రాష్ట్ర ప్రభుత్వ తీరుతో ప్రజలకు అన్యాయం

రాష్ట్ర ప్రభుత్వ తీరుతో ప్రజలకు అన్యాయం
  • ఐదేళ్లుగా రూ. 10 కోట్లు కూడా ఇయ్యని రాష్ట్రం 
  • రాష్ట్ర ప్రభుత్వ తీరుతో రాష్ట్ర ప్రజలకు అన్యాయం
  • నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ నిధులు తగ్గిస్తూ వస్తున్న కేంద్రం 
  • ఈ సారి ఫండ్స్ రిలీజ్ కు నో

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: జాతీయ ఆహార భద్రతా మిషన్ (ఎన్‌‌‌‌ఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌ఎం) నిధులను వినియోగించడంలో రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడింది. కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నా రాష్ట్ర సర్కారు తన వాటా నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా పార్లమెంట్‌‌‌‌ సమావేశాల సందర్భంగా కేంద్రం ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల్లో సైతం రాష్ట్రం విధుల వినియోగంలో వెనుకబాటు స్పష్టమైంది. అయితే, తెలంగాణ తన వాటా సొమ్ము కేటాయించడం లేదని కేంద్ర వర్గాలు అం‍టుంటే.. కేంద్రమే తగిన కేటాయింపులు చేయడం లేదని రాష్ట్ర వర్గాలు చెప్తున్నాయి.  

కేంద్రం నిధులతోనే సరి 
జాతీయ ఆహార భద్రతా మిషన్‌‌‌‌ కింద కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు కేటాయిస్తే, 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం కలిపి పనులు చేయాల్సి ఉంటుంది. కేంద్రం ముందుగా తన వాటాలో సగం నిధులను రిలీజ్ చేస్తే.. ఆ మేరకు రాష్ట్రం తన వాటాలో సగం నిధులను రిలీజ్ చేసి, ఖర్చు చేయాలి. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను సక్రమంగా ఇవ్వకపోవడంతో కేంద్రం తన వాటాలో సగం నిధులతోనే సరిపెడుతోంది. దీంతో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది. 2019-20లో కేంద్రం రూ. 32.65 కోట్లు కేటాయించింది. కానీ ఈ నిధుల్లో రూ. 15.05 కోట్లను మాత్రమే విడుదల చేసింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.10.91 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. రాష్ట్ర సర్కారు తన 40 శాతం వాటా సొమ్ము చెల్లించలేదు. దీంతో మిగతా కేంద్ర వాటా రాలేదు. ఇలా గత ఐదేళ్లలో రాష్ట్రం కనీసం రూ. 10 కోట్లు కూడా కేటాయించక పోవడంతో భారీగా నిధులు కోల్పోవాల్సి వచ్చింది.  

ఎన్‌‌‌‌ఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌ఎం అమలులో నిర్లక్ష్యం 
పంటల దిగుబడులను పెంచడం ద్వారా ఆహారధాన్యాల ఉత్పత్తిని పెంచడం జాతీయ ఆహార భద్రతా మిషన్ ప్రధాన లక్ష్యం. బెస్ట్‌‌‌‌ అగ్రికల్చర్‌‌‌‌ ప్రాక్టీసెస్‌‌‌‌పై రైతులకు అవగాహన కల్పించాలి. అధిక దిగుబడినిచ్చే రకాలు, హైబ్రిడ్‌‌‌‌ సీడ్స్‌‌‌‌ పంపిణీ, టెక్నాలజీ, మెషినరీలను రైతులకు అందుబాటులోకి తేవాలి. ప్లాంట్‌‌‌‌ ప్రొటెక్షన్‌‌‌‌, నూట్రియంట్స్‌‌‌‌ నిర్వహణ,  సాయిల్‌‌‌‌ హెల్త్‌‌‌‌ పెంచే చర్యలు, ప్రాసెసింగ్ యూనిట్లు, పంటల కోత అనంతరం యంత్రాల వినియోగంపై రైతులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇండియన్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ ఫర్‌‌‌‌ అగ్రికల్చర్‌‌‌‌ రీసెర్చ్‌‌‌‌, అగ్రికల్చ్‌‌‌‌ యూనివర్సిటీలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, సైంటిస్టుల పర్యవేక్షణలో రైతులకు అవసరమైన టెక్నాలజీని అందించాలి. కానీ రాష్ట్రంలో ఈ మిషన్‌‌‌‌ అమలుకు అవసరమైన నిధుల కేటాయింపు, విడుదలలో నిర్లక్ష్యం కనిపిస్తోందని అధికారులు అంటున్నారు.

 

ఈ సారి నిధులు నిల్  
ఎన్‌‌‌‌ఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌ఎం కింద 2021-22 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం అన్ని రాష్ట్రాలకు కలిపి రూ. 1,471 కోట్లు కేటాయించింది. అందులో రూ. 609 కోట్లు విడుదల చేసింది. అత్యధికంగా మధ్యప్రదేశ్‌‌‌‌కు రూ. 282.67 కోట్లు కేటాయించి, రూ. 169.56 కోట్లు విడుదల చేసింది. ఆ తరువాత రాజస్థాన్‌‌‌‌కు రూ.199.50 కోట్లు కేటాయించి రూ. 89.50 కోట్లు విడుదల చేసింది. యూపీకి 119.85 కోట్లు కేటాయించి, రూ.52.73 కోట్లు విడుదల చేసింది. మహారాష్ట్రకు రూ.139.33 కోట్లు కేటాయించి, రూ.44.68 కోట్లు విడుదల చేసింది. కర్ణాటకకు రూ.121.74 కోట్లు కేటాయించి, రూ.82.34 కోట్లు విడుదల చేసింది. అస్సాంకు రూ.102.29 కోట్లు కేటాయించి, రూ.15.83 కోట్లు విడుదల చేసింది.  ఇందులో  తెలంగాణకు రూ. 21.94 కోట్లు కేటాయించగా, రాష్ట్రం నిర్లక్ష్యం కారణంగా ఈ సారి పైసా కూడా విడుదల కాలేదని అగ్రికల్చర్‌‌‌‌ వర్గాలు అంటున్నాయి.