కొడంగల్​కు కడా.. డెవలప్‌‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేసిన సర్కార్​

కొడంగల్​కు కడా.. డెవలప్‌‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేసిన సర్కార్​

హైదరాబాద్/వికారాబాద్, వెలుగు: కొడంగల్ ఏరియా డెవలప్‌‌‌‌మెంట్ అథారిటీ (కడా)ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. శనివారం ఈ మేరకు స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు ఇచ్చారు. వికారాబాద్, నారాయణపేట జిల్లాల పరిధిలో ఉన్న కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వికారాబాద్ హెడ్ క్వార్టర్స్‌‌‌‌లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఈ అథారిటీ పని చేయనుంది. కలెక్టర్ నియంత్రణలో పని చేసేలా ఈ అథారిటికీ ప్రత్యేక అధికారిని నియమించి, కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి సమగ్ర మాస్టర్ ప్లాన్‌‌‌‌ను సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఆరుగురు సభ్యులు ఉన్న ఈ కమిటీలో నియోజకవర్గ స్థాయి అధికారులను నియమిస్తారు. అలాగే ‘కడా’ ద్వారా చేపట్టే కార్యక్రమాలను పర్యవేక్షించడానికి, ఆర్థిక శాఖతో సంప్రదించి బడ్జెట్‌‌ను అందించడానికి ప్రణాళికా విభాగం నోడల్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. సీసీ రోడ్లు, సీసీ డ్రెయిన్లు, నీటి సరఫరా, విద్యుదీకరణ, వినూత్న జీవనోపాధి కార్యక్రమాలు చేపట్టడం, నైపుణ్యాన్ని పెంచేలా శిక్షణ, ఆరోగ్యం, సామాజిక అభివృద్ధి, విద్య వంటి కార్యక్రమాలను ఈ అథారిటీ చూడనున్నది. భూగర్భ జలాలు, సహజ వనరులను సమర్థంగా ఉపయోగించుకోవడం, వ్యవసాయ అభివృద్ధి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను స్థాపించి వాటిని ప్రోత్సహించనున్నది.

‘కడా’ ప్రత్యేక అధికారిగా వెంకట్​రెడ్డి

కడా ప్రత్యేక అధికారిగా నాగర్ కర్నూల్ జిల్లా ఆర్డీవో వెంకట్​రెడ్డిని సర్కారు నియమించింది. వెంకట్ రెడ్డికి  డిప్యూటీ కలెక్టర్ గా పదోన్నతి కల్పిస్తూ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ ఆదేశాలు జారీ చేశారు. కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్ మున్సిపాలిటీ, కొడంగల్ రూరల్ మండలం, దౌల్తాబాద్, దుద్యాల మండలాలు వికారాబాద్ జిల్లాలో ఉండగా, కోస్గి మున్సిపాలిటీ, కోస్గి రూరల్ మండలం, గుండుమల్, కొత్తపల్లి మండలాలు నారాయణపేట జిల్లాలో ఉన్నాయి. రెండు జిల్లాల ఉన్నతాధికారులు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది.