చదువుల్ని చంపేసి..సంబురాలా?

చదువుల్ని చంపేసి..సంబురాలా?

పదేండ్ల కింద ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు తమకు న్యాయం జరగాలని, విద్య ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతుందని నూతన రాష్ట్రం ఏర్పడితే, ఉద్యోగాలొస్తాయని పడ్డ ఆరాటం కళ్లారా చూశాను. 2009 నుంచి 2011 వరకు ఉద్యమకాలంలో ఓఎస్డీగా పనిచేసిన సమయంలో ఉదయం విధుల్లో ఉండి, సాయంకాలం స్టూడెంట్లతో కలిసి వారి చదువు, కుటుంబ నేపథ్యం, యూనివర్సిటీ సమస్యలు తదితర అన్ని విషయాల గురించి చర్చించేవాడిని. ఆ రెండేండ్లలో నేను, పోలీసు ఆఫీసర్ నుంచి మరోసారి విద్యార్థి దశకు వెళ్లినట్లుగా ఉండేది. స్టూడెంట్లతో మాట్లాడినపుడు నిస్వార్థంగా వారు నాతో చెప్పిన విషయాలు, వారి కమిట్​మెంట్ ఇప్పటికీ నాకు యాదికున్నయి. వారిలో కొందరు ప్రాణత్యాగం చేశారు, కొందరు గోడలు దూకి నడుములు విరగ్గొట్టుకున్నారు, ఇంకొందరు వికలాంగులుగా కూడా మారారు. స్టూడెంట్లెవరూ అగ్గిపెట్టె దొరకలేదని వెనక్కి పోలేదు, జైలు గోడలకు భయపడి పారిపోలేదు, ముళ్లకంచెలను చూసి నోరు మూసుకోలేదు. సీన్ కట్ చేస్తే పదేండ్ల తరువాత కూడా సొంత రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ముందు విద్యార్థులు న్యాయం కావాలని విద్య, ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతున్నదని పోరాడుతూనే ఉన్నారు. పేపర్ లీకేజీ గురించి కూడా మాట్లాడకుండా జైలు మాదిరిగా మార్చేశారు. 

వర్సిటీల ర్యాంకులు ఎందుకు పడిపోతున్నయ్

ఉస్మానియా యూనివర్సిటీలో పదేండ్ల కింద టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులు 550 ఖాళీలు ఉంటే, పదేండ్ల తరువాత ఆ సంఖ్య 1000కి పెరిగింది. అంటే ప్రస్తుత కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఒక్క ప్రొఫెసర్ పోస్టును కూడా భర్తీ చేయలేదు, కానీ తమకు అనుకూలంగా ఉన్న, చెప్పినట్టు తలూపే వారికి మాత్రం వైస్ చాన్స్​లర్ పదవులిచ్చి స్టూడెంట్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. అందుకే దేశంలో ఉస్మానియా యూనివర్సిటీ ర్యాంకు గతేడాది 46 ఉండగా, ఈ సంవత్సరం 64 కు పడిపోయింది. కాకతీయ యూనివర్సిటీకి నిధుల కొరత ఎందుకున్నది.314 కోట్లు అధికారులు అడిగితే కేవలం  రూ.127 కోట్లు కేటాయించడం వివక్ష కాదా? అందులో  రూ.120 కోట్లు ఉద్యోగుల జీతాలకు పోతే యూనివర్సిటీ నడిచేది ఎలా? 400 మంది ప్రొఫెసర్లు ఉండాల్సిన చోట కేవలం 92 మంది మాత్రమే ఉంటే యూనివర్సిటీ విద్యా ప్రమాణాలు ఎలా మెరుగుపడతాయి? ఇందువల్లనే కదా కాకతీయ యూనివర్సిటీ 44వ ర్యాంక్ నుండి 82 కి దిగజారింది.

రూ.100 కోట్ల ఉత్సవాలకు.. రూ.150 కోట్లతో ప్రచారం

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల కోసం రూ.102 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, ఈ ఉత్సవాలను గురించి ప్రచారం చేసుకోవడానికి  మాత్రం రూ.150 కోట్లు ఖర్చు చేస్తున్నది. బడ్జెట్ లో సీఎం స్పెషల్​డెవలప్​మెంట్​ ఫండ్ కింద రూ.10 వేల కోట్లు కేటాయించుకొని, సొంత ప్రచారం కోసం రూ.1000 కోట్లు కేటాయించారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు రూ.5 వేల కోట్లు మాత్రం విడుదల చేయట్లేదు? మన ఊరు–మనబడి పథకం పనులను రూ.7 వేల కోట్లు కమీషన్లు ఇచ్చే కంపెనీలకు కట్టబెట్టడంపై ఉన్న శ్రద్ధ, విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్ సకాలంలో ఇవ్వడంపై ఎందుకు లేదు? ఐఐఐటీ బాసర విద్యార్థులు ఒక్కసారి రాష్ట్ర సీఎం మా యూనివర్సిటీ సందర్శించాలని 20 రోజులు ధర్నా చేస్తే ఎందుకు పోలేదో సమాధానం చెప్పాలి. ఈ పదేండ్లలో ఎన్ని గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించారో ప్రజలకు చెప్పాలి. కనీసం టాయిలెట్స్ కూడా లేని స్కూళ్లలో, బాత్రూంలలో కుక్కలు పడుకునే కాలేజీల్లో విద్యాదినోత్సవం ఎలా జరుపుతారు? 30 లక్షల మంది నిరుద్యోగ యువత పేపర్ లీకేజీ సమస్యతో అయోమయంలో ఉంటే, కనీసం ఆ మాట కూడా ఎత్తని సీఎం విద్య గురించి ఏం మాట్లాడతారు? ఇప్పటికీ 20 వేల టీచర్ పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి. విద్యావాలంటీర్లను నియమించుకునే అవకాశం లేదు. వీటన్నింటికీ సమాధానం చెప్పకుండా ఎలా విద్యా ఉత్సవాలు జరుపుతారు?

హాస్టళ్లలో ఫుడ్​పాయిజన్​లు ఎందుకైతున్నయ్?

ప్రభుత్వ యూనివర్సిటీలను గాలికొదిలేసి ప్రైవేట్ యూనివర్సిటీలకు ఎందుకు అనుమతి ఇస్తున్నారో ఈ ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీల ఎన్నికల ఖర్చు భరించేంత సొమ్ము ఉన్న కేసీఆర్ పాలించే రాష్ట్రంలో హాస్టళ్లలో పేద పిల్లలు ఫుడ్​పాయిజన్ ఘటనలలో అనారోగ్యం బారిన పడాల్సిన దుస్థితి ఎందుకొచ్చిందో చెప్పాలి. ఇలాంటి విద్యావ్యతిరేక ప్రభుత్వం మనకు అవసరమా? కేవలం మన బహుజన రాజ్యంలో మాత్రమే పేద బిడ్డలకు అంతర్జాతీయ స్థాయి విద్య అందుతుంది. బహుజన రాజ్యంలోనే తెలంగాణ అమరుల ఆశయాలు నెరవేరుతాయని గుర్తించాలి. ఒకవైపు లీకులు చేస్తూ, ఇంకోవైపు విద్యాదినోత్సవం జరిపే దొంగల ప్రభుత్వాన్ని గద్దెదించాలి. 

పేదలు చదువుకోవడం కేసీఆర్​కు నచ్చదు

కేసీఆర్ కు పేద పిల్లలకు చదువు చెప్పడం ఇష్టం ఉండదు. గురుకులాల సెక్రటరీగా పని చేసిన కాలంలో ఒక అధికారిగా చాలా సందర్భాల్లో ఈ విషయం నేను గమనించాను. పేద పిల్లలకు ఏ సౌకర్యం కల్పించాలని ప్రయత్నం చేసినా నెలల తరబడి ఫైల్స్ పెండింగ్ లో ఉండేవి. గురుకుల విద్యార్థులతో ఇంకెన్నో అద్భుతాలు చేయాలని ప్రయత్నించినా, అడుగడుగున అడ్డుకునే ప్రయత్నమే జరిగింది. పేద పిల్లలు పేదలుగానే ఉండాలని, విదేశాలకు వెళ్లడం, కంపెనీలకు యజమానులు కావడం, గొప్ప పారిశ్రామికవేత్తలుగా తయారుకావడం, విదేశీ యూనివర్సిటీలలో ఉన్నతంగా చదవడం మన సీఎంకు నచ్చదు. అందుకే ఢిల్లీలో చదివే 300 మంది పేద విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కూడా లేకుండా చేశారు. తెలంగాణ ప్రజలు,విద్యార్థి లోకం ఇది గమనించాలి. పేపర్ లీకేజీ అంశంపై నెల రోజుల కింద ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీలో విద్యార్థుల నుద్దేశించి మాట్లాడేందుకు వెళ్లినప్పుడు 2009-11 మధ్య విద్యార్థుల నుంచి ఏ సమస్యలు విన్నానో, మళ్లీ అదే సమస్యలు వారి నోటివెంట పదేండ్ల తరువాత కూడా విన్నాను. పదేండ్లలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి ఇదేనా అని బాధపడ్డాను. తెలంగాణ వచ్చాక విద్యారంగంలో వచ్చిన మార్పేమిటో విద్యాదినోత్సవం రోజు సీఎం చెప్పాలి.

- డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు, బహుజన్ సమాజ్ పార్టీ