
తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళి సై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని అగౌరవపరిచిన తీరు చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ప్రభుత్వ వైఖరిపై కేంద్రానికి ఇవ్వాల్సిన రిపోర్టు ఇచ్చానని గవర్నర్ స్పష్టం చేశారు. రిపబ్లిక్ వేడుకలు జరపడం ఇష్టంలేని రాష్ట్ర సర్కారు వేడుకలు నిర్వహించకపోవడానికి చెప్పిన సాకు నవ్వు తెప్పించిందని అన్నారు.
పుదుచ్చేరిలో మీడియాతో మాట్లాడిన తమిళి సై ‘ రిపబ్లిక్ వేడుకలు జరపాలని రెండు నెలల క్రితం తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశా.. దాన్నిపక్కన పెట్టి రాజ్‌భవన్‌లో నిర్వహించాలని రెండు రోజుల క్రితమే లేఖ ఇచ్చారు. ఆ లేఖలో కూడా సీఎం హాజరవుతారని పేర్కొనలేదు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఆదేశాలను పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘనలు, కేసీఆర్ ప్రభుత్వంపై కేంద్రానికి నివేదిక ఇచ్చా.5 లక్షల మందితో ఖమ్మంలో సభ నిర్వహిస్తే గుర్తుకు రాని కరోనా నిబంధనలు.. రిపబ్లిక్ వేడుకలకు గుర్తుకు వచ్చాయా?. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారు’’ అని ఆమె అన్నారు.