తెలంగాణకు కొత్త గవర్నర్ రాబోతున్నారా?

తెలంగాణకు కొత్త గవర్నర్ రాబోతున్నారా?

 

  • ఇయ్యాల ఢిల్లీకి తమిళిసై
  • అమిత్ షాతో భేటీ కానున్న గవర్నర్
  • లోక్‌‌సభ ఎన్నికల్లో పోటీగురించి చర్చించే చాన్స్
  • హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే రాష్ట్రానికి కొత్త గవర్నర్

హైదరాబాద్, వెలుగు: ప్రస్తుతం పుదుచ్చేరి పర్యటనలో ఉన్న రాష్ట్ర గవర్నర్ తమిళిసై మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. బీజేపీ అగ్ర నేత, కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. వచ్చే లోక్‌‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని ఆమె కోరనున్నట్లు సమాచారం. తమిళనాడులోని సౌత్ చెన్నై లేదా తిరునల్వేలి నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలవాలని తమిళిసై భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఎంపీగా పోటీ చేసేందుకు తమిళిసైకి ప్రధాని మోదీ, అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇస్తే వచ్చే నెలలో రాష్ట్రానికి కొత్త గవర్నర్‌‌‌‌ను కేంద్రం నియమించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నది. వచ్చే నెలలో రాష్ట్ర గవర్నర్ మార్పు ఖాయమంటూ చర్చ సాగుతున్నది. మరోవైపు తాను పోటీ చేయబోయే నియోజకవర్గంలో జనవరి నుంచి విసృతంగా పర్యటించాలని తమిళిసై ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది. 2019 సెప్టెంబర్‌‌‌‌లో రాష్ట్ర గవర్నర్‌‌‌‌గా తమిళిసై నియమితులయ్యారు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 4 ఏండ్ల టర్మ్ పూర్తయింది.

పొలిటికల్ లీడరా.. రిటైర్డ్ ఆఫీసరా?

రాష్ట్రానికి కొత్త గవర్నర్‌‌‌‌ను నియమించాల్సి వస్తే పొలిటికల్‌‌ లీడర్‌‌‌‌కు చాన్స్ దక్కుతుందా లేదా రిటైర్డ్ ఆఫీసర్‌‌‌‌కు అవకాశం వస్తుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో గవర్నర్ గా తమిళనాడుకు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి నరసింహన్‌‌ను అప్పటి యూపీఏ ప్రభుత్వం నియమించింది. 2014లో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన్నే కొనసాగించింది. తర్వాత ఎన్డీయే సెకండ్‌‌ టర్మ్‌‌లో తమిళిసైని నియమించింది. మరోవైపు ఎన్డీయే హయాంలో రాజకీయాలకు సంబంధం లేని పలువురిని గవర్నర్లుగా నియమించింది. కేరళ, ఏపీలకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిలను, కేంద్ర మంత్రులుగా ఉన్న వారిని గవర్నర్లుగా నియమించిన దాఖలాలు ఉన్నాయి. లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 10 సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకున్న నేపథ్యంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారిని గవర్నర్‌‌‌‌గా నియమిస్తారనే ప్రచారం సాగుతున్నది.