్షరాస్యులుగా ఉన్న వారిని అక్షరాస్యులుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అడల్ట్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ‘ఉల్లాస్’ కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. తెలంగాణలో ఈ ఉల్లాస్ కార్యక్రమానికి టాస్ అడ్మిషన్లను లింకు చేసి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ సారి అడ్మిషన్ల టార్గెట్ లక్షకు పెంపు..
ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలకు ప్రతిఏటా సుమారు 60 వేల మంది అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ఈ ఏడాది విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా వీటిపై ప్రత్యేక దృష్టి సారించి, టాస్ అడ్మిషన్ల టార్గెట్ ను లక్షకు పెంచారు. దీనికి సెర్ప్, మహిళా సంఘాల సహకారం తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. దీనికి అనుగుణంగా ‘ఉల్లాస్’ కార్యక్రమానికి టెన్త్ లోపే చదివిన వాలంటీర్లుగా ఉన్న మహిళా సంఘాల ప్రతినిధులందరికీ ఓపెస్ టెన్త్ పరీక్షలు రాయించాలని సూచించారు.
దీంతో ఇప్పటికే జిల్లాల్లో లక్షన్నర మందిని అధికారులు గుర్తించారు. వారిని రిజిస్ట్రేషన్లు చేయించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే 35 వేల వరకు అడ్మిషన్లు పూర్తయ్యాయి. ఈ నెలాఖరు వరకు అడ్మిషన్లు కొనసాగుతుండటంతో, గుర్తించిన వారందరితో పరీక్షలు రాయించేలా ప్లాన్ చేస్తున్నారు.
కొనసాగుతున్న అడ్మిషన్ల ప్రక్రియ
రాష్ట్రవ్యాప్తంగా టాస్ అడ్మిషన్ల ప్రక్రియ నడుస్తోంది. ఇప్పటివరకు అత్యధికంగా కరీంనగర్ లో 2,348 అడ్మిషన్లు టార్గెట్ పెట్టుకోగా.. ఏకంగా 40,900 మందిని గుర్తించారు. ఖమ్మం, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి వంటి జిల్లాల్లో కూడా టార్గెట్ కు మించి ఐడెంటిఫై చేశారు. అయితే, హైదరాబాద్ జిల్లాలో టాస్ టార్గెట్ 19,419 ఉండగా.. 18,361 మందిని గుర్తించారు, వారిలో కేవలం అడ్మిషన్ల శాతం 9.56%గా నమోదైంది.
యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లో టార్గెట్ కంటే తక్కువగా ఐడెంటీఫై చేశారు. వనపర్తి జిల్లాలో టాస్ టార్గెట్ 2,241 ఉండగా.. కేవలం 750 మందిని మాత్రమే గుర్తించారు. నారాయణపేట జిల్లాలో 1,544 టార్గెట్‌కు 438 మందిని గుర్తించారు. కాగా, టార్గెట్ కంటే ఎక్కువగానే ఐడెంటిఫై చేశామని, త్వరలోనే వారందరినీ అడ్మిషన్లు చేయిస్తామని టాస్ డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు.