
- రూ.10,547 కోట్లతో చేపట్టబోయే పనులకు ఆమోదం
- 32 ప్యాకేజీలుగా పనులు, వారం రోజుల్లో టెండర్లు పిలవనున్న ఆర్‌అండ్‌బీ శాఖ
- నల్గొండ జిల్లాలో అత్యధికంగా రూ.1,242 కోట్లతో, ములుగులో తక్కువగా 71.5 కోట్లతో పనులు
- 6,294.81 కోట్లతో పంచాయతీరాజ్ రోడ్లకు టెండర్లు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్‌అండ్‌బీ శాఖ తరఫున రూ.10,547 కోట్లతో చేపట్టే పనులకు గురువారం రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పనులను మొత్తం 32 ప్యాకేజీలుగా విభజించగా.. టెండర్లు పిలిచేందుకు ఆ శాఖ ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. 32 జిల్లాల పరిధిలో చేపట్టనున్న ఈ పనులకు సంబంధించిన నిధుల్లో రూ. 1,242 కోట్లతో నల్గొండ జిల్లా టాప్ ప్లేస్‌లో నిలువగా.. తక్కువగా రూ. 71.50 కోట్లతో ములుగు జిల్లాలో పనులు జరగనున్నాయి. హ్యామ్ ప్రాజెక్ట్ కిందనే రూ.6,294.81 కోట్లతో పంచాయతీరాజ్ శాఖ 2,162 రోడ్లను బాగు చేయనుంది. 96 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 7,449.5 కిలోమీటర్ల దూరం రోడ్లకు శుక్రవారం టెండర్లు పిలిచారు.
వర్షాలతో అధ్వానంగా మారిన రోడ్లు
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్ శాఖ రోడ్లు చాలా చోట్ల దెబ్బతిన్నాయి. కల్వర్టులు, బ్రిడ్జిలు కూలిపోవడంతో రవాణా వ్యవస్థ దెబ్బతింది. పదేండ్ల కింద రూ.10 వేల కోట్లతో రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. ఆ తర్వాత అడపాదడపా డ్యామేజీలకు రిపేర్లు చేయడం మినహా పెరుగుతున్న ట్రాఫిక్‌కు అనుగుణంగా రోడ్లను విస్తరించలేదు. ఏండ్లు గడిచినా సింగిల్ రోడ్లు, డబుల్ రోడ్లు అలాగే ఉండిపోయాయి. గ్రామాల్లో అయితే మట్టి రోడ్లపై బీటీ పోసిందే లేదు. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టిన అప్పటి ప్రభుత్వం ఆ తర్వాత మళ్లీ పట్టించుకున్న పాపనపోలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం హ్యామ్ స్కీమ్ కింద గ్రామీణ, మండల, జిల్లా కేంద్రాల్లోని రోడ్లను బాగు చేయనుంది.
400 రోడ్లకు.. రూ.10,547 కోట్లు
రాష్ట్రంలో ఆర్‌అండ్‌బీ శాఖ తరఫున రూ.10,547 కోట్లతో 32 జిల్లాల పరిధిలోని 400 రోడ్లను బాగు చేయనున్నారు. ఈ మేరకు గురువారం సెక్రటేరియట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్‌లో 5,566 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో రూ.2,377 కోట్లతో 866 కిలోమీటర్ల రోడ్లను సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్‌గా మార్చనుండగా.. రూ.2,637 కోట్లతో 779 కిలోమీటర్ల డబుల్ లేన్ రోడ్లను పది మీటర్ల రోడ్డుగా అభివృద్ధి చేయనున్నారు. అలాగే రూ.735 కోట్లతో 124 కిలోమీటర్ల డబుల్ లేన్ రోడ్లను నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. మొత్తం 1,791 కిలోమీటర్ల రోడ్లకు రూ.6,152 కోట్లు ఖర్చు చేయనున్నారు. అలాగే రూ.4,395 కోట్లతో 3,775 కిలోమీటర్ల రోడ్లను బలోపేతం చేయనున్నారు. ఇందులో సింగిల్ లేన్ -768, డబుల్ లేన్ 2,618, పది మీటర్ల వెడల్పు గల రోడ్లు 148, నాలుగు వరుసల రోడ్లు 221 కిలోమీటర్ల దూరం ఉన్నాయి. పనులను మొత్తం 32 ప్యాకేజీలుగా విభజించి వారం రోజుల్లో టెండర్లు పిలిచేందుకు ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు.
టాప్‌లో నల్గొండ జిల్లా
ఆర్‌అండ్‌బీ శాఖ నిర్మించే హ్యామ్ రోడ్ల నిధుల్లో నల్గొండ జిల్లా టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఈ జిల్లాలో రూ.1,242 కోట్లతో 32 రోడ్లను, ఖమ్మం జిల్లాలో రూ.919 కోట్లతో 37 రోడ్లను బాగు చేయనున్నారు. సంగారెడ్డి జిల్లాలో రూ.621 కోట్లు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో రూ.529 కోట్లు, కరీంనగర్ జిల్లాలో 99.85 కోట్లతో పనులు చేస్తుండగా.. అత్యల్పంగా ములుగు జిల్లాలో రూ.71.5 కోట్లతో పనులు చేపట్టనున్నారు.
రూ. 6294.81 కోట్ల పంచాయతీరాజ్ పనులకు టెండర్లు
పంచాయతీ రాజ్ శాఖ తరఫున రూ. 6,294.81 కోట్లతో 7,449.50 కిలోమీటర్ల మేర చేపట్టాల్సిన 2,162 రోడ్ల నిర్మాణానికి పంచాయతీ రాజ్ శాఖ శుక్రవారం టెండర్లు పిలిచింది. 17 ప్యాకేజీల పరిధిలో పీఆర్ రోడ్ల నిర్మాణం, స్థాయి పెంపు, పటిష్టపరచడం, నిర్వహణకు సంబంధించి గుర్తింపు కోసం అనుమతి పొందిన సంస్థల నుంచి ప్రపోజల్స్ తీసుకుంటామని ఆఫీసర్లు ప్రకటించారు. ఈ మేరకు పీఆర్ ఈఎన్‌సీ ఆఫీసర్లు నోటిఫికేషన్ ఇచ్చారు. మొత్తం 30 నెలల్లో రోడ్లను నిర్మించి, వాటిని 15 ఏండ్ల పాటు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ వ్యయానికి 40 శాతం నిధులను ప్రభుత్వమే నిర్మాణ దశలో చెల్లిస్తుండగా, మిగిలిన 60 శాతం ఫండ్స్ ను కాంట్రాక్టర్లు బ్యాంకుల ద్వారా సమీకరిస్తారు. రహదారుల నిర్మాణం పూర్తయిన తర్వాత 15 ఏండ్లలో ఇతర బిల్లులను ప్రభుత్వం చెల్లిస్తుంది.
ఉమ్మడి జిల్లాల వారీగా హ్యామ్ రోడ్లు, నిధుల వివరాలు
ఉమ్మడి జిల్లా రోడ్ల సంఖ్య కేటాయించిన
నిధులు (రూ.కోట్లల్లో)
ఆదిలాబాద్ 30 1094.88
కరీంనగర్ 48 966.91
ఖమ్మం 47 1300.76
మహబూబ్‌నగర్ 46 1403.82
మెదక్ 44 1014.41
నల్గొండ 59 1842.45
నిజామాబాద్ 25 571
రంగారెడ్డి 39 1089.42
వరంగల్ 62 263.74